భీమవరంలో వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం , వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
నాలుగు నెలల్లో ఆక్వా ఫీడ్ రేట్లు కిలోకు రూ.14–16 పెంచారు
పెంచింది రూ.16.. తగ్గించేది మాత్రం రెండు రూపాయలా?
ఇలాగైతే ఆక్వా రైతులు ఏ రకంగా బతుకుతారు?
మరోపక్క సిండికేట్‌గా ఏర్పడి ఉత్పత్తి ఖర్చులు పెంచుతున్నారు
తీరా పంట చేతికొచ్చాక మళ్లీ సిండికేట్‌గా మారి రేట్లు తగ్గిస్తున్నారు
వీటిని చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు
దీంట్లో నీకింత–నాకింత అంటూ వాటాలు పంచుకుంటున్నారు
ఎవరూ అధైర్య పడొద్దు.. వచ్చేది మళ్లీ మనందరి ప్రభుత్వమే
అప్సడాకు పూర్వ వైభవం తెస్తాం..
ప్రతి రైతుకు తోడుగా నిలబడతాం
మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా.. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను’ అని మీ అందరికీ చెబుతున్నా. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికే మరో మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుందని గర్వంగా చెప్పగలుగుతా. ఈరోజు మీరు చూపిస్తున్న ఈ ఆదరణ, అభిమానానికి నిజంగా నోటి నుంచి మాట రానంతగా భావోద్వేగం కలుగుతోంది. ఇసుక వేసినా రాలనంతగా కంటి చూపు మేరలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించనంతగా ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు.
చంద్రబాబు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఆ సిండికేట్‌కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్లే కన్నీళ్లు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు మార్చాలని చెప్పి తపన, తాపత్రయ పడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అని గర్వంగా చెప్పగలను. మన హయాంలో ప్రతి రైతును అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపించాం. ఈ రోజు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు.
ఆక్వా ఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు సానుభూతి పరులవే. దాంతో వాళ్లు ఎలా కావాలి అంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్ కొనేటప్పుడు రేటు ఎంతో వాళ్లే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు కూడా ధర వాళ్లే నిర్దేశిస్తారు. ఆక్వా రైతన్నలు లక్షలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తే, తీరా ఆ పంట (రొయ్యలు) చేతికి వచ్చేసరికే వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి, రేట్లు ఢమాల్ అని పడిపోయేలా చేస్తున్నారు. ఈ రోజు ఇలా చంద్రబాబు సానుభూతిపరుల సిండికేట్ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నడిపిస్తోంది. ఫలితంగా ఆక్వా రైతుల బతుకులు ఆ సిండికేట్ చేతుల్లో నలిగి పోతున్నాయి.
– వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆక్వా సిండికేట్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా ఆక్వాలో సిండికేట్‌దే పెత్తనమని మండిపడ్డారు. ఆయన అనుయాయ వర్గీయులే ఏవో కారణాలు, సాకులు చెప్పి అడ్డగోలుగా మేత ధరలు పెంచడంతోపాటు పంట ధరలను తగ్గించేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిలో ఆక్వా రైతులకు, రాష్ట్ర రైతాంగానికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ఆక్వాలో ఇప్పుడున్న సిండికేట్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలించేసి.. అప్సడాకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. 
సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఆక్వాతో 15 లక్షల మందికి ఉపాధి
ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తే లక్షన్నరకు పైగా రైతులు 5 లక్షలకు పైగా ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఫలితంగా దాదాపు 15 లక్షల మందికి ఆక్వా రంగం ఉపాధి కల్పిస్తోంది. కానీ ఈ రంగంలో పరిస్థితులు చూస్తే, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. అంత దయనీయమైన పరిస్థితిలో ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతున్నారు. నిజానికి «ఫీడ్ ధరల పెంపు అనేది రైతుల అంగీకారంతోనే జరగాలి కానీ, ఏకపక్షంగా కాదు. ఫీడ్ ధరలు పెంచాలంటే సమీక్ష నిర్వహించాలి. దానికి ఒక హేతుబద్ధత ఉండాలి. ధరల పెంపుపై సమీక్షించాలంటే.. ఫిష్ మీల్ సమృద్ధిగా ఉండే అక్టోబర్, నవంబర్ నెలల్లో హేతుబద్ధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫీడ్ రేట్లపై ఇష్టానుసారం రివ్యూ చేయకూడదు. దీనిపై ఇటీవల ఆక్వా రైతాంగం తమ గోడు వెళ్లబోసుకుంది. అందుకే ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం జారీ చేశాం.
సిండికేట్ చేతుల్లో నలిగిపోతున్న రైతు
చంద్రబాబు చర్మం కొంచెం మందం. మీ అందరికీ కూడా ఇది తెలిసిన విషయమే. దున్నపోతు మీద వర్షం పడితే ఎలా చలనం ఉండదో.. చంద్రబాబు ప్రభుత్వం కూడా అలాగే తయారైందని చెప్పడానికి బాధపడుతున్నాను. మన ఖర్మ ఏమిటని ఒక్కసారి గమనిస్తే, ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లయి చేసే ఫీడ్ కానీ, ఆ పంట కొనుగోలులో కానీ, చివరకు ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు సానుభూతి పరులవే. దాంతో వాళ్లు ఎలా కావాలి అంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్ కొనేటప్పుడు రేటు ఎంతో వాళ్లే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు కూడా ధర వాళ్లే నిర్దేశిస్తారు. ఆక్వా రైతన్నలు లక్షలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తే, తీరా ఆ పంట (రొయ్యలు) చేతికి వచ్చేసరికే వ్యాపారులంతా మొత్తం సిండికేట్‌గా ఏర్పడి, రేట్లు ఢమాల్ అని పడిపోయేలా చేస్తున్నారు. అలా చంద్రబాబునాయుడు సానుభూతిపరుల సిండికేట్ ఈరోజు రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నడిపిస్తోంది. ఫలితంగా ఆక్వా రైతుల బతుకులు ఆ సిండికేట్ చేతుల్లో నలిగి పోతున్నాయి. చంద్రబాబు సీఎం సీట్లోకి వచ్చారంటే చాలు, ఆ సిండికేట్‌కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్లే కన్నీళ్లు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తపన, తాపత్రయ పడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా)ను ఏర్పాటు చేస్తూ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ఆ అప్సడాకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరించేలా ఆ చట్టంలో నిర్దేశించాం. ఆక్వా రంగంలో అలా ఒక రెగ్యులేటరీ బాడీ ద్వారా సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్ ప్రక్రియ, కొనుగోలు ధరలతో పాటు, మార్కెటింగ్‌లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, రైతాంగానికి నేరుగా తోడుగా ముఖ్యమంత్రి ఉండేలా ఆ రోజు ఒక చట్టాన్ని తీసుకువచ్చి రైతన్నలకు తోడుగా నిలబడ్డాం. 
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
ముష్టి వేసినట్లు రూ.2 తగ్గించారు
మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి జూన్ లో పెంచారు. అంటే నాలుగు నెలలు కూడా తిరక్కముందే రెండుసార్లు రేటు పెంచారు. ఏకంగా కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు ఫీడ్ రేట్లు ఎడాపెడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, వారి గోడు వినకుండానే ‘అప్సడా’ చట్టాన్ని ధిక్కరించి ఇష్టానుసారం రేట్లు పెంచేశారు. అలా దారుణంగా పెంచి, ఆ తర్వాత తూతూ మంత్రంగా చంద్రబాబు చెప్పారంటూ కేజీకి రూ.2 తగ్గించారు. నాలుగు నెలలు తిరక్కుండానే కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు పెంపు ఎక్కడ? ముష్టి వేసినట్లు కేవలం రూ.2 తగ్గించడం ఏమిటి? ఇది చంద్రబాబు భాషలో చెప్పాలంటే 100 కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అని చెప్పినట్లుగా ఉంది. చంద్రబాబును నేను ఒకటే అడుగుతున్నా. ఈ రోజు ఆక్వా పంట సాగులో 60 శాతం ఫీడ్ ఖర్చు ఉంటుంది. అలాంటిది ఇష్టానుసారం ఫీడ్ రేటు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బతుకుతుంది? ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్లు, అందుకోసం వాడే సోయా, ఫిష్ మీల్, ఇతర మినరల్ మిక్సర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతున్నామని, రేటు పెంచక తప్పడం లేదంటున్నారు. ఆ రేట్లు పెరిగినప్పుడు ఫీడ్ రేటు పెంచుతున్నప్పుడు మరి ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా.. అని నేను అడుగుతున్నా. రేట్లు పెంచడానికైనా.. రేట్ల మీద నిర్ణయం తీసుకోవడానికైనా ఇదే చంద్రబాబు ప్రభుత్వానికి హేతుబద్ధత అనేది ఉండాలి కదా.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మార్కెట్‌లో తక్కువ రేటుకు వాళ్లు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉందంటూ.. ఒక కారణం తర్వాత మరో కారణం చెప్పి, ఇష్టం వచ్చినట్లు రేట్ పెంచుకుంటూ పోతారు. ఇలా ఇప్పుడు సిండికేట్ రాజ్యం నడుస్తోంది. 
సభా వేదిక వద్ద అశేష జనవాహినికి చిరునవ్వుతో అభివాదం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మీ వైఖరి మార్చుకోండి
నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఐదేళ్లలో ఫీడ్ కంపెనీలు మూడుసార్లు ధరలు పెంచితే, అప్సడా ద్వారా ఆ రేట్లు పూర్తిగా తగ్గించామని నేను గర్వంగా చెప్పగలను. అది రైతులపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటుతోంది. ఇంకా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పనలో కూడా అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల రేట్లను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర.. ఏ రైతుకు తగ్గకుండా ఆ ఐదేళ్లలో రైతాంగానికి తోడుగా నిలుచుంది. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతన్నలకు అండగా నిలబడి కనీస మద్దతు ధర 100 కౌంట్ రూ.230కి తగ్గకూడదని చెప్పి ఏకంగా చట్టం చేసి మరీ రైతన్నలకు అండగా నిలిచిన పరిస్థితి ఒక్క మన ప్రభుత్వంలోనే జరిగింది. అదే ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి ఏమిటని చూస్తే, ఉత్పత్తి ఖర్చు కేజీకి రూ.275కు పెరిగింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు సీడ్, ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. కానీ, పంట కొనుగోలు రేటుకు వచ్చేసరికి రూ.230 దాటని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో రైతాంగం ఎలా బతుకుతుందని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు గారూ.. ఈ సిండికేట్‌తో మీరు కుమ్మక్కై మీకు ఇంత, నాకు ఇంత అని చెప్పి మీరు చేస్తున్న వైఖరి మార్చుకోవాలని గట్టిగా కోరుతున్నా.
చంద్రబాబు ప్రతి అడుగులో మోసం
చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతి అడుగులోనూ మోసం, మోసం, మోసం అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసాలతో అడుగులు ముందుకు వేశాడు. ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి బాండ్లు పంపిణీ చేసి.. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశాడు. అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా ఆయన మోసం చేస్తూ వచ్చాడు. అవసరమైన జిల్లాల్లో 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్‌లు అన్నాడు.. (చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పారో ప్రస్తావిస్తూ) మరి కట్టాడా? జోన్‌తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు సబ్సిడీపై కరెంటు ఇస్తానని హామీ ఇచ్చాడు.. మరి ఇచ్చాడా? ట్రాన్స్‌ఫార్మర్ల ధరలు తగ్గిస్తానన్నాడు.. మరి తగ్గించాడా? ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు.. మరి ఇచ్చాడా? (ఏవీ ఇవ్వలేదంటూ రైతులు పెద్దఎత్తున చేతులు ఊపారు) ఇవన్నీ ఇవ్వకపోగా, మనం అమలు చేసిన రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను కూడా చంద్రబాబు కత్తిరించే కార్యక్రమం మొదలు పెట్టాడు. అందుకోసం తాజాగా జీవో 169 జారీ చేశారు. దీని ప్రకారం ఆక్వా సాగులో ఉపయోగించే మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) 0.90 నుంచి 0.95 మధ్య మెయింటైన్ చేయాలని చంద్రబాబు రైతులకు రూల్ పెట్టాడు. ఆక్వా రైతులు సాధారణంగా వాడే మోటార్లలో పీఎఫ్ 0.78 మాత్రమే ఉంటుంది. ఆ మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ పెరగాలంటే మళ్లీ ఆ రైతులు కెపాసిటర్లు కొనాలి. అవి కొంటే తప్ప, పీఎఫ్ పెరగదు.
12 వేల కనెక్షన్లు పెండింగ్
కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. దీంతో కనెక్షన్లు కూడా ఇవ్వడం లేదు. అలా 12 వేల వరకు కనెక్షన్లు ఈరోజు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లకు త్రీఫేస్ కరెంట్ కాకుండా, కేవలం సింగల్ ఫేస్ కరెంటు ఇచ్చి కోతల మీద కోతలు వేస్తూ రైతాంగం అల్లాడేలా చేస్తున్నాడు. దీంతో జనరేటర్లు పెట్టుకుని సాగు చేయాలంటే, ఆక్వా రైతులకు సాధ్యమయ్యే పనేనా చంద్రబాబూ?
రైతుల గోడు పట్టని కూటమి ప్రభుత్వం
నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తున్నారు. వారు తమ బాధలు చెప్పుకుంటూ, చూపిస్తున్నారు. వరుసగా రెండేళ్లు పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. రైతులు రోడ్ల మీద కనిపిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు.. ఏ పంటకు చూసినా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్బీకేలు నిరీ్వర్యం.. ఉచిత పంటల బీమా లేదు.. సమయానికే ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ లేదు.. రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితి. ఈ రోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్సార్‌సీపీ తోడుగా ఉంటుంది’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
మన ప్రభుత్వంలో రూ.1.50కే యూనిట్ విద్యుత్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ఆక్వా రైతాంగానికి అండగా నిలుస్తూ అడుగులు పడ్డాయి. అంతవరకు ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకోసం మన ప్రభుత్వ హయాంలో 57 నెలల పాటు ఏకంగా రూ.3,306 కోట్లు సబ్సిడీ భారం భరించాం. అదే అంతకు ముందు 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఏం జరిగిందని చూస్తే, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌పై రూ.3.85 వసూలు చేసి బాదారు. ఆ తర్వాత నా పాదయాత్రలో అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని చెప్పాము. ఆ వెంటనే 2019లో ఎన్నికలకు 4 నెలల ముందు చంద్రబాబునాయుడు, ఆక్వా రైతులకు సరఫరా చేసే యూనిట్ విద్యుత్ రేటు రూ.2కు తగ్గిస్తూ జీవో జారీ చేశారు. కానీ, ఆ సబ్సిడీ ఇవ్వలేదు. దాన్ని కూడా మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక భరించింది. అందుకోసం రూ.451 కోట్లు చెల్లించామని గర్వంగా చెబుతున్నా.
35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు
నాడు మన హయాంలో ఆక్వా రైతన్నలకు తోడుగా ఉండేలా సీడ్, ఫీడ్.. వాటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ.. వాటన్నింటి కోసం ఏకంగా 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ఆర్బీకేల్లో ఏకంగా 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు అంటే.. ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను నియమించి, వారితో పాటు ఆక్వా ల్యాబ్‌ల ద్వారా ప్రతి రైతును చేయి పట్టుకుని నడిపించాం. మన హయాంలో ఏకంగా 120 రోజులు, 150 రోజుల పాటు ఉండే సీడ్ తీసుకొచ్చాం. అదే ఈరోజు కేవలం 90 రోజులకు మించి బతకని పరిస్థితి ఉంది. వీటన్నింటి ద్వారా ఆక్వా రైతన్న అల్లాడిపోతున్నాడు. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. నరసాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తే, అందులో క్లాసులు కూడా మొదలు పెడితే, ఇప్పుడు చంద్రబాబు అవసరమైన నిధులు ఇవ్వకుండా దాన్ని ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ప్రాంతంలోనే మెడికల్ కాలేజీ పనులు కూడా ఆపేశారు.
భీమవరంలో తనను చూడటానికి వచ్చిన వారికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
51 లక్షల టన్నులకు పెరిగిన ఉత్పత్తి
చంద్రబాబు గత హయాంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి 39 లక్షల టన్నులు కాగా, మన ప్రభుత్వంలో అది ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు చంద్రబాబు పాలనలో చివరి ఏడాది.. అంటే 2018–19లో రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువ రూ.13,855 కోట్లు కాగా, మన ప్రభుత్వంలో 2023–24 నాటికి అది రూ.20 వేల కోట్లకు చేరిందని గర్వంగా చెప్పగలుగుతాను. చంద్రబాబు హయాంలో 86 శాతం ఉన్న యాంటీ బయోటిక్స్ అవశేషాలను మన ప్రభుత్వ హయాంలో ఏకంగా 20 శాతం లోపునకు తగ్గించామని కూడా గర్వంగా చెప్పగలను. అందుకే మన ప్రభుత్వ హయాంలో రెండుసార్లు.. 2021–22, 2023–24లో రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి.
భీమవరంలో వైఎస్ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న ప్రజలు
ఆక్వా రైతుల సభలో ముద్రగడకు జగన్ ఘన నివాళి
భీమవరంలో ఆక్వా రైతుల సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తొలుత.. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటించారు. అనంతరం ఆక్వా రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
మీ కష్టాలు నాకు తెలుసు
మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా.. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను’ అని మీ అందరికీ చెబుతున్నా. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికే మరో మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుందని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతా. మళ్లీ ‘అప్సడా’ పూర్వ వైభవంలోకి వస్తుంది. ఆ సంస్థకు సీఎం చైర్మన్‌గా ఉంటాడు. ఇప్పుడున్న సిండికేట్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంత వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రాష్ట్ర రైతాంగానికి, ప్రతి పంటకు, పంట వేసిన ప్రతి రైతు చేయి పట్టుకుని నడిపిస్తూ.. వారికి తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా చెబుతున్నా.


