విడాకులు తీసుకుంటేనే ఉద్యోగం! | TDP leader harasses tribal woman in Nellore district | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకుంటేనే ఉద్యోగం!

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

TDP leader harasses tribal woman in Nellore district

నెల్లూరు జిల్లాలో గిరిజన మహిళకు టీడీపీ నేత వేధింపులు

కూటమి గెలిచిన వెంటనే ఉద్యోగం నుంచి బాధితురాలి తొలగింపు

ఆమె భర్త వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు కావడమే పాపం

కుమార్తె ఉద్యోగం పోవడంతో మనోవేదనతో తండ్రి మృతి

రెడ్‌బుక్‌ పైశాచికత్వాన్ని నిరసిస్తూ 13న బాధితురాలి మౌనదీక్ష

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల దురాగతాలకు ఇది మరో నిదర్శనం! ఉన్నత విద్యావంతురాలైన ఓ గిరిజన మహిళను దుర్మార్గంగా ఉద్యోగం నుంచి తొలగించి ఆ కుటుంబం పొట్టగొట్టడంతో పాటు విడాకులు తీసుకోవాలంటూ పైశాచి­కంగా వేధిస్తున్నారు. మానసిక వేదనతో తండ్రిని పోగొ­ట్టుకుని.. హృద్రోగ బాధితుడైన భర్తతోపాటు బాధితురాలు కూలి పనులకు వెళుతున్న దుస్థితి నెలకొంది. శ్రీపొట్టి శ్రీరా­ములు నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీ పరిధిలో టీడీపీ నేత కక్ష సాధింపు వ్యవహారాలు ఇలా ఉన్నాయి..

కూటమి సర్కారు కక్ష సాధింపులు..
స్థానిక గాలిదిబ్బకు చెందిన గిరిజన మహిళ పుట్టా భాగ్యమ్మ బీఎస్సీ, బీఈడీ చదువుకున్నారు. 2016 మేలో వైఎస్సార్‌ సీపీ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి సహకారంతో అల్లూరు పంచా­యతీలో కాంట్రాక్టు ప్రాతిపదికన కంప్యూటర్‌ ఆపరేటర్‌గా రూ.6 వేల జీతంతో చేరారు. 2024 వరకు అల్లూరు పంచా­యతీ, నగర పంచాయతీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేశా­రు. టీడీపీ ప్రభుత్వం రాగానే స్థానిక నేత కక్షసాధింపు చర్య­ల­కు దిగి ఆమెను విధుల నుంచి తొలగించారు. ఉద్యోగం తి­రి­గివ్వాలని బాధితురాలు రెండేళ్లు తిరిగినా కనికరించలేదు. 

విడాకులు తీసుకోవాలంటూ..
గత ఎన్నికల సమయంలో భాగ్యమ్మ భర్త దాసరి కృష్ణ వైఎస్సార్‌సీపీ కోసం పని చేశారనే అక్కసుతో స్థానిక కూట­మి నేత కక్షగట్టి టీడీపీ అధికారంలోకి రాగానే ఆమెను ఉద్యో­గం నుంచి తొలగించారు. ఇదేమిటని భాగ్యమ్మ తండ్రి ప్ర­శ్నించగా.. భర్తతో విడాకులు తీసుకుంటేనే ఉద్యోగమిస్తానని చెప్పారు. అప్పటి నుంచి ఇద్దరు కమిషనర్లు మారినా సదరు నేత కనికరిస్తేనే ఉ­ద్యోగం ఇస్తామని తేల్చి చెప్పారు. 

ఎమ్మెల్యే, కలెక్టర్‌కు విన్నవించినా...
బాధితురాలు భాగ్యమ్మ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కలిసి తన గోడు చెప్పుకునేందుకు యత్నించగా అల్లూరు వచ్చినప్పుడు ప్రజాదర్బార్‌లో చెప్పాలని సలహా ఇచ్చారు. ఆ సమయంలో వినతిపత్రం ఇవ్వగా స్థానిక నేత చెబితేనే ఉద్యోగమిస్తామని తేల్చి చెప్పారు. ఇక 2025లో కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో విన్నవించుకున్నా ఫలితం దక్కలేదు. నగర పంచాయతీలో నిధులు లేవని, ఉన్నవారికే జీతాలు ఇవ్వలేకపో­తున్నామంటూ అర్జీని ముగించారు. 

మనస్తాపంతో తండ్రి మృతి
తన కుమార్తె ఉద్యోగం కోల్పోయిందనే మనోవేదనతో భాగ్యమ్మ తండ్రి 2025 మేలో మృతి చెందారు. గుండె జబ్బుతో మూడు స్టంట్లు వేసిన భాగ్యమ్మ భర్త కృష్ణ కూలీ పనులకు వెళ్తున్నారు. తల్లి పుట్టా వెంకమ్మ, మానసిక వికలాంగురాలైన వితంతువు, తన అక్క కత్తి వజ్రమ్మ, ఆమె కుమారుడిని పోషించేందుకు భాగ్యమ్మ ప్రస్తుతం ఉప్పు కయ్యల్లో ఉప్పు మోస్తోంది. కాగా, రెండేళ్లుగా తిరిగి విసిగిపోయిన భాగ్యమ్మ అల్లూరు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఈ నెల 13న మౌన దీక్షను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement