బోనస్‌ వద్దు.. లక్షల కోట్ల లాభాల్లో వాటా కావాలి! | Micron Workers Demand 15% Share Of Global Profits As AI Boom Drives Record Earnings, Check More Details Inside | Sakshi
Sakshi News home page

బోనస్‌ వద్దు.. లక్షల కోట్ల లాభాల్లో వాటా కావాలి!

Sep 19 2026 9:39 AM | Updated on Sep 19 2026 10:18 AM

Micron Workers Reject 68-Month Bonus Demand 15 percent profit sharing

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) బూమ్‌తో మెమరీ చిప్‌ కంపెనీల లాభాలు భారీగా పెరుగుతున్న వేళ.. ఆ లాభాల్లో తమకూ వాటాలు కావాలని ఉద్యోగులు కోరుతున్నారు. అమెరికాకు చెందిన మెమరీ చిప్‌ దిగ్గజం మైక్రాన్‌ టెక్నాలజీ ఉద్యోగులు లాభాల్లో వాటా కోసం పట్టుబడుతున్నారు. తైవాన్‌లోని కార్మికులకు సంస్థ ప్రకటించిన రికార్డు స్థాయి బోనస్‌ ప్యాకేజీని యూనియన్‌ తిరస్కరించింది. ఒక్కసారి ఇచ్చే బోనస్‌ కంటే కంపెనీ లాభాల్లో శాశ్వతంగా వాటా కల్పించే పారదర్శక విధానం కావాలని డిమాండ్‌ చేస్తోంది.

మైక్రాన్‌ ఇటీవల తైవాన్‌లోని ఉద్యోగుల కోసం 2026 ఆర్థిక సంవత్సరానికి 35 నుంచి 68 నెలల వేతనానికి సమానమైన మొత్తం రివార్డులు ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హత ఉన్న ఉద్యోగులకు కనీస నగదు చెల్లింపు కింద 1.7 మిలియన్ న్యూ తైవాన్ డాలర్లు (సుమారు రూ.51.11 లక్షలు) చెల్లించాలని నిర్ణయించింది.

దీంతోపాటు 2025 ఆగస్టు 29లోపు కంపెనీలో చేరిన తైవాన్‌ ఉద్యోగులకు 1 మిలియన్‌ న్యూ తైవాన్ డాలర్ల (సుమారు రూ.30.20 లక్షలు) ప్రత్యేక నగదు బోనస్‌ కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో ఎంట్రీ లెవల్‌ ఇంజినీర్లకు నగదు, ఈక్విటీ కలిపి సగటున 3.4 మిలియన్ల (సుమారు రూ.1.02 కోట్లు) వరకు మొత్తం రివార్డు లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా 60,000 మందికి పైగా ఉద్యోగులు ఈ రివార్డు కార్యక్రమంలో భాగం కానున్నారు.

అయితే ఈ ఆఫర్‌ను తైవాన్‌ కార్మిక సంఘం అంగీకరించలేదు. ‘68 నెలల వేతనం’ అనే ప్రచారం వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదని యూనియన్‌ వాదిస్తోంది. తక్కువ వేతన స్థాయిని ప్రాతిపదికగా తీసుకోవడం, ఈక్విటీ అవార్డులు భవిష్యత్‌లో వెస్ట్‌ అయ్యే కాలాన్ని కలుపుకోవడం వల్ల ప్యాకేజీ వాస్తవం కంటే ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది.

15% లాభాలు కావాలి

మైక్రాన్‌ ఇన్సెంటివ్‌ పే విధానంలో శాశ్వత మార్పులు చేయాలని యూనియన్‌ కోరుతోంది. 2027 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఆర్జించే ఆపరేటింగ్‌ లాభంలో 15 శాతాన్ని ఉద్యోగుల కోసం కేటాయించాలని డిమాండ్‌ చేస్తోంది. అంతేకాకుండా, కంపెనీ లాభాల్లో మార్పులను వేగంగా ప్రతిబింబించేలా బోనస్‌లను ఏడాదికోసారి కాకుండా త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించాలని కోరుతోంది. 2026 ఆర్థిక సంవత్సరానికి మాత్రం తమ లెక్కల ప్రకారం సుమారు 83 నెలల వేతనానికి సమానమైన ఒకేసారి చెల్లింపు ఉండాలని యూనియన్‌ కోరుతోంది.

మైక్రాన్‌కు చెందిన తైవాన్‌లోని టావోయువాన్‌, తైచుంగ్‌ కేంద్రాల్లో సుమారు 15,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 80 శాతానికి పైగా ఉద్యోగులను యూనియన్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని రాయిటర్స్‌ పేర్కొంది. తైవాన్‌ సంస్థకు కీలక తయారీ కేంద్రం. ముఖ్యంగా DRAM, హై-బ్యాండ్‌విడ్త్‌ మెమరీ (HBM) చిప్‌ల ఉత్పత్తిలో ఈ కేంద్రాల ప్రాధాన్యం ఎక్కువ. AI డేటా సెంటర్లకు హెచ్‌బీఎం చిప్‌ల డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో కార్మిక వివాదం మైక్రాన్‌కు ప్రాధాన్య అంశంగా మారింది.

భారీ లాభాలు

AI ఆధారిత మెమరీ డిమాండ్‌ మైక్రాన్‌ ఆర్థిక ఫలితాలను రికార్డు స్థాయికి తీసుకెళ్లింది. 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ 41.46 బిలియన్‌ డాలర్ల ఆదాయం, 33.32 బిలియన్‌ డాలర్ల ఆపరేటింగ్‌ ఆదాయం, 28.24 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.35 లక్షల కోట్ల) నికర లాభం నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నికర లాభం కేవలం 1.89 బిలియన్‌ డాలర్లుగా ఉండటం గమనార్హం.

ఇదే సమయంలో మైక్రాన్‌ ఉద్యోగుల బోనస్‌ విధానాన్ని దక్షిణ కొరియా చిప్‌ సంస్థలైన శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎస్‌కే హైనిక్స్‌ పద్ధతులతో పోలుస్తున్నారు. అక్కడి ప్రాఫిట్‌-షేరింగ్‌ విధానాలను తమ డిమాండ్లకు యూనియన్లు ఉదాహరణగా చూపుతున్నాయి.

చర్చలు విఫలమైతే సమ్మె ఓటు

మైక్రాన్‌, యూనియన్‌ మధ్య మధ్యవర్తిత్వ చర్చలు సెప్టెంబర్‌ 18, 21 తేదీల్లో కొనసాగనున్నాయి. లాభాల భాగస్వామ్యంపై కంపెనీ నుంచి స్పష్టమైన ప్రతిపాదన రాకపోతే చర్చలు విఫలమైనట్లు ప్రకటించి సమ్మెపై ఉద్యోగుల ఓటింగ్‌ నిర్వహించే దిశగా వెళ్తామని యూనియన్‌ హెచ్చరించింది. అయితే మైక్రాన్‌ కూడా చర్చలను కొనసాగిస్తామని తెలిపింది.

తైవాన్‌ మైక్రాన్‌కు కీలక ఉత్పత్తి కేంద్రం కావడంతో సమ్మె జరిగితే మెమరీ చిప్‌ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం AI మౌలిక సదుపాయాల విస్తరణతో మెమరీ చిప్‌లకు డిమాండ్‌ ఇప్పటికే బలంగా ఉన్న నేపథ్యంలో ఈ కార్మిక వివాదం పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement