సాయికృష్ణ కేసులో లాయర్ల మార్పు తిరస్కరణ | Sai Krishna Case Court Rejects Plea to Change Lawyers Without NOC | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసులో లాయర్ల మార్పు తిరస్కరణ

Jul 9 2026 10:52 PM | Updated on Jul 9 2026 10:56 PM

Sai Krishna Case Court Rejects Plea to Change Lawyers Without NOC

సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ కస్టడీ మరణం/అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తరఫున దాఖలైన పిటిషన్‌లో న్యాయవాదులను మార్చాలని చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే కేసులో వాదిస్తున్న న్యాయవాదుల నుంచి 'నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌ (NOC)' లేకుండా కొత్త న్యాయవాదులను అనుమతించడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

సాయికృష్ణ కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ నిర్వహించాలని, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని భద్రపరచి రికార్డులను సంరక్షించాలని కోరుతూ మానవ హక్కుల కమిటీ తరఫున ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. అయితే, ఆ కేసులో ఇకపై మానవ హక్కుల కమిటీ న్యాయవాదుల స్థానంలో ఇతర న్యాయవాదులు వాదిస్తారని విజయలక్ష్మి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఇప్పటికే కేసులో ఉన్న మానవ హక్కుల కమిటీ న్యాయవాదులను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అలాగే, వారి నుంచి ఎన్‌ఓసీ లేకుండానే కొత్త పిటిషన్ ఎలా దాఖలు చేశారని నిలదీసింది. మానవ హక్కుల కమిటీ న్యాయవాది ఎన్‌ఓసీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని విజయలక్ష్మి సోదరి కనకదుర్గ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, విజయలక్ష్మి తమను ఎప్పుడూ ఎన్‌ఓసీ కోరలేదని మానవ హక్కుల కమిటీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

ఈ నేపథ్యంలో ఎన్‌ఓసీ లేకుండా న్యాయవాదుల మార్పును అనుమతించలేమని స్పష్టం చేసిన కోర్టు, సంబంధిత పిటిషన్‌ను తిరస్కరించింది. అలాగే ఈ వ్యవహారంపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ, ఆ రోజున సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement