నిండా రెండేళ్లు పూర్తి కాని వివాహ బంధం. దానికి ప్రతిఫలంగా పుట్టిన ఏడు నెలల బిడ్డ. అన్యోన్యంగా సాగుతోందని బంధువులు అనుకున్న కాపురం. భార్య వివాహేతర సంబంధం కాలనాగులా మారి భర్తను కాటేసింది. భార్య తోడ్పాటుతో ఆమె ప్రియుడి చేతిలో భర్త హతమయ్యాడు. జీవిత భాగస్వామి పన్నిన వ్యూహంలో చిక్కుకుని అతను ప్రాణాలు కోల్పోయాడు.
సాక్షి, చిత్తూరు : శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ బోయనపల్లికి చెందిన యువతికి రెండేళ్ల క్రితం తమిళనాడులోని సూలగిరికి చెందిన రమేష్‌తో పెద్దలు పెళ్లి చేశారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారని ఇరు కుటుంబాల వారు భావించారు. ఏడు నెలల క్రితం ఆ యువతి ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రెండు నెలల క్రితం అత్తారింటికి వెళ్లింది. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటే ఆమెకు పుట్టిన ఊరిలో మరో యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలని భార్య ప్రియుడితో కలిసి పథకం పన్నింది. రెండు రోజుల క్రితం ఆమె భర్త రమేష్ తో కలిసి పుట్టింటికి వచ్చింది.
మంగళవారం భర్త, బిడ్డను గుడుపల్లి మండలంలోని మల్లప్ప కొండౖపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రియుడికి చేరవేసింది. అతను తన స్నేహితుడితో కలిసి మల్లప్పకొండపై ఆలయానికి వెళ్లే మార్గంలో కాపు కాసి బైకును అడ్డుకున్నట్టు తెలిసింది. దాడి జరుగుతోందని గమనించిన రమేష్ తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో రోడ్డు నుంచి దాదాపు 100 మీటర్లు తనను వెంబడించిన ప్రియుడు, తన స్నేహితుడు విచక్షణారహితంగా నరికినట్టు సంఘటనా స్థలంలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం యువతి, తన ప్రియుడు, ప్రియుడి స్నేహితుడు కలిసి మృతుడికి చెందిన బైకుపైనే వెళ్లిపోయినట్టు సమాచారం.
చంటి బిడ్డతో గుడికి వెళ్లిన దంపతులు తిరిగిరాకపోవడంతో బంధువులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. వారు పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో మల్లప్ప కొండపై శవం ఉందనే సమాచారం రావడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యువతి తన భర్తతో కలిసి మల్లప్ప కొండ వైపు వెళ్తున్న దృశ్యాలను సీసీటీవీ పుటేజీల్లో గుర్తించారు. భర్త శవం దొరకడంతో భార్య, బిడ్డ ఏమయ్యారని ఆరా తీశారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి యువతి బైకుపై వెళుతున్నట్టు సీసీ టీవీల్లో తేలింది. భార్య, తన ప్రియుడు మరో వ్యక్తితో కలిసి రమేష్ ను హతమార్చినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న యువతి ఇంకా మైనర్ అని బోయనపల్లి గ్రామస్తులు చెప్పారు. రెండేళ్ల క్రితం తను 9వ తరగతి చదువుతుండగానే ఈ బాలికకు పెద్దలు పెళ్లి చేశారని పేర్కొన్నారు.


