చోరీ చేసి ఇంటికి నిప్పంటించిన దొంగలు! | Thieves set fire to house after stealing | Sakshi
Sakshi News home page

చోరీ చేసి ఇంటికి నిప్పంటించిన దొంగలు!

Jul 10 2026 5:24 AM | Updated on Jul 10 2026 5:24 AM

Thieves set fire to house after stealing

నిప్పు పెట్టడంతో పేలిపోయిన టీవీ

గుంతకల్లులో రైల్వే మహిళా ఉద్యోగి ఇంట్లో ఘటన

25 తులాల నగలు, 50 తులాల వెండి, రూ.20 వేల నగదు అపహరణ 

వెళ్లిపోతూ ఇంటికి నిప్పు.. కాలిపోయిన దుస్తులు, డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు

గుంతకల్లు రూరల్‌: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నివాసం ఉంటున్న రైల్వే మహిళా ఉద్యోగి ఇంట్లోకి బుధవారం రాత్రి దుండగులు చొరబడి నగ­లు, నగదు కొల్లగొ­ట్టారు. ఆధారా­లు కనిపించకూడదని ఇంటికి నిప్పంటించి వెళ్లిపోయారు. బాధితురాలు తెలిపిన వివరా­లు మేరకు.. ఉమాదేవి రైల్వేలో పాంచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త కూడా రైల్వేలోనే ఉద్యోగం చేస్తుండేవాడు. మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఉమాదేవి ఇద్దరు పిల్లలను చదివిస్తూ, వారి పెళ్లిళ్ల కోసం బంగారం, వెండి పోగు చేసుకుంది. ఇద్దరు బిడ్డలు మహారాష్ట్రలో డిగ్రీ చదువుతుండటంతో ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది.

బుధవారం రాత్రి యధావిధిగా ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి 25 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి వస్తువులు, రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఉదయం 4.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి పొగలు, మంటలు వస్తుండడాన్ని గమనించిన స్థానికులు ఉమాదేవికి, ఫైర్‌ సిబ్బందికి ఫోన్‌ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. 

ఇంట్లోని దుస్తులు, బీరువాలోని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, ఏటీఎం కార్డులు, ఫ్రిడ్జ్, రెండు టీవీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, కట్టుబట్టలు మిగిలాయని బాధితురాలు బోరున విలపించింది. గుంతకల్లు రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్, కసాపురం ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement