జీప్ ఇండియా.. మెరిడియన్ 85వ యానివెర్సరీ ఎడిషన్‌ను రూ.36.05 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. దీనికి కంపెనీ కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది.
ఈ స్పెషల్ ఎడిషన్, టాప్ స్పెక్ ఓవర్‌ల్యాండ్ వేరియంట్ ఆధారంగా నిర్మితమైంది. ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. యానివర్సరీ ఎడిషన్‌లో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ముందు డోర్లు, టెయిల్‌గేట్, వీల్ సెంటర్ క్యాప్స్‌పై 85వ వార్షికోత్సవ డీకాల్స్‌తో పాటు, గ్లాస్ బ్లాక్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది.
ఇది తెలుపు, మెటాలిక్ గ్రీన్, ఎరుపు, గ్రిజియో మాగ్నీషియో, నలుపు రంగులలో లభిస్తుంది. క్యాబిన్ మొత్తం నలుపు రంగు థీమ్‌తో ఉంటుంది. డాష్‌బోర్డ్ అంతటా మాయన్ గోల్డ్ ట్రిమ్, కాంట్రాస్ట్ డిటైలింగ్‌తో పాటు యాంబియంట్ లైటింగ్ కూడా ఉంటుంది. అయితే మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి ఇది 168 bhp పవర్, 350 Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో కొనసాగుతుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది.


