అయోధ్య విరాళాల వివాదం.. ట్రస్ట్ కోశాధికారి సరికొత్త వాదన! | Ram Temple Donation Row Treasurer Govind Dev Giri Refuses to Resign Blames SBI for Lapses | Sakshi
Sakshi News home page

అయోధ్య విరాళాల వివాదం.. ట్రస్ట్ కోశాధికారి సరికొత్త వాదన!

Jul 15 2026 11:19 AM | Updated on Jul 15 2026 11:22 AM

Ram Temple Donation Row Treasurer Govind Dev Giri Refuses to Resign Blames SBI for Lapses

అయోధ్య: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదానికి సంబంధించి తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోయే రకాన్ని కాదని, ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుచరుడిగా సమస్యను ఎదుర్కొంటానని, బాధ్యతల నుండి తప్పుకోబోనని స్పష్టం చేశారు.

ఈ కుంభకోణానికి సంబంధించి ‘ఎస్‌బీఐ’పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అరెస్టయిన వారంతా ఎస్‌బీఐ నియమించిన సిబ్బందేనని, వారి నేపథ్యాన్ని పరిశీలించాల్సిన బాధ్యత బ్యాంక్ అధికారులదేనని ఆయన పేర్కొన్నారు. సుమారు రూ. మూడు కోట్ల నగదు గోల్‌మాల్ జరిగి ఉంటుందని అంచనా వేసిన ఆయన, ఇది బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు కాదని, విరాళాల పెట్టెలలోని నగదు అని వివరించారు.

ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా స్వచ్ఛందంగానే జరిగిందని, ఆయన వ్యవహారశైలిలో నిర్లక్ష్యం ఉన్నప్పటికీ, ఆయనను బలిపశువును చేయలేదని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా సిబ్బందికి జేబులు లేని యూనిఫాంలు, సీసీటీవీ పర్యవేక్షణ పెంచడం, నగదు లెక్కింపులో ట్రస్ట్, బ్యాంక్ అధికారుల ఉమ్మడి పర్యవేక్షణ వంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ. 1,400 కోట్ల విలువైన బంగారం మాయమైందన్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ‘సిట్‌’ దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement