భూములపై బుకాయింపు | CM Chandrababu Naidu lies at will in the Banganapalle assembly | Sakshi
Sakshi News home page

భూములపై బుకాయింపు

Jul 10 2026 5:16 AM | Updated on Jul 10 2026 5:16 AM

CM Chandrababu Naidu lies at will in the Banganapalle assembly

బనగానపల్లె సభలో ఇష్టానుసారంగా సీఎం చంద్రబాబు అబద్ధాలు  

20 లక్షల ఎకరాలను 22 ఏ జాబితాలో పెట్టింది బాబు సర్కారే 

తప్పుల తడకగా పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు పంచుతూ పబ్లిసిటీ స్టంట్‌ 

ఆంగ్లేయుల తరువాత దేశ చరిత్రలో తొలిసారిగా భూముల రీ సర్వే చేపట్టింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే 

శాటిలైట్, డ్రోన్, జీపీఎస్, కోర్‌ స్టేషన్లు, రోవర్లు లాంటి టెక్నాలజీ వాడకంతో పక్కాగా సర్వే 

ప్రత్యేకంగా 10,185 మంది గ్రామ సర్వేయర్ల నియామకం 

గ్రామ సచివాలయాల ద్వారా మహాయజ్ఞం 

క్యూఆర్‌ కోడ్, జియో కో–ఆర్డినేట్స్‌తో 30 లక్షల మందికి పట్టాదార్‌ పుస్తకాలు 

జగన్‌ ప్రభుత్వం పనితీరుకు ప్రోత్సాహకంగా రూ.500 కోట్లు ఇన్సెంటివ్‌ ఇచ్చిన కేంద్రం 

క్రెడిట్‌ దోపిడీకి పాల్పడుతూ ఆ ప్రోత్సాహకాన్ని అందుకున్న చంద్రబాబు సర్కార్‌

సాక్షి, అమరావతి: తాను చేసిన తప్పులు, అరాచకాలను ఇత­రు­లకు ఆపాదించి బురద చల్లడంలో ఆరితేరిన సీఎం చంద్రబా­బు భూముల విషయంలోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ  పేరు­తో నెలకో జిల్లాలో బహిరంగ సభలు పెడుతూ తన అబద్ధాల ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుండడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వాటి పంపిణీయే ఒక ప్రహసనమైతే దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో రీసర్వే చేసి ఇచ్చిన పాసు పుస్తకాలపై అభూత కల్పనలతో విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వాటిని రద్దు చేశారు. 

ఇప్పుడు కొత్తగా తప్పుల తడకలతో పాస్‌ పుస్తకాలు ఇస్తూ అందుకోసం ప్రతి నెలా సభలు పెడుతున్నారు. తానేదో భూముల సమస్యలు పరిష్కరిస్తు­న్న­ట్లు కలరింగ్‌ ఇచ్చుకుంటున్నారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన సభలోనూ ఇదే ప్రయ­త్నం చేశారు. నిజానికి ఆంగ్లేయుల తరువాత దేశ చరిత్రలో తొలిసారిగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో భూ­ము­ల రీ సర్వేను ప్రారంభించి విజయవంతంగా నిర్వహించి­ందని, విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని పరిశీలకులు, రైతులు గుర్తు చేస్తున్నారు. 

గత ప్రభుత్వం ఇందుకోసం శాటిలైట్, డ్రోన్, జీపీఎస్, కోర్‌ స్టేషన్లు, రోవర్లు లాంటి సాంకేతికతను వినియోగించింది. సర్వే కోసం ఏకంగా 10,185 మంది గ్రామ సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. గ్రామ సచివాలయాల ద్వారా ఈ మహా యజ్ఞాన్ని చేపట్టారు. ఐదేళ్లలో 6,800 గ్రామాల్లో రీ సర్వే అన్ని దశలు పూర్తవగా మొత్తం 17 వేల గ్రామాల్లో డ్రోన్‌ సర్వే కూడా పూర్తయింది. భూముల సర్వే కోసం ఏ రాష్ట్రంలోని లేని విధంగా నాడు ఏపీలో డ్రోన్లు ఉపయోగించారు. సర్వే చేశాక ఉచితంగా 4 కోట్ల హద్దు రాళ్లు కూడా పాతించారు. 

సర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికి పట్టాదార్‌ పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాలపై క్యూ­ఆర్‌ కోడ్, భూమి హద్దులు తెలిపే జియో కో–ఆర్డినేట్స్‌ (అక్షా­ంశాలు, రేఖాంశాలు) ముద్రించారు. జియో హద్దులతో ఇకపై ఎవరూ భూమి హద్దులు మార్చలేని విధంగా చర్యలు తీసుకున్నారు. రూ.వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సర్వేపై చంద్రబాబు చేసిన దుష్ప్రచా­రం అంతా ఇంతా కాదు. 

అయితే చంద్రబాబు నోటికి తా­ళం వేస్తూ నాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన నివేదిక భూ­ముల రీ సర్వేలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని ధ్రువీకరించింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పనితీరుకు ప్రోత్సాహకంగా కేంద్రం రూ.500 కోట్లు ఇన్సెంటివ్‌ రాష్ట్రానికి ఇవ్వ­గా అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఆ మొత్తాన్ని తీసుకుంది. అంటే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేసిన విప్లవాత్మక కార్యక్రమానికి బాబు సర్కారు ప్రోత్సాహకాలు అందుకుంది.  

22 ఏ జాబితాలో 20 లక్షల ఎకరాలు  
ఈ రెండేళ్లలో టీడీపీ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు పైగా భూములను  22 ఏ నిషేధిత జాబితాలో పెట్టింది. 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్‌ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనా«దీనం భూములను  అకారణంగా నిషేధిత భూములుగా ప్రకటించింది. ఇవి కాకుండా పలు జిల్లా­ల్లో గతంలో 22 ఏ జాబితా నుంచి విముక్తి పొందిన లక్షల ఎక­రాల భూములను టీడీపీ ఎమ్మెల్యేలు 22 ఏ జాబితాలో పెట్టి­ంచారు. 

పట్టా భూములు, ఏళ్ల తరబడి అనుభవంలో ఉన్న ఆస్తులను సైతం ఈ జాబితాలోకి నెట్టేశారు. 2023లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 27 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి తెచ్చి ఎన్నికల సమయానికి 13.59  లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించింది. 2024లో చంద్రబాబు ప్రభు­త్వం అధికారంలోకి రాగానే అక్రమాల పేరుతో వాటిని మళ్లీ 22 ఏ జాబితాలో పెట్టేసింది. రెండేళ్లయినా ఆరోపణలు నిరూపించలేకపోయింది. ఆ భూములపై రైతులకు హక్కులు పునరుద్ధరించలేదు. ఒకవైపు లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి పైకి మాత్రం ఆ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చంద్రబాబు మభ్యపెడుతున్నారు. 

విలేజ్‌ సర్వీస్‌ ఈనాం భూములపై అడ్డగోలుతనం 
1.39 లక్షల ఎకరాల విలేజ్‌ సర్వీస్‌ ఈనాం భూములను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 22ఏ జాబితా నుంచి తొలగిస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని 22ఏ జాబితాలో పెట్టారు. రెండేళ్ల తర్వాత అందులో తప్పులు లేవని తేలడంతో తాజాగా వా­టిని నిషేధిత జాబితా నుంచి తొలగించడాని­కి ఆదేశాలు ఇచ్చారు. కానీ సభల్లో మాత్రం వైఎస్సార్‌సీపీ విలే­జ్‌ సర్వీస్‌ ఈనాం భూములను 22ఏ జాబితాలో పెట్టినట్లు అబద్ధాలు వ­ల్లె వేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో తెచ్చిన ఆటో మ్యుటేషన్, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లను తా­నే ముద్రించినట్లు కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పేస్తు­న్నా­రు.

గూటుపల్లి భూముల పేరుతో తహశీల్దార్‌ కార్యాలయంలో షో  
తాజాగా నంద్యాల జిల్లాకు వెళ్లిన చంద్రబాబు బనగానపల్లె సభలో అబద్ధాల నైపుణ్య ప్రదర్శన తర్వాత అక్కడి తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి పబ్లిసిటీ స్టంట్‌ నిర్వహించారు. బేతంచర్ల మండలం గూటుపల్లిలో సర్వే నెంబర్‌ 215లో ఉన్న 2,669 ఎకరాలను గత ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టిందని, ఇప్పుడు వాటిని తాను తొలగించినట్లు అడ్డగోలుగా అబద్ధాన్ని చెప్పారు. వాస్తవానికి ఆ భూముల్ని 1963లో వక్ఫ్‌ భూములుగా ప్రకటించి 22ఏ జాబితాలో పెట్టారు. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ బుధవారం జారీ చేసిన జీఓ ఆర్‌టీ నెంబర్‌ 77లో స్పష్టంగా పేర్కొంది. 

కానీ చంద్రబాబు మాత్రం 2023లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాన్ని 22ఏ జాబితాలో పెట్టినట్లు బుకాయించడం గమనార్హం. బేతంచర్ల మండలంలోని భూములను తొలగించడానికి బనగానపల్లె మండల తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లడాన్ని బట్టి చంద్రబాబు చేసింది పబ్లిసిటీ స్టంట్‌ అని తేలిపోయింది. వివిధ దశల ప్రతిపాదనలు, వెరిఫికేషన్లు చేశాక చివరిగా ప్రొసీడింగ్స్‌ కలెక్టర్‌ ఇస్తే జిల్లా రిజిస్ట్రార్‌ అమలు చేస్తారు. కానీ చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసం బేతంచర్ల భూములను బనగానపల్లె మండలంలో పరిష్కరించినట్లు బిల్డప్‌లు ఇచ్చుకోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement