ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అయితే టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్, ఆర్బిటర్ ఈవీలలో ఏదైనా కొనాలనుకుంటే.. వీటి ధరలు, రేంజ్ వంటి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ధరలు
టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.73 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఆర్బిటర్ ధర రూ.91,550 నుంచి రూ.1.15 లక్షల మధ్య ఉంది. ధర మధ్య వ్యత్యాసం రూ.20 వేల నుంచి రూ.30వేలు మాత్రమే. కానీ కొంత తక్కువ ధరలో కావాలంటే ఆర్బిటార్ మంచి ఎంపిక.
పెర్ఫామెన్స్
టీవీఎస్ ఐక్యూబ్ కేవలం 4.2 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 75 నుంచి 82 కి.మీ/గం వరకు ఉంటుంది, అందువల్ల ఇది హైవే, సుదూర ప్రయాణాలకు మంచి ఎంపికగా నిలుస్తుంది.
టీవీఎస్ ఆర్బిటర్ రోజువారీ నగర వినియోగం కోసం ఉపయోగపడుతుంది. ఇది సుమారుగా 6.3 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ 68 కి.మీ/గం. నగర ట్రాఫిక్‌లో చాలా మందికి ఈ వేగం సరిపోతుంది.
రేంజ్
టీవీఎస్ ఐక్యూబ్ వివిధ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. కాబట్టి దీని రేంజ్ సుమారుగా 74 కి.మీ నుంచి 212 కి.మీ వరకు ఉంటుంది. ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద బ్యాటరీ వేరియంట్ సుమారుగా 158 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని సమాచారం. స్టోరేజ్ విషయంలో ఆర్బిటర్ 34 లీటర్ల స్పేస్ అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ 32 లీటర్లను అందిస్తుంది.
ఫీచర్స్
ప్రీమియం అనుభూతిని కోరుకునే వినియోగదారులకు టీవీఎస్ ఐక్యూబ్ మంచి ఎంపిక అవుతుంది. ఇది పెద్ద డిస్‌ప్లే, అత్యుత్తమ ఫినిషింగ్, శక్తివంతమైన మోటార్, వేగవంతమైన యాక్సిలరేషన్‌ను అందిస్తుంది. కుటుంబ వినియోగం, సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి ఎంపిక. అయితే ఆర్బిటర్ కొన్ని తక్కువ ఫీచర్స్ పొందుతుంది.
కొంత ఎక్కువ బడ్జెట్ వెచ్చించి.. మెరుగైన పనితీరు, ప్రీమియం ఫీచర్లు కావాలనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ సరైన ఎంపిక. కానీ తక్కువ ధరలో మంచి మైలేజ్, తగినంత రేంజ్, ప్రాక్టికాలిటీని కోరుకుంటే ఆర్బిటర్ ఎందుకోవడం ఉత్తమం.


