సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరిచిన ఓ పాటను రికార్డింగ్ చేస్తున్నప్పుడు, ఆ పాటలోని భావోద్వేగభరితమైన సాహిత్యం వల్ల గాయని ఎస్.జానకి కన్నీళ్లు పెట్టుకుని పాటను మధ్యలోనే ఆపేశారు. తర్వాత ఇళయరాజా ఆమెకు కాసేపు విరామం ఇచ్చి, ఓదార్చిన తర్వాతే ఆ పాట రికార్డింగ్ పూర్తయింది. గానామృతధారలు కురిపించిన జానకి దివికేగిన వేళ ఆ వివరాలు తెలుసుకుందాం...
తన మధురమైన గాత్రంతో సినీ రంగంలో ఎందరో అభిమానుల మనసులు గెలుచుకున్నారు గాయని ఎస్.జానకి. ఆమె పాటలు వింటుంటే చల్లని గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. అమ్మపాడే లాలి పాటలా అనిపించి, మన మనసుని తేలికపరుస్తుంది. మరోవైపు, సినీ రంగంలో ఎంతోమంది సంగీత దర్శకులు వచ్చినా ఇళయరాజాకు ప్రత్యేక స్థానం ఉంది. పల్లె సోయగాలు నిండిన పాటల నుంచి అన్ని రకాల సంగీతాన్ని అందించిన ఆయన, మూడు తరాల అభిమానులను అలరిస్తున్నారు. విషాదం, ఆనందం, ఏడుపు, నవ్వు... ఏ భావోద్వేగమైనా అభిమానులు ఇళయరాజా సంగీతాన్నే వింటారు. కొందరైతే రాత్రి నిద్రపోయే ముందు కూడా ఇళయరాజా సంగీతాన్ని ఆస్వాదిస్తుంటారు.
ఇళయరాజా 1000కు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. తన ఎన్నో చిత్రాల్లో ఎస్.జానకితో పాటలు పాడించారు. జానకి గాత్రం, ఇళయరాజా జానపద శైలి సంగీతానికి ఎంతో చక్కగా సరిపోయేది. అందుకే ఆయన జానకిని తన ఆప్త గాయనిగా భావించేవారు. ఇళయరాజాకు ఎన్నో విజయవంతమైన పాటలు అందించిన జానకి, ఆయన స్వరపరిచిన ఒక పాటని పాడలేక ఏడ్చిన ఘటన కూడా ఉంది. ఈ విషయాన్ని జానకే ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు.
సాధారణంగా జానకి వేదికపై అయినా, రికార్డింగ్ థియేటర్‌లో అయినా పాట పాడేటప్పుడు భావోద్వేగానికి లోనయ్యేవారు కాదు. ఆమె శరీరం కూడా కదిలేది కాదు. ఒకే చోట నిలబడి పాడేవారు. కానీ ఇళయరాజా స్వరపరిచిన ఒక పాట మాత్రం ఆమెను తీవ్రంగా కదిలించింది. ఆ పాటే 'అచ్చాణి' చిత్రంలోని 'మాతా ఉన్ కోవిలిల్..'. 1978లో విడుదలైన ఈ చిత్రంలో ముత్తురామన్, లక్ష్మి, అశోకన్, మనోరమ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని నాలుగు పాటలు ప్రజాదరణ పొందాయి.
ఎస్. జానకి పాడిన 'మాతా ఉన్ కోవిలిల్..' పాట ఇప్పటికీ ఆలయ ఉత్సవాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను కేవలం 3 గంటల్లో సిద్ధం చేశారని ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రికార్డింగ్ థియేటర్‌లో ఈ పాట పాడుతున్న సమయంలో జానకి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వాలి రాసిన సాహిత్యం, ఇళయరాజా సంగీతం ఆమెను కన్నీళ్లు పెట్టించాయి. పాట పాడుతూనే జానకి బోరున ఏడవడం మొదలుపెట్టారు.
జానకిని ఏడిపించిన పంక్తులు..
యేసును కనకుండా తల్లిగా మారిన మేరీ మాత గురించి చెప్పే 'పిళ్లై పెరాద పెణ్మై తాయానదు, అన్నై ఇల్లాద మగనై తాలాట్టుదు..' (పిల్లలను కనని స్త్రీ తల్లిగా మారింది, తల్లి లేని కుమారుడికి జోలపాట పాడుతోంది) అనే పంక్తులు వినగానే జానకి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె పాట ఆపేయగానే స్టూడియోలో ఉన్న వారంతా "ఏమైంది?" అని అడిగారు. "ఈ పంక్తులను పాడడం నాతో అయ్యేపనిలా లేదు. ఇవి నన్ను చాలా కదిలిస్తున్నాయి" అని చెప్పి ఏడ్చారు. ఆ తర్వాత ఇళయరాజా జానకిని ఓదార్చి, కొన్ని గంటలు విరామం ఇచ్చి, మళ్లీ పాటను రికార్డు చేశారు. ఈ పాట పాడేటప్పుడు జానకి ఎలా ఏడ్చారో, అదే విధంగా ఈ పాట విన్న ఎంతోమంది ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటారు. అదే ఈ పాట గొప్ప విజయానికి కారణమైంది.


