అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం డెల్ టెక్నాలజీస్ భారత మార్కెట్లో తన ప్రీమియం కన్జూమర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఇందులో భాగంగా అత్యంత సన్నని, తేలికైన ‘ఎక్స్‌పీఎస్ 13’ ల్యాప్‌టాప్‌తో పాటు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేసే ‘డెల్ 14ఎస్, 16ఎస్’, అధిక సామర్థ్యం కలిగిన గేమింగ్ డివైజ్ ‘ఏలియన్‌వేర్ 15’లను కంపెనీ బుధవారం విడుదల చేసింది. విభిన్న అవసరాలున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చినట్లు డెల్ తెలిపింది. తమ కన్జూమర్ విభాగంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద పోర్ట్‌ఫోలియో అని పేర్కొంది. కొత్త ల్యాప్‌టాప్‌లను దేశవ్యాప్తంగా 400 నగరాల్లోని డెల్ స్టోర్లు, రిటైల్, మల్టీ–బ్రాండ్ ఔట్‌లెట్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని డెల్ టెక్నాలజీస్ కన్జూమర్ సేల్స్ ఇండియా సీనియర్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ అనురాగ్ అరోరా తెలిపారు.
అత్యంత తేలికైన ఎక్స్‌పీఎస్ 13
డెల్ ఇప్పటివరకు రూపొందించిన ఎక్స్‌పీఎస్ సిరీస్‌లో అత్యంత సన్నని (12.7 మిల్లీమీటర్లు), తేలికైన (1 కేజీ) ల్యాప్‌టాప్‌గా ఎక్స్‌పీఎస్ 13ను తీసుకొచి్చంది. ఇది గరిష్టంగా 17 గంటల స్ట్రీమింగ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇంటెల్ కోర్ సిరీస్ 3 లేదా కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్లతో లభించే ఈ మోడల్‌లో అత్యధికంగా 32జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ మెమరీ ఉంటుంది. అలాగే 2.5కే ఎల్‌సీడీ ఇన్ఫినిటీ ఎడ్జ్ టచ్ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.79,990గా నిర్ణయించారు.
14ఎస్, 16ఎస్‌లో ఏఐ పవర్
డెల్ 14ఎస్, 16ఎస్ మోడళ్లను ఏఐ ఆధారిత కంప్యూటింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. సిరీస్ 3 ఇంటెల్ కోర్ అల్ట్రా లేదా ఏఎండీ రైజెన్ ఏఐ 400 సిరీస్ ప్రాసెసర్లతో ఇవి లభిస్తాయి. గరిష్టంగా 50 టీఓపీఎస్ సామర్థ్యం కలిగిన ఎన్‌పీయూతో ఆన్–డివైజ్ ఏఐ ఫీచర్లను అందిస్తాయి. ఇవి ఎఫ్‌హెచ్‌డీ ప్లస్, 2.8కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఆప్షన్లలో లభిస్తాయి. 120 హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. రోజువారీ పని, ఎంటర్‌టైన్‌మెంట్ తదితర అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు. డెల్ 14ఎస్ ప్రారంభ ధర రూ.1,19,990 కాగా, డెల్ 16ఎస్ ధర రూ.2,29,990 నుంచి ప్రారంభమవుతుంది.
గేమర్ల కోసం ఎలియన్‌వేర్ 15
కంప్యూటర్ గేమింగ్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని ఏలియన్‌వేర్ 15ను డెల్ తీసుకొచి్చంది. ఇందులో గరిష్టంగా ఇంటెల్ కోర్ 7 (సిరీస్ 2) 240హెచ్ ప్రాసెసర్, ఎన్‌విడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5060 గ్రాఫిక్స్ అందించారు. 165 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 15.3 అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని ప్రారంభ ధర రూ.1,28,990గా ఉంది.


