అదరగొట్టిన మహీంద్రా.. కంగుతిన్న హ్యుందాయ్‌ | Mahindra Q1 Profit Jumps 34 percent Hyundai India Profit falls 35 percent | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన మహీంద్రా.. కంగుతిన్న హ్యుందాయ్‌

Jul 31 2026 2:04 PM | Updated on Jul 31 2026 2:45 PM

Mahindra Q1 Profit Jumps 34 percent Hyundai India Profit falls 35 percent

దేశీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) బంపర్‌ ఫలితాలతో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో (2026–27, క్యూ1) కంపెనీ రూ. 5,455 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.4,083 కోట్లతో పోలిస్తే లాభం 34 శాతం జంప్‌ చేసింది. మొత్తం ఆదాయం కూడా 28 శాతం వృద్ధితో రూ. 45,529 కోట్ల నుంచి రూ. 58,188 కోట్లకు చేరింది.

‘స్థూల ఆర్థిక ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ, మా వైవిధ్యమైన పోర్ట్ట్‌ఫోలియో, చురుకైన చర్యలతో సవాళ్లను అధిగమించి, పటిష్టమైన ఫలితాలను సాధించగలిగాం. ప్రస్తుత డైనమిక్‌ వ్యాపార పరిస్థితుల్లో కూడా ఆటో, వ్యవసాయ సంబంధిత విభాగాలు తమ లీడర్‌షిప్‌ పొజిషన్లను బలోపేతం చేసుకుంటున్నాయి’ అని ఎంఅండ్‌ఎం గ్రూప్‌ సీఈఓ, ఎండీ అనీశ్‌ షా పేర్కొన్నారు.

  •     క్యూ1లో కంపెనీ 23% వృద్ధితో రూ.3,04,000 వాహనాలను విక్రయించింది. ఇందులో 1,75,000 స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ) అమ్ముడవ్వడం విశేషం. ఎస్‌యూవీ మార్కెట్‌ వాటా సీక్వెన్షియల్‌గా అర శాతం పెరిగిందని, ఎక్స్‌ఈవీ 9ఎస్‌ అమ్మకాల సంఖ్య పరంగా భారత్‌లో టాప్‌ సెల్లింగ్‌ ఈవీగా నిలిచిందని ఎంఅండ్‌ఎం సీఈఓ (ఆటో, ఫామ్‌ సెక్టార్‌) రాజేష్‌ జెజూరికర్‌ చెప్పారు.

  •     ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగం నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 13 శాతం ఎగిశాయి.

  •     టెక్‌ మహీంద్రా మార్జిన్ల జోరు కొనసాగింది. ఎబిటా 330 బేసిస్‌ పాయింట్లు మెరుగుపడింది.

  •     మహీంద్రా లాజిస్టిక్స్‌ ఆదాయం పటిష్టంగా 23 శాతం వృద్ధి సాధించింది. 
     

హ్యుందాయ్‌కి పశ్చిమాసియా సెగ

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఎగుమతులు క్షీణించడం, ఒక సప్లయర్‌ ప్లాంటులో అగ్నిప్రమాదంతో ఉత్పత్తి దెబ్బతినడం తదితర అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ మోటర్స్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌)పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనితో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన లాభం రూ. 889 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన రూ. 1,369 కోట్లతో పోలిస్తే ఇది 35 శాతం తక్కువ.

ఇక ఆదాయం రూ. 16,413 కోట్ల నుంచి రూ. 16,335 కోట్లకు తగ్గింది. అటు వ్యయాలు రూ. 14,780 కోట్ల నుంచి రూ. 15,407 కోట్లకు పెరిగాయి. పలు ప్రతికూల పరిస్థితుల వల్ల అమ్మకాలు, లాభదాయకతపై ప్రభావం పడిందని కంపెనీ సీఈవో తరుణ్‌ గర్గ్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 7,500 కోట్లు ఇన్వెస్ట చేయనున్నామని గర్గ్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement