భారీ డిమాండ్.. 10 లక్షలకు చేరుకున్న ఐక్యూబ్! | TVS iQube Electric Scooter Crosses 10 Lakh Units Production Milestone | Sakshi
Sakshi News home page

భారీ డిమాండ్.. 10 లక్షలకు చేరుకున్న ఐక్యూబ్!

Jun 25 2026 6:21 PM | Updated on Jun 25 2026 6:24 PM

TVS iQube Electric Scooter Crosses 10 Lakh Units Production Milestone

భారతదేశంలో ఈవీ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ తయారీ సంఖ్య 10 లక్షల యూనిట్లను దాటింది.

2020లో మొదటిసారిగా విడుదలైన ఐక్యూబ్, తక్కువ కాలంలోనే భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా మారింది. కొన్ని సందర్భాల్లో.. బజాజ్ చేతక్ వంటి పోటీదారులు గట్టి పోటీ ఇస్తూనే మార్కెట్‌లో మొదటి స్థానానికి కూడా చేరుకుంది.

టీవీఎస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ఐక్యూబ్ వినియోగదారులు అందరూ 14.94 బిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. ఇది కేవలం అమ్మకాల గణాంకం మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణలో కూడా పెద్ద పాత్ర పోషిస్తోంది. ఈ ప్రయాణాల ద్వారా సుమారు 5,22,969 టన్నుల కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. అంటే పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించబడటం వల్ల పర్యావరణానికి గణనీయమైన మేలు జరుగుతోంది.

గత ఆరు సంవత్సరాల్లో ఈ స్కూటర్‌లో పెద్ద డిజైన్ మార్పులు జరగకపోయినా, ఇది నిరంతరంగా అప్‌డేట్ అవుతూ వచ్చింది. కొత్త రంగులు, ఫీచర్లు, బ్యాటరీ ఆప్షన్లు వంటి మెరుగుదలలు వినియోగదారులను ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ స్కూటర్‌ను భారతదేశంలోని 3,000కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంది.

టీవీఎస్ ఐక్యూబ్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి బేస్ వేరియంట్, ఎస్ వేరియంట్, ఎస్టీ వేరియంట్.. వీటి ధరలు రూ. 1.07 లక్షల నుంచి రూ.1.72 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇవి 2.2 కిలోవాట్ బ్యాటరీ, 5.3 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యాలతో లభిస్తాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement