సాక్షి, సిటీబ్యూరో: కోకాపేట్ మరోసారి కేక పుట్టించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) బుధవారం కోకాపేట్ నియోపోలిస్, గోల్డెన్ మైల్ సైట్–1లోని స్థలాలకు ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్‌లో గోల్డెన్ మైల్ సైట్–1లోని 0.70 ఎకరాల స్థలానికి భారీ స్పందన లభించింది. ఎకరాకు రూ.70 కోట్లుగా కనీస ధరను నిర్ణయించగా, బిడ్డింగ్‌లో ఎకరాకు రూ.115 కోట్ల లెక్కన రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ స్థలం ట్రయాంగిల్‌లా ఉన్నప్పటికీ అంచనాలకు మించిన స్పందన లభించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నగరానికి పడమటి వైపున ఉన్న డిమాండ్‌ను ఇది మరోసారి చాటిచెప్పింది. గతంలో హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలంలో ఎకరానికి కనీస ధర రూ.100 కోట్లు గా ప్రతిపాదించిగా అనూహ్యంగా రూ.151.25 కోట్లకు అమ్ముడైంది. ఈ సారి రూ.70 కోట్ల కనీస ధరపైన బిడ్డింగ్‌లో రూ.115 కోట్లకు అమ్ముడు కావడం గమనార్హం.
నియోపోలిస్ మరోసారి...
నియోపోలిస్ లేఅవుట్‌లోని ప్లాట్ నంబర్ 17లో ఉన్న 4.59 ఎకరాలకు కూడా బుధవారం బిడ్డింగ్ నిర్వహించారు. దీనికి ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. ఈ బిడ్ ధర ఎకరాకు రూ.120 కోట్లుగా నమోదైంది. ఒకే బిడ్ రావడం వల్ల మరోసారి వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.


