సాక్షి, తాడేపల్లి: అమరావతిలో కూటమి సర్కార్ రాజధాని పేరుతో వేల కోట్లు ప్రజా ధనాన్ని దుబారా చేస్తోందని, ప్రశ్నిస్తే మంత్రి నారాయణ బుకాయిస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అమరావతిలో పేర్లు మార్చి నిర్మాణాల ఖర్చు పెంచేస్తున్నారని, కాంట్రాక్టర్లకు అడ్డంగా దోచిపెట్టేందుకే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం జగన్‌గారు ప్రతిపాదిస్తున్న మావిగన్ రాజధానిపై దృష్టి సారించాలని, తద్వారా అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. ప్రెస్ మీట్‌లో సాకే శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
అమరావతిపై నారాయణ బుకాయింపులు:
మంత్రి నారాయణ అమరావతిగా పిలుస్తున్న 28 గ్రామాల పరిధిలో కడుతున్న కట్టడాలపై విస్మయానికి గురయ్యే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణాల్లో ఎక్కడా లేని విధంగా అవినీతి జరుగుతోందని ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు కదా, మీ సమాధానం ఏంటని అడిగితే.. నారాయణ మాత్రం తమ చర్యల్ని సమర్ధించుకున్నారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా అమరావతిలో అవినీతి ప్రవాహం జరుగుతోంది.
వరద నీళ్లే కాదు, వరద నీళ్ల కంటే మహా జోరుగా అవినీతి ప్రవాహం అక్కడ జరుగుతోందన్న విషయాన్ని ప్రజలు చెప్తుంటే, దాన్ని సమర్థించుకోవడం కోసం నారాయణ నానా పాట్లూ పడ్డారు. మామూలు ఇళ్లకైతే ఒక లెక్క, ఐకానిక్ భవనాలకైతే మరో లెక్క అంటూ చెప్పుకొచ్చారు. ఐకానిక్ బిల్డింగ్ అంటే ఎవరికీ అర్థం కానట్లు మాట్లాడారు. అది చూస్తే మా పిల్లలు కూడా ఇడ్లీ పాత్ర లాగా ఉంటుందని చెప్తున్నారు. అడ్డంగా పెట్టినా, క్రాస్‌గా పెట్టినా, తలకిందులుగా పెట్టినా అది ఇడ్లీ పాత్రే అవుతుంది. దానికి అయ్యే ఖర్చు ఎలా పెరుగుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది.
నిర్మాణాల రేట్లు పెంచేసి అడ్డగోలుగా దోపిడీ:
మీరు దాదాపు 52,20,496 చదరపు అడుగుల నిర్మాణాలు చేస్తున్నారు. ఇందులో చదరపు అడుగుకు మీరు చెబుతున్న లెక్క దాదాపు రూ.20,427. ఇదేం లెక్క అని అడుగుతున్నాం. ఇదే బిల్డింగ్ కి 2017–18 సంవత్సరాల్లో మీరు టెండర్ పిలిచినప్పుడు, రూ.2271.14 కోట్లతో టెండర్లు ఖరారు చేశారు. వచ్చిన కంపెనీలు ఎన్‌సిసి, షాపూర్జీ–పల్లోంజీ, ఎల్ అండ్ టీ. అయినా ఈ నిర్మాణాలు చేపట్టకుండా వదిలేసి, ఇప్పుడు మళ్లీ వాళ్లకే ఇచ్చి మొదలు పెట్టించారు. కానీ ఖర్చు మాత్రం రూ.4354.43 కోట్లకు పెంచేశారు. అంటే దాదాపు రూ.2033.29 కోట్ల మేర రేట్లు పెరిగిపోయాయి. ఇది నారాయణకో లేక చంద్రబాబుకో ఆశ్చర్యం కలగకపోవచ్చు, కానీ మాలాంటి వాళ్లకి ఆశ్చర్యం కలుగుతోంది.
అందులో ఒకటి, రెండు టెండర్లు అయినా వేరే కంపెనీలకు ఇవ్వలేరా? ప్రపంచ స్థాయి బిడ్డింగ్ ఇచ్చినప్పుడు, మిమ్మల్ని అడిగే పాయింట్ ఒక్కటే. మీరు మీ సొంత భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.20 వేలు ఎక్కడైనా ఇచ్చారా నారాయణ గారు అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు ఇంటికీ దాదాపు చదరపు అడుగుకు రూ.5 వేలు ఖర్చు పెడుతున్నారు. కానీ అమరావతి నిర్మాణాల రేట్లు బొంబాయిలో గాని, బెంగళూరులో కానీ, ఎక్కడ లేవు. వాటి గురించి మాట్లాడితే.. మా వైఎస్సార్‌సీపీ అమరావతికి వ్యతిరేకం అని ఆడిపోసుకుంటారు. అమరావతి పేరు మీద వృథా, దోపిడి అవుతున్న ప్రజాధనాన్ని, ప్రజల శ్రమను మీరు నాశనం చేస్తున్నారు. దాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం.
అమరావతి అని పేరు పెట్టిన మెటీరియల్ ఏమైనా ఆ ఇంద్రుని ఊరి నుంచి తెప్పిస్తున్నారా? ఎందుకంటే చంద్రబాబు మాట్లాడితే చాలు దేవతల రాజధాని అంటుంటాడు. దేవతలు ఏమైనా కంపెనీ పెట్టారా? పైన ఎక్కడో నాకు తెలియదు, కానీ ఇంద్రలోకం నుంచో, ఎక్కడి నుంచో ఆ మెటీరియల్ వస్తోంది. అదన్నా ఎక్కడో చెప్పాలి. అక్కడి నుంచి రవాణా చేయాలి కాబట్టి ఖర్చు పెరిగినట్లుంది.
అంతులేని నిర్మాణ వ్యయం:
చంద్రబాబు అమరావతిలో దాదాపు రూ.680 కోట్లు రకరకాల రాయితీల రూపంలో ఇస్తున్నారు. నిజానికి అక్కడ ఇప్పటికే ఇసుక ఫ్రీ. జీఎస్టీ లేదు. సీవరేజ్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. పన్నులు కట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. అన్నీ వెనక్కి ఇచ్చేస్తారంట!. ఆ భవనాల కరెంటుకి, ఫైర్‌కి, లిఫ్ట్‌కి, ప్లంబింగ్ కి రూ.4354.43 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఇంకా తమాషా, ఘోరం ఏంటంటే ఆ గ్లాస్ ఫేస్డ్ వర్క్ ఏంటో మాకు అర్థం కాదు. అంటే బహుశా అద్దాలు వేస్తారేమో, ఈ అద్దాలకి మీరు రూ.2,31,688 కోట్లు ఖర్చు పెడుతున్నారు.
అది రూ.2,540 కోట్ల గ్లాసుల కంటే అద్దాలు వేసే ఖర్చు ఎక్కువ. అక్కడ ఇంకా రోడ్లు, డ్రైనేజ్ లు ఇవన్నీ ఉన్నాయట. అయినా ప్రత్యేకంగా రోడ్లు, కాలవలకు మళ్ళీ రూ.1,052 కోట్లు ఖర్చు చేస్తున్నారు. డిజైన్లకు రూ.401 కోట్లు, బొమ్మలు వేసినోడికి రూ.400 కోట్లు, గ్లాసులు వేసేవాడికి గ్లాస్, అద్దాలకేమో రూ.2,540 కోట్లు. కరెంటుకి , ప్లంబింగ్ లాంటి పనులకేమో దాదాపు రూ.2,316 కోట్ల పైచిలుకు ఖర్చు చేస్తున్నారు. ఇలా మొత్తం నిర్మాణ ఖర్చు రూ.4354 కోట్ల రూపాయలకు చేరింది. అసలు కంటే కొసర ఎక్కువైందని బిల్డింగ్ కి దాదాపు 100 శాతం కంటే ఎక్కువ డబ్బుల్ని మీరు అదనంగా ఖర్చు పెడుతున్నారు.
కేంద్రాన్ని మించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యయం:
కేంద్ర ప్రభుత్వం కూడా బిల్డింగులు కడుతోంది. మీరు వాళ్లను మించి పోతున్నారు. కేంద్రం దాదాపు 54 లక్షల 45 వేల చదరపు అడుగుల నిర్మాణం మొదలు పెడితే, దానికి వాళ్ళు పెడుతున్న ఖర్చు రూ.2,533.99 కోట్లు. 54 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్ కి వాళ్ళు ఇచ్చే డబ్బులు రూ.2,534 కోట్లు. వాళ్ళ స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి మొత్తం రెండు కలిపేస్తే సాధారణ ఆఫీస్ కి, రెసిడెన్షియల్ అకామిడేషన్ రెండు కలిపితే రూ.4,645. ఇది వాళ్ళ లెక్క, వాళ్ళ డొమైన్ లో నుంచి తీసిన పేపర్ ఇది. మరి మీకెందుకు అదే చదరపు అడుగుకు రూ.20 వేలు అవుతుందో చెప్పాలి.
నారాయణ మూడు రిజర్వాయర్లు కడతాం, పది లిఫ్టులు పెడతాం, వరద నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ ఎత్తి మళ్ళా కృష్ణానదిలోకి పోస్తాం అంటారు. మీ అమరావతికి ప్రజల ఆమోదం లేదన్న సంగతి మీకు అర్థమైతే, జగన్‌గారు చెప్పిన మాటకు మీకు అర్థమవుతుంది. ఈరోజు మావిగన్ కి ప్రజల మద్దతు ఉంది. ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. కొత్తగా ఎయిర్ పోర్ట్, రైల్వేస్టేషన్ కడతారట. 28 గ్రామాల రాజధానిలో రైతులు కూడా ఉండటం లేదు, బయటకు వచ్చేస్తున్నారు.
మావిగన్ రాజధాని తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం:
అభివృద్ధికి పనికొచ్చే గ్రోత్ ఇంజన్ క్యాపిటల్ మావిగన్ ద్వారానే సాధ్యమవుతుంది. మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు వరకు ఉన్న 110 కిలోమీటర్ల ప్రాంతం. ఒక మూడు ప్రధాన పట్టణాలు, మంచి భూభాగాలు, దాదాపు 60 లక్షల జనాభా. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఒక రైల్వే స్టేషన్, ఒక బస్ స్టాండ్ ఉన్నాయి. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పి, ఇప్పటికి 60 వేల కోట్లు అప్పులు తెచ్చి నిర్మిస్తున్నారు.
అది పూర్తయ్యే సరికి మరో 2 లక్షల కోట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే లక్ష ఎకరాల భూసేకరణలో ఉన్నారు. ఎకరా అభివద్ధికి మీరు చెప్పిన లెక్కే రెండు కోట్లు. లక్ష ఎకరాల అభివృద్ధికి రెండు లక్షల కోట్ల రూపాయలు. ఇవన్నీ ఎవరి డబ్బులు ? ఓ రూ.10 వేల కోట్లు ఖర్చు పెడితే, రాయలసీమలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. ఇంకొక 10 వేల కోట్లు ఖర్చు పెడితే ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. ఆ ఆలోచన రాదా మీకు? సరిగ్గా అక్కడే మీ గురించి అనుమానాలు వస్తున్నాయి.
మీరు దానికి ఏ పేరు అయినా పెట్టండి. ఐకాన్ అనండి. గోల్డెన్ ఐకాన్ అనండి. ప్రశ్నిస్తే మాత్రం మీకు కోపాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నిర్బంధ అభివృద్ధి కేంద్రీకరణ ఆపండి. దీని వల్ల ఎలాంటి లాభం లేదు. అమరావతి పేరు మీద జరుగుతున్న ప్రహసనం కాంట్రాక్టర్ల కోసమే. ఐదేళ్ల కింద అదే కాంట్రాక్టర్ మళ్ళా అదే కాంట్రాక్టర్. అదనపు ఖర్చు అద్దాల కోసమే. కనుక మసిపూసే మాటలను మానేసి, వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టి, ప్రజల రాజధాని కాబోయే మావిగన్ ను ఆలోచించి నిర్మించమని కోరుతున్నామని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చెప్పారు.


