మన ఓట్లను కాపాడుకోవడం అత్యంత కీలకం: సజ్జల | Sajjala Ramakrishna Reddy Teleconference With Key Ysrcp Leaders On Sir | Sakshi
Sakshi News home page

మన ఓట్లను కాపాడుకోవడం అత్యంత కీలకం: సజ్జల

Jul 9 2026 7:48 PM | Updated on Jul 9 2026 8:06 PM

Sajjala Ramakrishna Reddy Teleconference With Key Ysrcp Leaders On Sir

సాక్షి, తాడేపల్లి: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కీలక నేతలతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో నిర్వహించిన ఈ టెలి కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, బీఎల్ఏల బాధ్యతలు, ఓటర్ల అవగాహన, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాల అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ నెల 14వ తేదీతో ఇంటింటి సర్వే ముగియనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా అర్బన్‌ ఏరియాలలో ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదని సమాచారం వస్తోందని, రూరల్‌ ఏరియాలలో కూడా ఫామ్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సరిగా జరగని చోట్ల ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి బూత్‌లో బీఎల్ఏలు చురుగ్గా పనిచేసి, ప్రతి ఓటర్‌కు ఫారం అందిందా లేదా అన్నది కచ్చితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు.

కొన్ని చోట్ల టీడీపీ నాయకులు అధికారులపై ప్రభావం చూపించి తమకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం ఉందని, అలాంటి ప్రయత్నాలను పార్టీ నాయకులు, బీఎల్ఏలు అప్రమత్తంగా గమనించాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు మరో నెల గడువు పొడిగించాలని కోరిందని, అయితే ఇప్పటి వరకు దీనిపై సమాధానం రాలేదని తెలిపారు. డిజిటలైజేషన్‌ ప్రక్రియలో కూడా జాప్యం జరుగుతోందని, ఈ అంశాలన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

ఓటరు జాబితాల్లో మన ఓట్లు తొలగించకుండా కాపాడుకోవడం, అదే సమయంలో దొంగ ఓట్లు ఉంటే వాటిని గుర్తించి తొలగించేలా చూడడం బీఎల్ఏల ప్రధాన బాధ్యత అని సజ్జల అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు చాలా సందర్భాల్లో 5 వేల నుంచి 10 వేల ఓట్ల తేడాతో నిర్ణయించబడతాయని, అందువల్ల ప్రతి ఓటు విలువైనదని గుర్తుచేశారు. మన ఓట్లను తొలగించేందుకు రకరకాల కుట్రలు జరిగే అవకాశం ఉందని.. ముఖ్యంగా మునిసిపాలిటీలు, అర్బన్‌ ఏరియాలలో ఓట్లు అత్యంత కీలకమని ఆయన అన్నారు.

అర్బన్‌ ప్రాంతాల్లో బీఎల్ఏలకు అవసరమైన అదనపు సపోర్టింగ్‌ టీమ్‌లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటికే పార్టీ కంట్రోల్‌ రూమ్స్‌ అందుబాటులో ఉన్నాయని, ఎక్కడైనా ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ అందకపోతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు పార్టీ కంట్రోల్‌ రూమ్స్‌కు కూడా తెలియజేయాలని చెప్పారు. ఈ విషయంలో మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకోవాలని, ఫామ్స్‌ అందని ప్రాంతాల సమస్యను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజూ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించి, తన నియోజకవర్గంలోని ప్రతి బూత్‌ స్థాయి పరిస్థితిపై స్టేటస్‌ అప్‌డేట్‌ తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. బీఎల్ఏకు ప్రతి రోజూ కీలకమని, ఈ తుది దశలో ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. జిల్లా అధ్యక్షులు, టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు, పార్లమెంట్‌ పరిశీలకులు, అసెంబ్లీ పరిశీలకులు, సీనియర్‌ నాయకులతో సమన్వయం చేసుకుని ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని చెప్పారు.

బీఎల్ఏలు ఓటర్లకు ఎస్‌ఐఆర్‌పై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడైనా ఓటర్లకు ఇబ్బంది కలిగేలా మార్పులు జరిగితే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు.

ఈ టెలి కాన్ఫరెన్స్‌లో రెండో అంశంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని సజ్జల వివరించారు. ప్రతి నియోజకవర్గంలో మీడియాను విస్తృతంగా వినియోగించుకుని వైఎస్సార్‌సీపీ వాయిస్‌ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని, సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపుతూ, రకరకాల కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే సహించలేని స్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని, ఆ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సాయికృష్ణ, క్రాంతికుమార్‌ కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన తర్వాతే ప్రభుత్వంలో కొంత చలనం వచ్చిందన్న సజ్జల.. బాధిత కుటుంబాలకు అండగా నిలవడం వైఎస్సార్‌సీపీ బాధ్యతగా తీసుకుంటోందని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రైతుల సమస్యలపై పార్టీ చేపడుతున్న ఆందోళనలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై కలిసి వచ్చే పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని పోరాటాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పోర్టులు, హార్బర్‌లను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలపైనా ప్రజల పక్షాన బలమైన పోరాటం చేయాలని అన్నారు.

పార్టీలోని అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో చివరి రోజు వరకు అప్రమత్తంగా ఉండటంతో పాటు, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా వైఎస్సార్‌సీపీ ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement