హోటలే ఇల్లు.. సిటీలో నయా ట్రెండ్‌! | Hyderabad Hotel-Home Trend: Serviced Apartments Boom | Sakshi
Sakshi News home page

హోటలే ఇల్లు.. సిటీలో నయా ట్రెండ్‌!

Sep 10 2026 1:18 PM | Updated on Sep 10 2026 1:48 PM

Hyderabad Hotel-Home Trend: Serviced Apartments Boom

గదులకు బదులు అద్దెకు అపార్ట్‌మెంట్లు

విభిన్న రంగాల్లో ఊపందుకున్న డిమాండ్‌

విజృంభిస్తున్న సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ సంస్కృతి

నగరంలో ఒకటి రెండు రోజులు ఉండాలంటే హోటల్‌ గదులు, నెలల తరబడి ఉండాలంటే ఇల్లు అద్దెకు తీసుకునే ధోరణికి భిన్నంగా.. రోజులు, నెలల తరబడి ఉండడానికి కూడా స్టార్‌ హోటల్‌కే ఓటేసే ధోరణి పెరిగింది. విభిన్న రంగాల వారు పనుల నిమిత్తం నగరంలో తాత్కాలిక బస కావాలని ఆశించడం అంతకంతకూ పెరుగుతుండడంతో స్టార్‌ హోటళ్లలో అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ కూడా ఊపందుకుంది.   – సాక్షి, సిటీబ్యూరో

హోటల్‌ గదులను విస్తరించడం కొత్త విషయం కాకపోవచ్చు కానీ గచ్చిబౌలిలోని షెరటాన్‌ హోటల్‌ తాజాగా మరో 42 అపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తీసుకురావడం ఇప్పుడు చెప్పుకోదగ్గ విశేషం. దీంతో కలిపి ఆ హోటల్‌లో మొత్తం 98 అపార్ట్‌మెంట్లకు చేరడం గమనార్హం. మొత్తం 228 సాధారణ గదులు ఉంటే దాదాపు అందులో సగం అపార్ట్‌మెంట్లు ఉండడం గమనార్హం. ప్రస్తుతం నగరంలో ఊపుమీదున్న హోటల్‌–అపార్ట్‌మెంట్‌ ట్రెండ్‌కి ఇదో చిన్న ఉదాహరణ.  

పన్నెండేళ్ల క్రితమే..   
దాదాపు 12 ఏళ్ల క్రితం బంజారాహిల్స్‌లోని స్టార్‌ హోటల్‌ పార్క్‌ హయత్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్లకు శ్రీకారం చుట్టింది. దాదాపు ఇంటిని తలపించే సింగిల్, డబుల్‌ బెడ్‌ గదులతో ఉండే ఈ అపార్ట్‌మెంట్లు అప్పట్లో కేవలం కార్పొరేట్‌ ఉద్యోగుల అవసరాలను మాత్రమే తీరుస్తూ ఉండేవి. రానురానూ విభిన్న రంగాల నుంచీ ఈ తరహా హోటల్‌ అవసరాలకు డిమాండ్‌ పెరిగింది. ఐటీతో పాటు డేటా సెంటర్లు, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఫార్మా, సినిమా, టీవీ తదితర రంగాల నుంచి  వీటికి ఆదరణ పెరిగింది. దీంతో ఐదారేళ్లుగా నగరంలో నెలకొల్పే ప్రతీ స్టార్‌ హోటల్‌లోనూ ఈ తరహా అపార్ట్‌మెంట్లు తప్పనిసరిగా మారాయి.  

ఏమిటీ సర్వీస్డ్‌ అపార్ట్‌మెంట్లు?  
ఇవి పేరుకు తగ్గట్టుగా ఉండే సాదా సీదా అపార్ట్‌మెంట్లు కాదు. వాషింగ్‌ మెషీన్, డిష్‌వాషర్, తాగునీరు, కిచెన్‌ తదితర రోజువారీ జీవనానికి అవసరమైన సౌకర్యాలతో పాటు అవసరాన్ని బట్టి చెఫ్స్, హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది కూడా అందుబాటులో  ఉండటమే వీటి ప్రత్యేకత. హోటల్‌ సరీ్వస్‌తో పాటు ఇంటి సౌకర్యాలు కూడా కలగలిపి ఉంటాయన్నమాట.  ఇటీవల ఓ స్టార్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన కొత్త అపార్ట్‌మెంట్లలో 35 చదరపు మీటర్ల స్టూడియో, 61 చదరపు మీటర్ల వన్‌ బెడ్‌రూమ్, 88 చదరపు మీటర్ల టు బెడ్‌రూమ్‌ ఉన్నాయి. అంతేకాకుండా గార్డెన్‌ వ్యూ, సిటీ వ్యూ, ఆర్‌ఆర్‌ఆర్‌ వ్యూస్‌ కూడా అందుబాటులోకి తెచ్చారు.   

ప్రధాన పోషకులు వీరే.. 
నగరంలో ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు, కొత్తగా కంపెనీలో చేరే ఉద్యోగులు, విదేశీ కంపెనీల ప్రాజెక్టులపై నెలల తరబడి పనిచేసే నిపుణులు, జీసీసీ  ఉద్యోగులు, సినిమా అనుబంధ రంగాలకు పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు,  కొత్తగా హైదరాబాద్‌కు బదిలీపై శాశ్వత ఇల్లు చూసుకునే వరకు ఉన్నతోద్యోగులు.. వీటికి ప్రధాన పోషకులుగా మారారు.

ఖరీదైనా.. కావాల్సిందే..  
ఆయా హోటళ్లలో వన్‌ బెడ్రూం అపార్ట్‌మెంట్‌ 90 చదరపు మీటర్లు, టు బెడ్రూం టెర్రస్‌ అపార్ట్‌మెంట్‌ 145 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫాంలో తేదీ, గది రకాన్ని బట్టి స్టూడియోలకు రోజుకు సుమారు 10,000 నుంచి రూ.16,000, వన్‌ బెడ్రూం అపార్ట్‌మెంట్లకు రూ 12,000 నుంచి రూ.20,000 ధరల్లో ఉన్నాయి. పన్నులు, భోజనం, ప్రత్యేక ఆఫర్లు, సీజన్, ఎన్ని రోజులు/నెలలు బస చేస్తారు? అనే వాటి  ఆధారంగా ప్యాకేజీల ధరలు మారుతాయి. ఏదేమైనా  నగరంలో  ‘హోటల్‌.. హోమ్‌’ అనే కొత్త సంస్కృతి పుట్టుకొస్తోందని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement