నైరుతిపై ఎల్‌నినో పడగ | - | Sakshi
Sakshi News home page

నైరుతిపై ఎల్‌నినో పడగ

Jul 10 2026 5:16 AM | Updated on Jul 10 2026 5:16 AM

అనంతపురం అగ్రికల్చర్‌: కరువు సీమ అనంతపురం జిల్లాపై ఎల్‌నినో పడగ విప్పుతోంది. ఊహించినట్లుగానే నైరుతి రుతుపవనాలు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఎల్‌నినో అనేది కొత్తది కాకున్నా.. ఈ సారి శక్తివంతమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రుతుపవనాలకు జీవనాడిగా భావించే సోమాలియా జెట్‌, మెడెన్‌–జూలియన్‌ అస్సిలేషన్‌ (ఎంజేవో) కూడా ప్రతికూలంగా ఉండడంతో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు చెప్తున్నారు.

దక్షిణ హిందూమహాసముద్రం నుంచి భూమధ్యరేఖను దాటి సొమాలియా తీరప్రాతం వెంట ఆరేబియా సముద్రం మీదుగా భారతదేశం వైపు వీచే బలమైన తక్కువ ఎత్తు గాలుల ప్రవాహాన్ని సోమాలియా జెట్‌గా పిలుస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అరేబియా సముద్రం నుంచి భారీగా తేమను భారతదేశానికి తీసుకురావడం వల్ల నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపిస్తాయన్నారు. సొమాలియా జెట్‌ బలంగా ఉంటే సాధారణంకు మించి వర్షపాతం నమోదు అవుతాయని తెలిపారు. ఇపుడు సొమాలియా జెట్‌ బలహీనంగా మారడంతో ‘నైరుతి’ మందగించినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఎంజేవో అనేది హిందూమహాసముద్రంలో 30 నుంచి 60 రోజుల వ్యవధిలో తూర్పుకు కదిలే విశాల స్థాయి మేఘాలు, వర్షపాతం, గాలుల దోళనం వల్ల మంచి వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఎంజేవో అనేది కనిపించని వాతావరణ తరంగం లాంటిదని, తూర్పుకు చురుగ్గా కదిలితే రుతుపవనాల శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. ఎంజేవోకు భారత్‌కు దగ్గరగా ఉన్నపుడు రుతుపవనాలు ప్రభావం చూపిస్తాయన్నారు. అయితే ఎపుడు ఎంజేవో భారత్‌కు దూరంగా ఉన్నందున నైరుతి బలహీనపడే అవకాశం కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.

20తో ముగియనున్న పునర్వసు కార్తె.. :

విత్తనానికి అదనుగా భావించే పునర్వసు కార్తె ఈనెల 20తో ముగుస్తుంది. అంతలోపు పంటలు విత్తుకుంటే అంతో ఇంతో పంట చేతికి వస్తుందని రైతుల్లో నమ్మకం. వర్షాల స్థితిగతులు పరిశీలిస్తే అదనులో ‘ముంగారు’ కష్టమేనని అంటున్నారు. జూలై నెల సాధారణ వర్షపాతం 63.4 మి.మీ కాగా ప్రస్తుతానికి కేవలం ఒక మి.మీ నమోదు కావడం గమనార్హం. ఓవరాల్‌గా జూలై నెల దాటితే ఆగస్టులో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి ప్రధాన పంటలు వేసుకోవడం మంచిదికాదని చెబుతున్నారు. ఎల్‌నినో పడగ విప్పుతుండటంతో ‘అనంత’ కరువు గుప్పిట్లోకి వెళుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా కరువు తరుముకొస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం, రాయితీ విత్తన ప్రణాళిక అమలు చేయకపోవడంపై రైతుల ఆందోళన రెట్టింపవుతోంది.

25 రోజులుగా జాడలేని వరుణుడు

ఎల్‌నినోతో పాటు సొమాలియా జెట్‌, ఎంజేవోలు కూడా ప్రభావం చూపిస్తున్నందున వరుణుడి జాడ కరువైంది. జూన్‌ 6న నైరుతి ప్రవేశించగా... 7, 14, 15 తేదీల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. 15 తర్వాత కనీసం తేలిక పాటి వర్షం కూడా నమోదు కాలేదు. 25 రోజులవుతున్నా వర్షాలు లేకపోవడంతో అనంతపురం జిల్లా అంతటా 32 మండలాల్లోనూ మొదటి వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్‌) నమోదు కావడం విశేషం. జూన్‌ మొదట్లో కురిసిన వర్షాలకు సాధారణం నమోదైనా, విత్తుకు కీలకమైన జూలైలో వర్షం జాడ లేకపోవడంతో ఖరీఫ్‌ ఏరువాక అర్ధంతరంగా ఆగిపోయింది. 3.43 లక్షల హెక్టార్లు అంచనా వేయగా, ప్రస్తుతానికి 75 వేల హెక్టార్ల వద్ద మందకొడిగా ‘సాగు’తోంది. చాలా మంది రైతులు ఈ సారి కంది పంటపై మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత పత్తి ఉండగా ప్రధానపంట వేరుశనగ మూడో స్థానానికి పరిమితమైంది. మొక్కజొన్న, ఆముదం పంటలు కూడా పెరిగే సూచన కనిపిస్తోంది.

సొమాలియా జెట్‌, ఎంజేవోతో బలహీనమైన రుతుపవనాలు

జూన్‌ 15 తర్వాత కరువైన వరుణుడి జాడ... డ్రైస్పెల్స్‌ నమోదు

విత్తుకు కీలకమైన జూలైలో వర్షాలు లేక ఆగిపోయిన ముంగారు

3.43 లక్షల హెక్టార్లకు గానూ 75 వేల హెక్టార్లలో పంటల సాగు

కరువు తరుముతున్నా ప్రత్యామ్నాయంపై తేల్చని బాబు సర్కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement