షాకిస్తున్న ఐటీ ఉద్యోగి క్యాబ్ డ్రైవింగ్ స్టోరీ! | IT Professional Quits Job To Become A Cab Driver, Earning Double The Salary, Read Full Story For More Details Inside | Sakshi
Sakshi News home page

షాకిస్తున్న ఐటీ ఉద్యోగి క్యాబ్ డ్రైవింగ్ స్టోరీ!

Jul 15 2026 9:38 AM | Updated on Jul 15 2026 10:39 AM

IT Professional Quits Job to Become a Cab Driver Earning Double the Salary

సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరమైన ఉద్యోగం, గౌరవప్రదమైన జీతం.. ఇది ఎంతోమంది కల. అయితే 19 ఏళ్ల అనుభవం ఉన్న ఒక ఐటీ ఉద్యోగి  అకస్మాత్తుగా ఆ జాబ్‌ మానేసి, క్యాబ్ డ్రైవర్‌గా మారారు. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, స్వేచ్ఛగా జీవిస్తున్నానని చెబుతున్న ఆయన అనుభవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో, ఒక వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌ను అతని ఆదాయం, వృత్తి మార్పు గురించి ప్రశ్నించారు. దీనికి స్పందించిన సదరు క్యాబ్ డ్రైవర్, తాను గతంలో ఐటీ రంగంలో పనిచేసేవాడినని, అప్పుడు నెలకు రూ. 40,000 జీతం వచ్చేదని వెల్లడించారు. ఇప్పుడు క్యాబ్ నడపడం ద్వారా నెలకు రూ. 80,000 నుంచి రూ. 90,000 వరకు సంపాదిస్తున్నానని చెప్పడంతో ఆ ప్రయాణికుడు విస్తుపోయాడు.


ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ‘స్వేచ్ఛ’ అని ఆయన స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉండే ఒత్తిడి, సమయ పాలన బంధనాల నుండి విముక్తి కోరుకున్నానని తెలిపారు. క్యాబ్ డ్రైవర్‌గా తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్లవచ్చని, తనను ఎవరూ ప్రశ్నించే వారు లేరని పేర్కొన్నారు. తన భార్యకు సెలూన్ ప్రారంభించేందుకు సహకరించిన తర్వాత, తనకు నచ్చిన ఈ వృత్తిని ఎంచుకున్నట్లు చెప్పారు.

ఆకాష్ గుప్తా అనే వినియోగదారుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ సంపాదన అంత సులభం కాదని కొందరు విశ్లేషిస్తున్నారు. పెట్రోల్ ఖర్చులు, వాహన నిర్వహణ, పన్నులు వంటివి పోను నికర ఆదాయం అంత ఉండకపోవచ్చని, రోజంతా వాహనం నడపడం వల్ల శారీరక శ్రమ కూడా ఎక్కువేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగ భద్రత కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యతనిస్తూ, గిగ్ ఎకానమీలో సంతోషంగా ఉన్న ఈ వ్యక్తి కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: నరకంలో అవిభాజ్య కవలలు సబా, ఫరా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement