2026 నాటికి 54 శాతం కుటుంబాలకు అప్పుల్లేవు
46 శాతం కుటుంబాలకు రుణ బకాయిలున్నాయి
గ్రామీణ కుటుంబాల సగటు రుణ పరిమాణం రూ.1,69,800
1991 నుంచి క్రమంగా అప్పుల కుటుంబాల శాతం పెరుగుతోంది
1991లో 23 శాతం కుటుంబాలకు మాత్రమే అప్పు
దేశంలో గ్రామీణ రుణమార్కెట్ పరిస్థితులపై నాబార్డు నివేదిక
సాక్షి, అమరావతి: దేశంలో ఇప్పటికీ అధికశాతం గ్రామీణ కుటుంబాలకు అప్పుల్లేవు. 2026 నాటికి దేశంలో 54 శాతం కుటుంబాలకు ఎలాంటి రుణాలు లేవు. 46 శాతం కుటుంబాలకు మాత్రమే రుణ బకాయిలున్నాయి. దేశంలో గ్రామీణ రుణమార్కెట్ పరిస్థితులపై నాబార్డు సర్వే నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. అయితే 1991 నుంచి క్రమంగా గ్రామీణ ప్రాంతాల్లో అప్పు ఉన్న కుటుంబాల శాతం పెరుగుతూ ఉంది.
1951లో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అప్పులున్న కుటుంబాలు 63 శాతం ఉండగా 1981 నాటికి అప్పుల కుటుంబాలు 19 శాతానికి తగ్గాయి. 1991కి అప్పులున్న కుటుంబాలు 23 శాతం. 1991 నుంచి అప్పులున్న కుటుంబాలు పెరుగుతూ 2026 నాటికి 46 శాతానికి చేరాయి. 2026 నాటికి దేశంలో గ్రామీణ కుటుంబాల సగటు రుణ పరిమాణం రూ.1,69,800గా ఉందని సర్వే నివేదిక తెలిపింది.
2021–22 నాటికి దేశంలో గ్రామీణ కుటుంబాల సగటు రుణ పరిమాణం రూ.90,372గా ఉన్నట్లు పేర్కొంది.గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కుటుంబాలు ఉద్దేశపూర్వకంగా రుణం తీసుకోవడం లేదని, ఆ తరువాత అత్యధిక వ్యయం అవుతుందని రుణాలను తీసుకోవడం లేదని తెలిపింది. రుణాలు పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులతోపాటు గతంలో స్నేహితులు, పొరుగువారికి ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో అధికశాతం కుటుంబాలు అప్పులకు దూరంగా ఉంటున్నట్లు నివేదిక వెల్లడించింది.


