చిన్న నగరాల్లో ఇళ్ల ధరలకు రెక్కలు.. మెట్రో సిటీలను మించి.. | Home Prices Rise Sharply In 11 Emerging Cities As Tier 2 Markets Outpace Major Metros, Check More Details | Sakshi
Sakshi News home page

చిన్న నగరాల్లో ఇళ్ల ధరలకు రెక్కలు.. మెట్రో సిటీలను మించి..

Sep 19 2026 8:19 AM | Updated on Sep 19 2026 9:28 AM

Housing Prices Surged 11 Small Cities Beating Top Eight Markets

దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఇక మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతూ, అక్కడి నివాస ధరలు కూడా వేగంగా దూసుకెళ్తున్నాయి. 2021 నుంచి 2026 మధ్య 11 అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గృహాల ధరలు సగటున 63 శాతం పెరిగినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ (CII), ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సంయుక్త నివేదిక ‘ఇండియాస్‌ నెక్స్ట్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్స్‌ 2026’ వెల్లడించింది. ఇదే సమయంలో దేశంలోని ఎనిమిది ప్రధాన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లలో ధరల పెరుగుదల 42 శాతంగా నమోదైంది.

నివేదిక ప్రకారం, తదుపరి దశలో రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి కీలకంగా మారే అవకాశం ఉన్న 11 మార్కెట్లలో భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్‌ ట్రైసిటీ, గోవా, ఇండోర్, జైపూర్, కొచ్చి, లక్నో, నాగ్‌పూర్, విశాఖపట్నం, కోయంబత్తూర్‌ ఉన్నాయి. 2016–2026 మధ్య ఈ మార్కెట్లలో నివాస ధరలు సగటున ఏటా  8 శాతం చొప్పున (CAGR) పెరిగాయి. దీనికి విరుద్ధంగా ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, చెన్నై, పుణె, అహ్మదాబాద్‌, కోల్‌కతా వంటి టాప్‌-8 నగరాల్లో ఇదే కాలంలో సగటు వృద్ధి 4 శాతంగా ఉంది.

ఇళ్ల ధరలు ఎలా ఉన్నాయంటే.. 

ఈ 11 మార్కెట్లలో ఇళ్ల ధరలు చదరపు అడుగు ధర రూ.4,500 నుంచి రూ.13,500 వరకు పలుకుతున్నాయి. నాగ్‌పూర్‌, విశాఖపట్నంలో సుమారు చదరపు అడుగుకు రూ.4,500–6,500 ధరల పరిధి ఉండగా, భోపాల్‌లో రూ.5,000–7,000, ఇండోర్‌లో రూ.5,500–7,500, కోయంబత్తూర్‌లో రూ.6,000–8,000 వరకు ఉన్నాయి. భువనేశ్వర్‌, లక్నోలో సుమారు రూ.6,500–8,500, జైపూర్‌, కొచ్చిలో రూ.7,000–9,000, చండీగఢ్‌ ట్రైసిటీలో రూ.7,500–10,500 వరకు ధరలు నమోదవుతున్నాయి. అత్యధికంగా గోవాలో చదరపు అడుగుకు రూ.11,500–13,500 వరకు ధర పలుకుతోంది.

మౌలిక వసతులతోపాటు ఉద్యోగాలూ కీలకమే

ఈ నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి కేవలం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి మాత్రమే కారణం కాదని నివేదిక పేర్కొంది. రహదారులు, రవాణా, కనెక్టివిటీ మెరుగుపడటంతోపాటు ఉద్యోగాలు, వ్యాపార కార్యకలాపాలు, జనాభా పెరుగుదల, వినియోగం, పట్టణ సదుపాయాలు కూడా కలిసి పనిచేస్తున్నాయని తెలిపింది. కనెక్టివిటీ ఏర్పడటం మాత్రమే కాకుండా అది దీర్ఘకాలిక ఆర్థిక కార్యకలాపాలుగా మారే నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లు మరింత లోతుగా, వైవిధ్యభరితంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ మూలధన వ్యయంలో మౌలిక వసతుల వాటా FY2015లో 39 శాతం ఉండగా, FY2026 నాటికి 55 శాతానికి చేరిందని నివేదిక పేర్కొంది. అలాగే రూ.17 లక్షల కోట్ల విలువైన 852 ప్రాజెక్టులతో కూడిన మూడేళ్ల పీపీపీ పైప్‌లైన్‌ కూడా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు దీర్ఘకాలంలో మద్దతు ఇవ్వవచ్చని అంచనా వేసింది.

ఇళ్లతోపాటు రిటైల్‌, వేర్‌హౌసింగ్‌ కూడా..

చిన్న నగరాల్లో మారుతున్న రియల్‌ ఎస్టేట్‌ దృశ్యానికి నివాస రంగంతోపాటు వాణిజ్య కార్యకలాపాలు కూడా ఊతమిస్తున్నాయి. 2025లో టైర్‌-2 మార్కెట్లలో వేర్‌హౌసింగ్‌ లీజింగ్‌ లావాదేవీలు 11.2 మిలియన్‌ చదరపు అడుగులకు చేరాయి. ఇందులో లక్నో, జైపూర్‌, నాగ్‌పూర్‌, ఇండోర్‌, కోయంబత్తూర్‌, భువనేశ్వర్‌ కలిసి 5.3 మిలియన్‌ చదరపు అడుగుల లావాదేవీలను నమోదు చేశాయి. మరోవైపు, 2025 నాటికి దేశంలోని 24 టైర్‌-2 నగరాల్లో 36 మిలియన్‌ చదరపు అడుగుల ఆర్గనైజ్డ్‌ రిటైల్‌ స్టాక్‌ ఉంది.

2047 నాటికి భారీ మార్కెట్‌గా..

దీర్ఘకాలంలో ఈ మార్పు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. 2047 నాటికి భారత రియల్‌ ఎస్టేట్‌ రంగం అవుట్‌పుట్‌ 5.8 ట్రిలియన్‌ డాలర్లకు చేరవచ్చని, ఇందులో టైర్‌-2, టైర్‌-3 నగరాల వాటా 25–30 శాతం ఉండొచ్చని పేర్కొంది. నగరీకరణ పెరగడం, కొత్త మిలియన్‌-ప్లస్‌ నగరాలు ఏర్పడటం, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, సేవారంగ కార్యకలాపాలు చిన్న నగరాల్లో విస్తరించడం ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా నివేదిక గుర్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement