మహీంద్రా గ్రూప్ కీలక నాయకత్వ నియామకం చేపట్టింది. కమిన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న శ్వేతా ఆర్యను గ్రూప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ (Group Chief Strategy Officer)గా నియమించింది. ఆమె వచ్చే సెప్టెంబర్ 15 నుంచి కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సీనియర్ మేనేజ్‌మెంట్‌లోనూ ఆమె భాగం కానున్నారు.
కొత్త హోదాలో శ్వేతా ఆర్య మహీంద్రా గ్రూప్ స్ట్రాటజీ ఆఫీస్‌కు నాయకత్వం వహిస్తారు. గ్రూప్‌లోని వివిధ వ్యాపారాల్లో వృద్ధి అవకాశాలను గుర్తించడం, ఉన్న వ్యాపారాల్లో విలువను పెంచడం, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను సాధించడం వంటి అంశాలపై ఆమె దృష్టి సారించనున్నారు. ఆమె గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యురాలిగా ఉంటూ, గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షాకు రిపోర్ట్ చేస్తారు.
23 ఏళ్లకు పైగా అనుభవం
శ్వేతా ఆర్యకు ఆటోమోటివ్, ట్రావెల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం వంటి విభిన్న రంగాల్లో 23 ఏళ్లకు పైగా వ్యాపార, వ్యూహాత్మక నాయకత్వ అనుభవం ఉంది. కమిన్స్‌లో చేరకముందు ఆమె థామస్ కుక్ ఇండియాలో స్ట్రాటజీ, విలీనాలు-కొనుగోళ్ల (M&A) విభాగాలను నడిపించారు. అంతకుముందు కీర్నీ, ఇన్ఫోసిస్ సంస్థల్లోనూ వివిధ బాధ్యతలు నిర్వహించారు.
కమిన్స్ ఇండియాలో ఆమె 2024 సెప్టెంబర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు సంస్థలో స్ట్రాటజీ లీడర్‌గా, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లీడర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె కమిన్స్ ఇండియా పవర్ సిస్టమ్స్ బిజినెస్‌కు నాయకత్వం వహిస్తూ, పవర్ జనరేషన్, ఇండస్ట్రియల్ వ్యాపారాల్లో వృద్ధి, మార్కెట్ విస్తరణపై పనిచేస్తున్నారు.


