2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు! | EV Industry To Create 40 Million Jobs By 2030: Report | Sakshi
Sakshi News home page

2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు!

Aug 10 2026 3:01 PM | Updated on Aug 10 2026 3:13 PM

EV Industry To Create 40 Million Jobs By 2030: Report

ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం భారతదేశంలో రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. దీంతో.. ఈవీ పరిశ్రమలు, అనుబంధ సంస్థలు కూడా విస్తరిస్తున్నాయి. వాహనాల తయారీ, బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లు, సర్వీసింగ్, సాఫ్ట్‌వేర్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్, బ్యాటరీ రీసైక్లింగ్ వంటి అనేక రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని 'అడెక్కో ఇండియా' తన నివేదికలో వెల్లడించింది.

అడెక్కో ఇండియా డేటా ప్రకారం.. 2030 నాటికి భారతదేశ ఈవీ రంగం 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. అయితే.. ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం నేరుగా వాహనాల తయారీకి సంబంధించినవి కాకపోవడం గమనార్హం. ఇందులో కేవలం 10-15 శాతం మాత్రమే ప్రత్యక్ష ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది.

అంటే.. ఒక వ్యక్తి కార్లు లేదా బైకులు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేయకపోయినా ఈవీ రంగంలో ఉద్యోగం పొందవచ్చు. ఛార్జింగ్ స్టేషన్ నిర్వహణ, బ్యాటరీ సర్వీసింగ్, డ్రైవర్ ట్రైనింగ్, కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్, లాజిస్టిక్స్, రీసైక్లింగ్ వంటి రంగాల్లో కూడా మంచి అవకాశాలు రావచ్చు. తయారీ రంగం మాత్రం ఈవీ ఉద్యోగాల్లో ప్రధాన పాత్ర పోషించనుంది. కాబట్టి మొత్తం ఈవీ ఉద్యోగ డిమాండ్‌లో సుమారు 50-55 శాతం తయారీ రంగం నుంచి ఉండవచ్చని ఒక అంచనా.

ఈవీ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి భవిష్యత్తులో మంచి జీతాలు కూడా లభించే అవకాశం ఉంది. బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్, ఛార్జింగ్ సిస్టమ్స్, టెలిమాటిక్స్ వంటి కొత్త నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. అడెక్కో ఇండియా ప్రకారం, ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారు సాధారణ ఉద్యోగుల కంటే కూడా 45 శాతం ఎక్కువ జీతం పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత ఆటోమొబైల్ కార్మికులు కూడా కొత్త ఈవీ టెక్నాలజీలను నేర్చుకోవడం చాలా ముఖ్యం.

ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలతో.. కమర్షియల్ ఫ్లీట్లు, టాక్సీలు, డెలివరీ వాహనాలు వంటి రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. వాహనాల బ్యాటరీ పనితీరును గమనించడం, ఛార్జింగ్ సమయాలను నిర్వహించడం, రూట్లను ప్లాన్ చేయడం, వాహనాలను సర్వీస్ చేయడం వంటి పనులకు ప్రత్యేక సిబ్బంది అవసరం అవుతారు. అయితే.. ఈ ఉద్యోగాల్లో కొన్ని మొదట కాంట్రాక్ట్ లేదా ఫ్లెక్సీ ఉద్యోగాలుగా రావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement