కన్నబిడ్డ సామర్థ్యం మీద ఒక తల్లి నమ్మకం ఆ కూతురు భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. కన్నతల్లి కష్టాన్ని , తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని కూతురు ఆమెకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. కష్టపడి చదివి, ఈ-కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగాన్ని సాధించిన ఒక బెంగళూరు యువతి కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింంది.
అసలు ఏమైంది?
కాలేజీ అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు, తన కూతురి చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో తల్లి ఏమాత్రం సంకోచించకుండా తన నగలను తాకట్టు పెట్టింది. తన తల్లి త్యాగాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఆ కుమార్తె అహర్నిశలూ కష్ట పడింది. తన సక్సెస్ స్టోరీని అనుస్మిత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ఫీజు చెల్లించడానికి తల్లి తన చేతికున్న బంగారు గాజులను తాకట్టు పెట్టారు. ఆ రోజు తల్లి చూపిన చొరవ, చేసిన త్యాగమే తన జీవితాన్ని మలుపు తిప్పిందని ఆమె పేర్కొన్నారు.ఏమాత్రం వెనుకా ముందూ ఏమీ ఆలోచించకుండా చేసిన ఆమె త్యాగమే తన సక్సెస్‌కు మూలమని సంతోషాన్ని ప్రకటించింది.
తల్లి తనపై ఉంచిన నమ్మకాన్ని వృథా చేయకుండా, ఆ యువతి, చదువులో నిరంతరం శ్రమిస్తూ అద్భుతమైన ప్రతిభతో రాణించింది. కాలేజీ రోజుల్లోనే కోడింగ్, సాంకేతిక నైపుణ్యాలపై పట్టు సాధించింది. చివరకు దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్-1 గా ఉద్యోగాన్ని అమ్మకు గిఫ్ట్‌గా అందించింది.
"నా కాలేజీ అడ్మిషన్ ఫీజు కట్టడానికి అమ్మ తన బంగారు గాజులను తాకట్టు పెట్టడానికి ఏమాత్రం ఆలోచించలేదు, అమ్మ ఎప్పుడూ అలాగే చేస్తుంది," అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్' (Flipkart)లో ఉద్యోగం రావడం అనేది కేవలం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదు; తన తల్లి చేసిన త్యాగానికి నిదర్శనమి పేర్కొంది. ప్రతిరోజూ ఫ్లిప్‌కార్ట్‌కు వెళ్తున్నప్పుడు, అమ్మ కోసమే వెళ్తున్నానని భావిస్తాననని ఈ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, అమ్మ చేసిన త్యాగానికి రుజువు అని చెప్పింది.
తన జీవితంలోని ఈఅద్భుతమైన విషయాన్ని అందరికీ చెప్పడానికి ఈ రోజు సరైనదనిపించిందంటూ ‘‘అమ్మా... ఇది నీ కోసమే. అన్నీ నీ కోసమే. ఎప్పటికీ. అన్నింటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను." అంటూ అనుస్మిత ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.


