రూ. 525 కోట్ల డీల్ ∙2031 నాటికి 12,500 కోట్ల ఆదాయం టార్గెట్
ముంబై: ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) తమ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ట్రక్కులు, బస్సుల విభాగాన్ని (ఎంటీబీడీ) అనుబంధ సంస్థ ఎస్‌ఎంఎల్ మహీంద్రాకి బదలాయించనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 525 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 7న ఒప్పందాలు (బీటీఏ) కుదుర్చుకోనుండగా, వచ్చే ఏడాది జనవరి నాటికి డీల్ పూర్తి కావచ్చని వివరించింది.
పటిష్టమైన బ్రాండ్స్‌తో, విలీన సంస్థ, మార్కెట్లో శక్తివంతమైన పోటీదారుగా ఎదుగుతుందని ఎస్‌ఎంఎల్ మహీంద్రా చైర్మన్ వినోద్ సహాయ్ చెప్పారు. భవిష్యత్ వృద్ధి అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కగట్టడం కాకుండా ప్రస్తుత వేల్యుయేషన్‌పై ఎస్‌ఎంఎల్ షేర్‌హోల్డర్లకు స్పష్టత ఉండేందుకు స్లంప్ సేల్ ప్రాతిపదికన ఈ డీల్ ఉంటుందని ఎంఅండ్‌ఎం సీఎఫ్‌వో అమర్‌జ్యోతి బారువా చెప్పారు. తేలికపాటి, మధ్య రకం వాణిజ్య వాహనాల రంగానికి చెందిన ఎస్‌ఎంఎల్ ఇసుజులో మహీంద్రా గతేడాది మెజారిటీ వాటాలను కొనుగోలు చేసి, పేరును ఎస్‌ఎంఎల్ మహీంద్రాగా మార్చింది.
విలీన సంస్థ ఇలా..
ఎస్‌ఎంఎల్ మహీంద్రా, ఎంటీబీడీ విలీనతో ఏర్పడే సంస్థవిస్తృత స్థాయి ఉత్పత్తుల శ్రేణితో దేశీయంగా నాలుగో అతి పెద్ద వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజంగా ఎదగనుంది. 2030–31 ఆర్థిక సంవత్సరం నాటికి ఆదాయాలను రూ. 12,500 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల ఆదాయం కలిపి సుమారు రూ. 6,000 కోట్లుగా ఉంటుంది. ఇరు సంస్థలు చేతులు కలపడం వల్ల మార్కెట్ వాటాలో నాలుగో స్థానానికి చేరవచ్చు. ఉమ్మడి వ్యాపారానికి 200 డీలర్íÙప్‌లు, 650 టచ్‌పాయింట్లు ఉంటాయి. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో ఎస్‌ఎంఎల్ కొత్తగా 25 కొత్త డీలర్‌షిప్‌లు, 60 టచ్‌పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు సహాయ్ చెప్పా రు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఉత్పత్తుల శ్రేణి విస్తరణ, సామర్థ్యాలను పెంచుకోవడంలాంటి అంశాలపై విలీన సంస్థ దృష్టి పెడుతుంది.
బుధవారం బీఎస్‌ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 1.51 శాతం క్షీణించి రూ. 3,223 వద్ద ముగియగా, ఎస్‌ఎంఎల్ మహీంద్రా 20 శాతం ఎగిసి రూ. 4,565.50 వద్ద క్లోజయ్యింది.


