165 Km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. | New E3 Trion Electric Scooter Launched 165 Km Range AI Features Price | Sakshi
Sakshi News home page

165 Km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

Aug 7 2026 11:20 AM | Updated on Aug 7 2026 11:31 AM

New E3 Trion Electric Scooter Launched 165 Km Range AI Features Price

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి మరో కొత్త సంస్థ అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఈ3 ఎలక్ట్రిక్‌.ఏఐ (E3 Electric.Ai) తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ3 ట్రయాన్‌ (E3 TRION)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కుటుంబ అవసరాలు, రోజువారీ నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్‌కు పరిచయ ధరను రూ.1 లక్ష (బెంగళూరు ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. తొలుత బెంగళూరులో బుకింగ్స్ ప్రారంభించి, అనంతరం ఇతర నగరాలకు విస్తరించనుంది.

మూడు వేరియంట్లు.. ధరలు

ఈ3 ట్రయాన్‌ను C1, C1X, C2 అనే మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. బేస్ C1 ధర రూ.1 లక్ష కాగా, C1X ధర రూ.1,09,999, టాప్ వేరియంట్ C2 ధర రూ.1,19,999గా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. కంపెనీ తొలుత బెంగళూరు మార్కెట్‌పై దృష్టి పెట్టి, దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో ఉంది.

165 కి.మీ వరకు రేంజ్

ఈ3 ట్రయాన్‌లో వేరియంట్‌ను బట్టి బ్యాటరీ, పనితీరు మారుతాయి.  C1లో 2.3kWh రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది IDC సర్టిఫైడ్ రేంజ్ 108 కి.మీ, గరిష్ఠ వేగం గంటకు 67 కి.మీగా ఉంటుంది.

C1Xలో 3kWh స్థిర బ్యాటరీని అందించారు. ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ వరకు IDC రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీంతో మొత్తం ట్రియాన్ లైనప్‌లో ఇదే రేంజ్‌ ఫోకస్డ్ మోడల్‌గా నిలుస్తుంది.

ఇక C2 కూడా 3kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 128 కి.మీ IDC రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 82 కి.మీ. స్పోర్ట్ మోడ్‌లో 0-40 కి.మీ వేగాన్ని సుమారు 6 సెకన్లలో అందుకోగలదని కంపెనీ పేర్కొంది. C1, C1Xలో ఎకో, పవర్ మోడ్లు ఉండగా.. C2లో అదనంగా స్పోర్ట్ మోడ్‌ను అందించారు.

స్కూటర్‌లో AI ప్రత్యేక ఆకర్షణ

ఈ3 ట్రయాన్‌లో సాధారణ కనెక్టెడ్ ఫీచర్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను ప్రధానంగా తీసుకొచ్చారు. ఏఐ ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ, ముందస్తు రిపోర్టులు,  రిమోట్ బ్యాటరీ మానిటరింగ్, లైవ్ వెహికల్ డేటా, కనెక్టెడ్ నావిగేషన్, ఛార్జర్ లొకేషన్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

స్కూటర్‌లో 5 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా నావిగేషన్ వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. డాష్‌క్యామ్ ఫంక్షనాలిటీ, SOS అసిస్టెన్స్, జియో-ఫెన్సింగ్, ఛార్జింగ్ ఇన్‌సైట్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాహనంలోని బ్యాటరీ, మోటార్, ఇతర వ్యవస్థల డేటాను విశ్లేషించి సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించడమే ఏఐ వ్యవస్థ లక్ష్యమని కంపెనీ చెబుతోంది.

14 అంగుళాల చక్రాలు.. 52 లీటర్ల స్టోరేజ్

డిజైన్ పరంగా ట్రియాన్‌ను కుటుంబ వినియోగానికి అనుగుణంగా రూపొందించారు. ఇందులో 14 అంగుళాల పెద్ద చక్రాలు ఉండటంతో నగర రోడ్లతో పాటు గ్రామీణ రహదారులపై కూడా మెరుగైన స్థిరత్వం లభిస్తుందని కంపెనీ చెబుతోంది. IP67 రేటింగ్, డ్యూయల్ ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్, వెనుక LED లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బూట్, ఫ్లోర్‌బోర్డ్, గ్లోవ్‌బాక్స్ ప్రాంతాలను కలిపి 52 లీటర్ల వరకు స్టోరేజ్ సామర్థ్యం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement