కిర్లంపూడి: అంబటి రాంబాబుపై కేసు నమోదు | Ambati Rambabu Booked For Allegedly Obstructing Police During Mudragada Padmanabham’s Funeral, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

కిర్లంపూడి: అంబటి రాంబాబుపై కేసు నమోదు

Jul 16 2026 8:43 AM | Updated on Jul 16 2026 11:53 AM

Ambati Rambabu Booked Over Mudragada Padmanabham’s Funeral Row

సాక్షి, కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది.

ముద్రగడ పద్మనాభం మృతిచెందిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. తమ కుటుంబ నిర్ణయం మేరకే అంతిమ కార్యక్రమాలు జరపాలని స్పష్టం చేశారు. అయితే.. ప్రభుత్వం తరఫున పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ముద్రగడ అంత్యక్రియల సమయంలో.. గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ నిర్వహించే సమయంలో అంబటి రాంబాబు, మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఉన్నతాధికారుల సమక్షంలోనే విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఆరోపించారు.

ఈ ఘటనపై ఏఆర్‌ ఎస్‌ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇస్తున్న సమయంలో అంబటి రాంబాబు పోలీసులను తోసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలపై బీఎన్‌ఎస్‌ 132, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

మరోవైపు.. వైఎస్సార్‌సీపీ నేతలు ఈ కేసును ఖండిస్తున్నారు. ముద్రగడ కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను వద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ.. ప్రభుత్వం బలవంతంగా గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ నిర్వహించిందని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement