ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తీర్చాలని డిమాండ్
తిరుపతి రూరల్: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం, రెగ్యులరైజేషన్, పాత పెన్షన్ విధానం అమలు, పీఆర్‌సీ ప్రకటించాలంటూ సీఐటీయూ, స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగులు బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు మహా ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా కాంట్రాక్టు కార్మికులు తరలివచ్చారు. కార్మికులు లక్ష్మీపురం సర్కిల్ నుంచి ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల మీదుగా నినాదాలు చేస్తూ ఎస్పీడీసీఎల్ కార్యాలయానికి ర్యాలీ వచ్చారు. ధర్నానుద్దేశించి కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికి రూ.48 వేల వేతనాన్ని అమలు చేయాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆగస్టు 10న ‘చలో విజయవాడ’ చేపడతామని ప్రకటించారు.


