అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు | Former CM YS Jagan attends Mudragada Padmanabham funeral | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

Jul 16 2026 5:06 AM | Updated on Jul 16 2026 5:06 AM

Former CM YS Jagan attends Mudragada Padmanabham funeral

కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాడె మోస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

కిర్లంపూడిలోని ఇంటి ఆవరణలోనే ముద్రగడ పద్మనాభం భౌతికకాయం ఖననం 

అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 

స్వయంగా పాడె మోసి ఘన నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ అధినేత 

అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కిర్లంపూడిలోనే.. 

కుటుంబాన్ని పరామర్శించి.. అండగా ఉంటామని భరోసా 

ప్రజలు, అభిమానులు, పార్టీ నేతలతో కిక్కిరిసిన కిర్లంపూడి..

ముద్రగడ అభీష్టం మేరకే అంతిమ సంస్కారాలు 

ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబ సభ్యులు.. కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు  

సాక్షి, కాకినాడ/ గోకవరం/ పిఠాపురం/ కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అంతిమ యాత్ర అభిమానులు, పార్టీ నాయకులు, శ్రేణులు, కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య సాగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి గ్రామంలోని ఆయన ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శ్వాసకోశ వ్యాధితో హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెల్సిందే. 

ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి బుధవారం ఉదయం స్వగ్రామమైన కిర్లంపూడికి తీసుకొచ్చారు. ముద్రగడ భౌతికకా­యాన్ని అభిమానుల సందర్శనార్థం ఆయన స్వగృహంలో ఉంచారు. తమ ఉద్యమ నేతను కడసారిగా చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు, ప్రజలు, వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు తరలిరావడంతో కిర్లంపూడి కిక్కిరిసిపోయింది. ము­ద్ర­గడ అభీష్టం మేరకు ఇంటి ఆవరణలోనే కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.  

పాడె మోసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనా­భం భౌతికకాయానికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్‌ జగన్‌ రోడ్డు మార్గంలో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి మధ్యాహ్నం 2.55 గంటలకు చేరుకున్నారు. అనంతరం ముద్రగడ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పూలను పక్కకు జరిపి ముద్రగడను చివరి చూపు చూసిన వైఎస్‌ జగన్‌ కాసేపు ఉద్విగ్నంగా కనిపించారు. 

అనంతరం ముద్రగడ సతీమణి పద్మావతి, కుమారులు బాలు, గిరిబాబు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి, తానున్నానని ధైర్యం చెప్పారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరో­సా ఇచ్చారు.  అక్కడే ఉండి ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ స్వయంగా ఆయన పాడె మో­శారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు వైఎస్‌ జగన్‌ కిర్లంపూడిలోనే ఉన్నారు. 

అంతిమ సంస్కారాల్లోనూ అదే ‘ముద్ర’!
జీవించినంతకాలం కొన్ని విలువలకు కట్టుబడి ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ముద్రగడ పద్మనాభం తాను మరణించిన తరువాత కూడా ఏమి చేయాలన్నది ముందుగానే నిర్ణయించారు. దానిని ఆయన కుటుంబ సభ్యులు, అను­చరులు తూచ తప్పకుండా పాటించడం విశే­షం. ఆయన బతికున్నప్పుడే తన అంత్యక్రియలు ఎలా చేయాలనే విషయమై ముందుగానే పలు సూచనలు చేసినట్టు బంధువులు చెబుతున్నారు. తన భౌతికకాయాన్ని ఆయన ఇంటి ఆవరణలోనే ఖన­నం చేయాలని సూచించారట. 

తాను చని­పో­యేటప్పటికి తన ఒంటిపై ఏది ఉన్నా వాటన్నిటితోనూ ఖననం చేయాలని, తనకు అంత్యక్రియల అనంతరం ఎటువంటి దిన కార్యాలూ చేయొద్దని ఆయన చెప్పారట. తన భార్య జీవించి ఉన్నంతకాలం సుమంగళిగానే ఉండాలని ఆయన కోరినట్టు చెబుతున్నారు. ఆయన కోరిక మేరకు అన్నీ ఆయన చెప్పినట్టే చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. అలాగే ప్రత్యర్థులతో చేతులు కలిపి కుటుంబంపై విమర్శలు చేసిన తన కుమార్తె క్రాంతిని తన భౌతికకాయం వద్దకు రానివ్వవద్దని కూడా ఆయన కుటుంబసభ్యులకు చెప్పారట. వీటన్నిటినీ కుటుంబ సభ్యులు పాటించారు.

ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

         ముద్రగడ సతీమణి పద్మావతిని ఓదార్చుతున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 

క్రాంతి రాకతో గందరగోళం
వారించినా వినకుండా ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి భౌతికకాయం వద్దకు వచ్చే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘గో బ్యాక్‌ క్రాంతి’ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చే­య­డంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అలాంటి పరిస్థితిలో కూడా పైనుంచి ఆదేశాలందుకున్నట్లుగా పోలీసులు క్రాంతిని భౌతికకాయం వరకు వెంటపెట్టుకుని తీసుకువచ్చారు. పరిస్థితి అదు­పుతప్పుతుండడంతో ఆమెను బయటకు పంపించేయాల­ని ముద్రగడ భార్య, బంధువులు పోలీ­సు­లను కో­రా­రు. తర్వాత ఆమెను అక్కడి నుంచి తరలించారు.

ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన ముద్రగడ కుటుంబం
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక దఫా ఎంపీగా, రెండుసార్లు మంత్రిగా పని చేసిన ముద్రగడ పద్మనాభం రాష్ట్రానికి విశేష సేవలందించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను ముద్రగడ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికి ఉన్నప్పుడు బజారుకీడ్చి.. ఇప్పుడు లాంఛనాలు అనడంలో అర్థమేమిటని వారు ప్రశ్నించారు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసిన ప్రభుత్వం నుంచి తనకు ప్రకటించే ఏవిధమైన సహాయం అందుకోకూడదని ఆయన బతికి ఉన్నప్పుడే నిర్ణయించారని, ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే ఆయన ఆత్మ శాంతించదని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా ముద్రగడ భౌతికకాయాన్ని ఖననం చేసే సమయంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం చేస్తున్నట్లుగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన ముద్రగడ అనుచరులు వెంటనే పోలీసులను అడ్డుకున్నారు.

నాడు వేధించి నేడు నాటకాలా! 
చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభంను గతంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా గుర్తుచేశారు. ముద్రగడ కుటుంబ సభ్యుల విషయంలోనూ అసభ్యంగా ప్రవర్తించారని విమ­­ర్శించారు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బ­ందులకు గురిచేసి.. ఇప్పుడు మృతి తర్వాత మొసలికన్నీరు కార్చాల్సిన అవసరం లేదని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. ముద్రగడ జీవించి ఉండగా అనేక విధాలుగా అవమానించారని, ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement