తీర్థయాత్రకు వెళ్లిన పంజాబ్‌కు చెందిన ఓ వృద్ధుడు దారి తప్పి తన ఇంటికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గయకు చేరుకున్నాడు. ఓ వ్యక్తి చాట్‌జీపీటీ సాయంతో చివరకు ఆయనను కుటుంబంతో కలిపారు. లుధియానా జిల్లాలోని ఫతేగఢ్ గుజ్రాన్ గ్రామానికి చెందిన చమన్ లాల్ సెప్టెంబర్ 11న పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకం ద్వారా హర్మందిర్ సాహిబ్‌ను దర్శించేందుకు అమృత్‌సర్ వెళ్లారు.
అయితే, ఆయనకు కొంతకాలంగా జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అమృత్‌సర్‌లో ఎక్కడో ఆయన తన బృందం నుంచి తప్పిపోయి.. చివరకు రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకున్నారు. అక్కడి నుంచి బిహార్ వెళ్లే రైలు ఎక్కి.. ఇంటికి 1,200 కిలోమీటర్లకు పైగా దూరంలోని గయకు చేరుకున్నారు.
అక్కడే గయకు చెందిన నీరజ్ ఆయనను మొదట గమనించాడు. చమన్ లాల్ ఆందోళనగా.. ఆకలితో కనిపించడంతో పాటు తాను ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. ఆయన చెప్పగలిగిన ఏకైక సమాచారం తన గ్రామం పేరు ఫతేగఢ్ గుజ్రాన్. నీరజ్ ఆయనను తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి.. ఆశ్రయం కల్పించారు. కుటుంబంతో కలిసి నాలుగు రోజుల పాటు ఆయనను చూసుకున్నాడు. అదే సమయంలో ఆ వృద్ధుడి కుటుంబాన్ని ఎలా గుర్తించాలా? అని ప్రయత్నించాడు.
చమన్ లాల్ కేవలం పంజాబీ మాత్రమే మాట్లాడటం నీరజ్‌కు తొలి ఆధారంగా మారింది. గ్రామం పేరును ఆధారంగా చేసుకుని అది పంజాబ్‌లో ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో శోధించడం ప్రారంభించాడు. ఇందుకోసం చాట్ జీపీటీతో పాటు సాధారణ ఇంటర్నెట్ సెర్చ్‌లను కూడా ఉపయోగించాడు. మూడు రోజుల పాటు సాగిన శోధన చివరకు ఫలించింది. లుధియానా జిల్లాలోని మచ్చివారా సాహిబ్ సమీపంలో ఫతేగఢ్ గుజ్రాన్ అనే గ్రామం ఉన్నట్లు ఆయన గుర్తించాడు. గ్రామం ఆచూకీ లభించిన తర్వాత.. చమన్ లాల్‌ను ఒంటరిగా పంపకుండా నీరజ్ స్వయంగా ఆయనతో కలిసి గయ నుంచి లుధియానా వరకు, అక్కడి నుంచి మచ్చివారా వరకు ప్రయాణించాడు.
మచ్చివారాలో నీరజ్ చమన్ లాల్ ఫొటోను స్థానికులకు చూపిస్తూ.. ఎవరైనా ఆయనను గుర్తుపడతారేమోనని ప్రయత్నించాడు. అప్పుడు ఆ ప్రాంతానికి చెందిన కృష్ణన్ లాల్ ఆ వృద్ధుడిని గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరింది. చమన్ లాల్ మనవడు సుఖ్‌చైన్ సింగ్ మచ్చివారాకు చేరుకుని.. ఆయన తన తాతేనని నిర్థారించాడు. అమృత్‌సర్‌లో చమన్ లాల్ కోసం కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించారని.. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని సుఖ్‌చైన్ సింగ్ తెలిపారు.
గ్రామస్తులు, బంధువులు ఆయన ఫొటోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసి.. ఎక్కడైనా ఆయన కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. తన తాతను సురక్షితంగా చూసుకోవడంతో పాటు, గయ నుంచి పంజాబ్ వరకు స్వయంగా తీసుకొచ్చి ఇంటికి చేర్చిన నీరజ్‌కు సుఖ్‌చైన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం చమన్ లాల్ కుటుంబ సభ్యులు నీరజ్‌ను తమ ఇంటికి ఆహ్వానించి, పూలమాలలు వేసి సత్కరించారు. ఆయనకు నగదు, దుస్తులు కూడా అందించారు. గయాలో నిర్మాణ రంగంలో పనిచేసే నీరజ్ మాట్లాడుతూ.. ఇబ్బందుల్లో ఉన్న వృద్ధుడిని చూసి తాను అలా వెళ్లిపోలేకపోయానని చెప్పారు. గ్రామం పేరు తెలిసిన తర్వాత ఆయన కుటుంబాన్ని కనిపెట్టడం తన వ్యక్తిగత బాధ్యతగా భావించానని తెలిపారు.
ఇదీ చదవండి: సినిమా రేంజ్‌లో.. బస్సు హైజాక్!


