బూటకాల‘మారి టైం’! | Land grabbing in the name of Nexus Integrated Logistics Park | Sakshi
Sakshi News home page

బూటకాల‘మారి టైం’!

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

Land grabbing in the name of Nexus Integrated Logistics Park

లేని కంపెనీకి 63 ఎకరాలు కేటాయింపు

చంద్రబాబు సర్కారు మరో మహా మాయ

నెక్సస్‌ ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ పార్క్‌ పేరిట భూ దోపిడీ

రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో ఆ పేరున ఏ కంపెనీ లేదు

అయినా రూ.కోట్లు పలికే భూమి ఎకరా రూ.28 లక్షలకే కేటాయింపు

ఏపీ మారిటైం బోర్డుకు భూమి లేకపోయినా కేటాయిస్తూ ఉత్తర్వులు

మారిటైం బోర్డు ఈ భూమిని సేకరించి కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీకి ఇవ్వాలట!

రూ.255 కోట్ల పెట్టుబడిలో కొత్త కంపెనీ రూ.165.75 కోట్ల రుణం ద్వారా సేకరిస్తుందట!

ఇందుకోసం రూ.252 కోట్ల భూమిని రూ.17 కోట్లకే ఇచ్చేసిన సర్కారు

ఈ ప్రాజెక్టు వెనుక చక్రం తిప్పిన మారిటైం బోర్డు చైర్మన్‌!

సాక్షి, అమరావతి: కార్పొరేట్లకు భూ సంతర్పణలో చంద్రబాబు సర్కారు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంతకాలం అస్మదీయులు, అప్పుడే ఏర్పాటు చేసిన కంపెనీలకు భూములు కేటాయిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా భవిష్యత్తులో పెట్టే కంపెనీకి భూమిని గంపగుత్తగా కేటాయిస్తూ ఏకంగా ఉత్తర్వులనే ఇచ్చిపడేసింది. ఇంకో విచిత్రం ఏమిటంటే కంపెనీ యాజమాన్యం దగ్గర ప్రస్తుతం పెట్టుబడికీ డబ్బులు కూడా లేవట... బ్యాంకుల నుంచి రూ.165.75 కోట్లు రుణం తీసుకొని మరీ ఏర్పాటు చేస్తారంట.. ఈ విషయం జీవోలోనే స్పష్టంగా చెప్పిన సర్కారు రూ.వందల కోట్ల విలువైన భూమిని పప్పుబెల్లం కింద ధారాదత్తం చేసిందంటే దీనివెనుక ఉన్న శక్తుల పవర్‌ ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

నెక్సస్‌ ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ పార్క్‌ అనే సంస్థ రూ.255 కోట్లతో తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్నఈటిపాకం వద్ద ఏర్పాటు చేసే లాజిస్టిక్‌ పార్క్‌ కోసం ఎకరా రూ.28 లక్షలు చొప్పున 63.01 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  శ్రీసిటీ రెండో దశలో కేటాయించిన భూమిలో ఏర్పాటు చేస్తున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌కు, అలాగే కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌కు మధ్యలో ఈ భూమి ఉంది. శ్రీ సిటీకి ఎదురుగా ఉండటమే కాకుండా పలు కంపెనీల మధ్యలో ఈ భూమి ఉండటంతో భూమి ధర రూ.కోట్లలో పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో ఈ 63 ఎకరాల భూమి ధర రూ.252 కోట్లపైనే ఉంటుందని, ఇంతటి విలువైన భూమిని నెక్సస్‌ ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు కేవలం రూ.17.64 కోట్లకే ఇచ్చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏఐకీ దొరకని కంపెనీ
రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌లోనే కాదు గ్రోక్, చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌కూ నెక్సస్‌ ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ పార్క్‌ అనే కంపెనీ ఎక్కడుందన్న విషయం అంతుపట్టడం లేదు. ఆర్వోసీలో నెక్సస్‌ పేరున చాలా కంపెనీలు ఉన్నా ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం భూములిచ్చిన కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ కంపెనీ గురించి పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ అధికారులను ఆరాతీయగా చెన్నైకి చెందిన అజూర్‌ ట్రేడింగ్‌ అండ్‌ స్టోరేజ్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ ఆతోట వెంకటేశ్వర్లు, తారకేశ్వర టెక్స్‌టైల్‌ పార్క్‌ ఎండీ జవ్వాజి రామాంజనేయులు మరో ఇద్దరు కలిసి ఈ ప్రతిపాదన పంపారని, దీన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నామే కానీ ఆ పేరు మీద కంపెనీ ఏర్పాటైందా లేదా అన్న విషయాన్ని పరిశీలించలేదని వివరించారు. ఈ నలుగురు కలిసి రూ.89.25 కోట్ల నిధులను సమకూర్చుకుంటామని, మిగిలిన రూ.165.75 కోట్లు బ్యాంకుల నుంచి రుణం ద్వారా ఈక్విటీగా సేకరిస్తామని ప్రతిపాదనలను ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 

మారిటైం బోర్డుకు సంబంధం ఏంటి?
అక్కడ ఎటువంటి పోర్టులూ లేవు.. భూమి మొత్తం పారిశ్రామిక పార్కుల మధ్యలో ఉంది. అటువంటి భూమిని ఏపీఐఐసీ కాకుండా ఏపీ మారిటైం బోర్డు సేకరించి ఇస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రైవేటు పార్కుల పాలసీ ద్వారా ఈ భూమిని అభివృద్ధి చేయకుండా కారు చౌకగా ఒక సంస్థకు కట్టబెట్టడంపై అధికారవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా ఏదైనా పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) భూమి సేకరించి ఇస్తుందని, కానీ ఎక్కడో అమరావతిలో కార్యాలయం ఉన్న ఏపీ మారిటైం బోర్డుకు ఈ భూసేకరణ పని అప్పగించడంపై పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు.

ప్రస్తుతం ఆ భూమికి ఇంకా ఎటువంటి సరిహద్దులు కూడా నిర్ణయించలేదు.. భూ సేకరణ పూర్తి కాలేదు. కానీ 63.01 ఎకరాలను నెక్సస్‌ ఇంటిగ్రేటెడ్‌ పార్కుకు కేటాయిస్తూ హడావిడిగా ఉత్తర్వులు జారీ చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మారిటైం బోర్డు చైర్మన్‌గా ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత దామచర్ల సత్యకి ఆతోటి వెంకటేశ్వర్లుకి వ్యాపార సంబంధాలుండటమే దీనికి కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement