అనంతపురం సిటీ: సర్వజనాస్పత్రి విస్తరణలో భాగంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం గొప్ప ఆశయంతో నిర్మించ తలపెట్టిన ఎంసీహెచ్ (మెటర్నటీ, చిల్డ్రన్ హెల్త్) బ్లాక్ నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. గతంలో తాను సీఎంగా ఉన్న 2017లో హాస్పిటల్ బ్లాక్ నిర్మాణాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు ఇప్పటికీ అదే పంథా కొనసాగిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 44 లక్షల జనాభా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రి విస్తరణ, అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ విషయంపై అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం సానుకూలంగా స్పందిస్తూ రూ.300 కోట్ల నిధులతో కొత్తగా సర్జికల్, ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. సర్వజనాస్పత్రి వద్ద ఉన్న నీటి పారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ కార్యాలయాలను మరో ప్రాంతానికి మార్చి ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో సర్జికల్ బ్లాక్, రోడ్లు భవనాల శాఖ కార్యాలయ ఆవరణలో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
పునాది కూడా పడలేదు..
సర్జికల్, ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణాల కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన మేఘ ఇంజినీరింగ్ – ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ఏపీఎంఎస్‌ఐడీసీతో 2023 ఫిబ్రవరి 3న అగ్రిమెంట్ కూడా చేసుకుంది. జీ ప్లస్ 5 భవనాలతో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి రోడ్లు భవనాల శాఖను శారదా నగర్‌లోని క్యాన్సర్ ఆస్పత్రి వద్దకు మార్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఏపీఎంఎస్‌ఐడీసీ చేసింది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం... చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడడంతో ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి. కార్యాలయ మార్పుపై అనుమతులు జారీ చేయడంలో బాబు సర్కార్ నిర్లక్ష్యం చూపడంతో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి కనీసం పునాదులు కూడా పడలేదు. పొరుగున ఉన్న తిరుపతి జిల్లాలో వెయ్యి పడకలతో కూడిన ఎంసీహెచ్ బ్లాక్ ప్రత్యేకంగా ఉండగా... సర్వజనాస్పత్రిలో నేటికీ మాతాశిశు సంరక్షణ విభాగం లేకపోవడం గమనార్హం. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వీడితే 200 పడకలతో కూడిన ఎంసీహెచ్ బ్లాక్ జిల్లాలో అందుబాటులోకి వస్తుంది. అలాగే ప్రత్యేకంగా ఓ బ్లడ్ బ్యాంక్, పెథాలజీ విభాగం, ట్రాన్స్ డెక్కన్ టీచింగ్ రూం, క్రిటికల్ కేర్ యూనిట్, ఐసీయూ, ఐసీసీయూ, లేబర్ వార్డులు, రోగి సహాయకులకు ప్రత్యేక గదులు తదితరాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రజల ఆరోగ్యహక్కుపై దాడి
జీజీహెచ్ వద్ద నిలిచిపోయింది కేవలం ఒక భవనం కాదు, లక్షలాది మంది పేదల ఆరోగ్య భవిష్యత్తు. ఇది ప్రజల ఆరోగ్య హక్కుపై జరుగుతున్న దాడిగానే భావించాల్సి వస్తుంది. ఈ నిర్లక్ష్యానికి ముగింపు పలకాల్సిన తరుణం వచ్చింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అందరూ కలిసి రావాలి. – నాగేంద్ర కుమార్,
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
‘ఎంసీహెచ్’ బ్లాక్‌పై నీలినీడలు
జగన్ ప్రభుత్వంలో గొప్ప ఆశయంతో నిర్మాణానికి శ్రీకారం
బాబు సర్కారులో ఒక్క అడుగూ ముందుకు పడని వైనం


