మేధో వలస నుంచి మేధో సమృద్ధి వైపు.. | Brain Drain to Brain Gain Why Indian Students Are Returning Home | Sakshi
Sakshi News home page

మేధో వలస నుంచి మేధో సమృద్ధి వైపు..

Aug 10 2026 12:49 PM | Updated on Aug 10 2026 1:07 PM

Brain Drain to Brain Gain Why Indian Students Are Returning Home

విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తయ్యాక అక్కడే స్థిరపడాలనే ఆలోచనా ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విదేశీ విద్యను ఆకాంక్షిస్తున్న ప్రతి ఐదుగురు భారతీయ విద్యార్థుల్లో నలుగురు (80 శాతం) చదువు పూర్తి కాగానే తిరిగి భారత్‌ రావాలని కోరుకుంటున్నారు. ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థ ‘ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్’ విడుదల చేసిన తాజా నివేదిక ఈ ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించింది.

మారుతున్న ప్రాధాన్యతలు

దశాబ్దాలుగా మన దేశాన్ని వేధిస్తున్న ‘మేధో వలస’ (Brain Drain) దశ ముగిసి, భారత్ ఇప్పుడు ‘మేధో సమృద్ధి’ (Brain Gain) దిశగా పయనిస్తోందనడానికి ఈ నివేదిక నిదర్శనం. గతంలో విదేశీ డిగ్రీ అనగానే అక్కడే పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్‌), ఉద్యోగం పొందడమే ప్రధాన లక్ష్యంగా ఉండేది. కానీ నేటి యువతరం ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సంపాదించిన గ్లోబల్ ఎక్స్‌పోజర్, సాంకేతిక నైపుణ్యాలను స్వదేశంలోనే వినియోగించాలనుకుంటున్నారు. దాంతో సొంతంగా స్టార్టప్‌లు ప్రారంభించడం, వేగంగా విస్తరిస్తున్న భారతీయ ఇన్నోవేషన్ ల్యాబ్‌లలో కీలక పాత్ర పోషించడం, గ్లోబల్ కార్పొరేట్ రంగంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

స్వదేశంలో అవకాశాలు.. విదేశీ సవాళ్లు

ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా నిలవడం, హైదరాబాద్, బెంగళూరు.. వంటి నగరాలు గ్లోబల్ టెక్నాలజీ హబ్‌లుగా మారడం విద్యార్థుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, ఫిన్‌టెక్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో భారత్‌లో లభిస్తున్న అవకాశాలు, వేతనాలు పాశ్చాత్య దేశాలకు దీటుగా ఉన్నాయి. మరోవైపు, పలు అభివృద్ధి చెందిన దేశాల్లో కఠినతరం అవుతున్న వీసా నిబంధనలు, వర్క్ పర్మిట్లపై పరిమితులు, పెరిగిన జీవన వ్యయం కూడా విద్యార్థులను స్వదేశం వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి.

అంతర్జాతీయ స్థాయి విద్యను, అక్కడి అనుభవాన్ని మూలధనంగా మార్చుకుని తిరిగొచ్చే ఈ మేధో సంపత్తి భారత ఆర్థిక, సాంకేతిక వ్యవస్థలకు కొత్త ఊపిరి పోస్తుందనడంలో సందేహం లేదు. సరైన ప్రోత్సాహకాలు అందిస్తే ఈ ‘మేధో సమృద్ధి’ రాబోయే దశాబ్దంలో ‘వికసిత భారత్’ స్వప్నాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement