జానకమ్మ మృతి సినీ సంగీతానికి తీరని లోటు: కేసీఆర్ | KCR Mourns Singer S Janaki Death Irreparable Loss to Indian Music | Sakshi
Sakshi News home page

జానకమ్మ మృతి సినీ సంగీతానికి తీరని లోటు: కేసీఆర్

Jul 11 2026 11:02 PM | Updated on Jul 11 2026 11:21 PM

KCR Mourns Singer S Janaki Death Irreparable Loss to Indian Music

సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆస్పత్రిలో వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా జానకి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో భారతీయ సంగీత ప్రపంచం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానుల హృదయాల్లో "జానకమ్మ"గా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్. జానకి గాత్రం ఎన్నటికీ చెరిగిపోదని ఆయన అన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రస్థానంలో వేలాది పాటలకు ప్రాణం పోసి, తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర అనేక భారతీయ భాషల్లో తన అద్భుత గానంతో సంగీత ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన మహోన్నత కళాకారిణిగా ఆమెను కొనియాడారు.

తండ్రి ఉద్యోగరీత్యా అప్పటి కరీంనగర్ జిల్లాలో నివసించడం, వారి కుటుంబ మూలాలు సిరిసిల్ల ప్రాంతంతో అనుబంధం కలిగి ఉండడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ అన్నారు. జానకమ్మ మరణం ముఖ్యంగా దక్షిణ భారత సినీ సంగీతానికి, భారతీయ గాన ప్రపంచానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

జానకమ్మ వంటి మహా గాయనులకు మరణం ఉండదని, వారి గానమాధుర్యం చిరకాలం సంగీతాభిమానుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, జానకమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement