మస్కట్: ఒమన్ తీరంలో జరిగిన వాణిజ్య నౌకపై దాడిలో పుణెకు చెందిన భారతీయ మెరైన్ ఇంజనీర్ హేరంబ్ కర్మార్కర్ (30) మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. హార్ముజ్ జలసంధి సమీపంలో ‘జిఎఫ్ఎస్ గెలాక్సీ’ అనే నౌకపై జరిగిన దాడిలో ఆయన గల్లంతయ్యారని తొలుత వార్తలు రాగా, తాజాగా ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో నౌకలోని ఇతర సిబ్బందిని రక్షించినప్పటికీ, కర్మార్కర్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై కర్మార్కర్ మామ వివేక్ టాండన్ మాట్లాడుతూ కర్మార్కర్ మృతదేహాన్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ విషయమై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు సంయుక్తంగా నౌక యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలను వేగవంతం చేసినట్లు సమాచారం. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అక్కడ పనిచేసే భారతీయ నావికుల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ దాడికి గల కారణాలు, జరిగిన పరిణామాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ట్విషా శర్మ కేసు: సీబీఐకి సహకరించని అత్త, భర్త


