12లోపు డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

12లోపు డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలి

Jul 10 2026 5:16 AM | Updated on Jul 10 2026 5:16 AM

అనంతపురం అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఈనెల 12వ తేదీలోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ సంబంధి అధికారులను ఆదేశించారు. ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ 70 శాతం దాటిన బీఎల్‌ఓలు వారి పరిధిలో రాజకీయ పార్టీల బీఎల్‌ఏలతో శుక్రవారం సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. డబుల్‌ ఓట్లు, మరణించిన వారు, స్థానికంగా లేని వారు, ప్రదేశం మారిన వారి ఓట్ల జాబితాను బీఎల్‌ఓలకు అందజేసి అభ్యంతరాలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఎల్‌ఓల హాజరును ప్రతి రోజూ ఈఆర్‌ఓలు పర్యవేక్షించాలని చెప్పారు. ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక డ్రైవ్‌కు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ ఎ.మలోల, ఆర్‌డీఓలు రామ్మోహన్‌, వసంతబాబు, డిప్యూటీ కలెక్టర్లు రమేష్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కిరణ్మయి, ఎన్నికల డీటీ కనకరాజు, ఎస్‌ఏ శామ్యూల్‌ బెంజిమన్‌ పాల్గన్నారు.

15 లక్షల ఈఎఫ్‌ల డిజిటలైజేషన్‌

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా గురువారం నాటికి ఓటర్ల నుంచి 15 లక్షల ఎన్యుమరేషన్‌ ఫారాలు స్వీకరించి డిజిటలైజేషన్‌ చేసినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్‌ వెల్లడించారు. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 20,29,807 మంది ఓటర్లకు (99.57 శాతం) ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశారన్నారు. అందులో 15,00,435 మంది (73.60 శాతం) ఓటర్ల నుంచి ఈఎఫ్‌లు స్వీకరించి డిజిటలైజేషన్‌ చేసినట్లు వెల్లడించారు. ఓటర్లు తమ ఈఎఫ్‌ను పూరించి 12వ తేదీలోపు బీఎల్‌ఓకి అందజేయాలని కలెక్టర్‌ సూచించారు.

గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయండి

అనంతపురం టౌన్‌: ప్రధాన మంత్రి అవాస్‌ యోజన ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగంగా చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణ సంస్థ ఎండీ అరుణ్‌ కుమార్‌ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఇదే స్ఫూర్తితో పని చేయాలని కితాబు ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం అనంతపురం వచ్చిన అరుణ్‌కుమార్‌కు గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్‌తో పాటు రూరల్‌ ప్రాంతాల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి పురోగతిపై ఆరా తీయాలన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలజాతోపాటు డీఈలు శీమన్నారాయణ, హనుమప్ప, మేనేజర్‌ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుదాం

ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ దివాకర్‌రావు

అనంతపురం అర్బన్‌: ఉద్యోగులను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుదామని ఉద్యోగులకు ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ ఆర్‌ఎన్‌దివాకర్‌రావు పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధనకు చేపట్టిన న్యాయమైన పోరాటానికి అందరూ సహకరించాలని కోరారు. గురువారం బీసీ సంక్షేమశాఖ, జిల్లా పోలీసు, ఆడిట్‌ శాఖ ఉద్యోగులతో జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదన్నారు. హక్కుగా రావాల్సిన వాటిని సైతం ఇవ్వలేదన్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ ఇస్తామన్న హామీని అమలు చేయలేదన్నారు. పీఆర్‌సీ కమిషన్‌ నియమించకుండా కాలయాపన చేస్తోందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఉద్యమించడం ద్వారానే హక్కులను సాధించుకోగలమని, ఈ నేపథ్యంలో ఈనెల 21న తలపెట్టిన ఉద్యమ సన్నద్ధం సభ విజయానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తోట చెన్నప్ప, వెంకటశివప్రసాద్‌, నాగభూషణం, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement