బొల్లారం ఆయుధాల కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ముగ్గురు ఆర్మీ అధికారుల అరెస్ట్‌! | Bollaram Army Arms Theft Case, 3 Senior Army Officers Arrested And Probe Intensifies | Sakshi
Sakshi News home page

బొల్లారం ఆయుధాల కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ముగ్గురు ఆర్మీ అధికారుల అరెస్ట్‌!

Sep 10 2026 9:23 AM | Updated on Sep 10 2026 11:10 AM

Bollaram Army Arms Theft Case Three Senior Officers Arrest

సాక్షి, సికింద్రాబాద్‌: బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు సీనియర్‌ ఆర్మీ అధికారులను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. తదుపరి విచారణ కోసం వారిని ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయుధాల మాయం వెనుక అసలు కుట్ర ఏంటి? ఎవరి కోసం ఈ చోరీకి పాల్పడ్డారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా, నలుగురు అగ్నివీర్‌ గార్డులు అందించిన కీలక సమాచారంతోనే దాదాపు పది రోజుల తర్వాత ఆయుధాల చోరీ వ్యవహారం గుట్టు రట్టయినట్లు సమాచారం. శిక్షణ కోసం ఉపయోగించే ఆయుధాలకు సాధారణంగా కోడింగ్‌ నంబర్లు ఉండవని గుర్తించిన నిందితులు.. పక్కా ప్రణాళికతో సుమారు మూడు నెలల పాటు విడతల వారీగా ఆయుధాలను మాయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. వర్షం పడిన ఓ రాత్రి ఆయుధాగారం తాళాలు పగలగొట్టి.. బయటి వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతకుముందు ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సీసీ కెమెరాలను నిలిపివేయడం, విధుల్లో ఉన్న గార్డులను ఇతర పనులకు పంపించడం వంటి చర్యల ద్వారా ఆయుధాలను బయటకు తరలించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ వ్యవహారంలో 12 అత్యాధునిక ఆయుధాలతో పాటు సుమారు 2 వేల రౌండ్ల బుల్లెట్లు మాయమైనట్లు సమాచారం. ఈ మందుగుండు సామగ్రి మొత్తం సుమారు క్వింటా బరువు ఉంటుందని తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో ఆయుధాలు, బుల్లెట్లు ఎలా బయటకు వెళ్లాయి? వాటిని ఎక్కడికి తరలించారు? అన్నదానిపై అధికారులు దృష్టి సారించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌, మిలిటరీ పోలీస్‌ అధికారులు రంగంలోకి దిగారు. అరెస్టయిన అధికారుల కాల్‌ డేటా, బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 

ఆయుధాలు ఎవరికి చేరాయి? ఈ వ్యవహారంలో ఉగ్రవాద లేదా ఇతర నేర శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మూడు నెలలుగా సాగినట్లు అనుమానిస్తున్న ఈ ఆయుధాల మాయం వెనుక పూర్తి నెట్‌వర్క్‌ను బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు సీనియర్‌ అధికారుల అరెస్ట్‌తో కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
ఇదీ చదవండి: తెలంగాణలో స్మార్ట్‌కార్డు.. తప్పుల తడక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement