స్మార్ట్‌ కార్డు.. తప్పులతడక | Chaos surrounding the distribution of smart ration cards | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ కార్డు.. తప్పులతడక

Sep 10 2026 4:26 AM | Updated on Sep 10 2026 4:26 AM

Chaos surrounding the distribution of smart ration cards

ఊరు మారింది.. పిన్‌కోడ్‌ మారింది.. ఇంటిపేరూ మారింది

క్యూఆర్‌ కోడ్‌.. హోలోగ్రామ్‌ ఉన్నా గజిబిజి డేటా 

కరీంనగర్‌లో 20 వేల కార్డులు వెనక్కి ఇచ్చే పరిస్థితి.. పెద్దపల్లిలో ఏకంగా 15 వేల కార్డుల్లో ఒకే ఊరి పేరు  

రాష్ట్రవ్యాప్తంగా కోటికిపైగా కార్డుల పంపిణీలో తలెత్తిన గందరగోళం  

కరీంనగర్‌ 44వ డివిజన్‌ పరిధిలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన భూంపల్లి విజయ, జొన్నల సంధ్య, గన్ను రాజమణిలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు జారీ అయ్యాయి. వీరి చౌకధరల దుకాణ నంబరు 2084150 కాగా, కార్డులపై మాత్రం 58వ డివిజన్‌లో చిరునామాగా, రేషన్‌షాప్‌ నంబరు 2084168గా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. 2084168 నంబరు గల రేషన్‌షాప్‌ 58వ డివిజన్‌లో కాకుండా, 13వ డివిజన్‌లో ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. 44వ డివిజన్‌లో దాదాపు 150 మందికి జారీ అయిన స్మార్ట్‌ కార్డులు ఇలానే ఉన్నాయి. ఒక్క కరీంనగర్‌లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు పంపిణీ చేసిన పట్టణాలు, గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.


పోలంపల్లి ఆంజనేయులు 
క్యూఆర్‌ కోడ్‌.. హోలోగ్రామ్‌.. అత్యాధునిక భద్రతా ఫీచర్లు అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్‌ రేషన్‌కార్డులు లబ్ధిదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. కార్డుపై ఉన్న పేరు తప్ప మరే వివరమూ సరిపోలడం లేదు. అసలు ఆ కార్డు ఎవరిదో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఒక జిల్లాలో ఊరి పేరు మారితే.. మరో జిల్లాలో గ్రామ పంచాయతీ పేరు తారుమారైంది. ఇంకొకచోట హ్యాబిటేషన్‌ పేరు స్థానంలో మరో గ్రామం పేరు వచ్చి చేరింది. ఇంటిపేరు తారుమారైంది. మరోచోట పిన్‌కోడ్‌ మారింది.. మరికొన్ని చోట్ల రేషన్‌ దుకాణం నంబరే తప్పుగా ముద్రితమైంది. ఇంటి నంబర్, ఫోన్‌నంబర్‌ లేకపోవడంతో లబ్ధిదారుల ఇళ్లను వెతికి కార్డులు అందించడమే అధికారులకు సవాలుగా మారింది. ఈ స్మార్ట్‌ కార్డులను ముంబై కేంద్రంగా ఉన్న ఏజెన్సీల ద్వారా బల్క్‌ ప్రింటింగ్‌ చేయించగా, సాఫ్ట్‌వేర్‌ ఫార్మాటింగ్‌లో లోపాలు తలెత్తినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కోటి కార్డుల డేటా ధ్రువీకరణపై అనుమానాలు 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్లకుపైగా ఆహార భద్రతా కార్డుల స్థానంలో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టారు. వీటి ద్వారా సుమారు 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇంత భారీస్థాయిలో కార్డుల ముద్రణ చేపట్టే ముందు కుటుంబ వివరాలు, గ్రామ పంచాయతీ, మండలం, వార్డు, పిన్‌కోడ్, రేషన్‌ దుకాణం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించారా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.  

15 వేల కార్డులకు ఒకే ఊరు! 
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో వెలుగుచూసిన ఘటన స్మార్ట్‌ కార్డుల డేటా లోపాల తీవ్రతను చాటుతోంది. మండలంలోని 22 గ్రామాలకు చెందిన కార్డులపై ‘ఓదెల’అనే గ్రామం పేరే ముద్రితమైంది. హరిపురం గ్రామానికి చెందిన 423 కార్డుల పంపిణీ సందర్భంగా ఈ విషయం బయటపడింది. పోస్టల్‌ పిన్‌కోడ్‌లోనూ తప్పులు గుర్తించారు. మండలంలో పంపిణీ చేయాల్సిన సుమారు 15 వేల కార్డుల్లో ఇదే సమస్య ఉన్నట్టు తేలడంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు.  
– హరిపురం, రూపునారాయణపేట, శానగొండ, జీలకుంట గ్రామాలకు వచ్చిన కార్డుల్లో గ్రామం పేరు, పిన్‌కోడ్‌ తదితర వివరాలు తప్పుగా ముద్రించారు. సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి గ్రామంలో ప్రస్తుతం స్మార్డ్‌ కార్డులు పంపిణీ చేస్తుండగా, కార్డులపై పిన్‌కోడ్‌ 505186కు బదులు 505185గా ఉంది.  

కరీంనగర్‌లో 24వేల కార్డులు వెనక్కి–  
కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో మంకమ్మతోటకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్‌కు మంజూరైన కార్డులో కరీంనగర్‌ బదులు మహబూబ్‌గర్‌ జిల్లా, అక్కడి 1425022 రేషన్‌ షాపు కేటాయించారు.  
– పలు డివిజన్లలో లబ్ధిదారుల డివిజన్‌ స్థానంలో మరో డివిజన్‌ పేరు, కేటాయించిన రేషన్‌ దుకాణానికి బదులు మరో దుకాణం నంబర్‌ ముద్రితమైంది. చాలా చోట్ల అడ్రస్‌లు దొరక్క, ఆ లబ్దిదారు ఎవరో తెలియక కార్డులు డివిజన్ల వారీగా పేరుకుపోతున్నాయి. గతంలో అద్దె ఇంట్లో ఉండి ఇప్పుడు మారిన వారికి సంబంధించిన కార్డులన్నీ పక్కన పడేస్తున్నారు. కార్డులో ఫోన్‌నంబరు లేకపోవడంతో వారిని గుర్తించడం ఇబ్బందిగా ఉంది. దీంతో పంపిణీ కాకుండా 24వేల కార్డులు మిగిలిపోయాయి. ఇందులో దాదాపు 20 వేల కార్డులను రెవెన్యూ అధికారులకు తిరిగి అప్పగించాలని నిర్ణయించారు.  

కామారెడ్డి జిల్లాలో 3వేల కార్డుల్లో తప్పుల గుర్తింపు 
కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని రామేశ్వర్‌పల్లి గ్రామానికి బదులు రామ్‌రెడ్డి పల్లి గ్రామంగా 400 కార్డులు ప్రింట్‌ అయ్యాయి. ఇస్రోజివాడి గ్రామంలో 501 కుటుంబాలకుగాను 499 కార్డులు మంజూరు కాగా, ఉగ్రవాయి గ్రామంగా ప్రింట్‌ అయింది. చిన్న మల్లారెడ్డి గ్రామం పేరుకు బదులు చిన్న చేగురుగా 400 కార్డుల్లో ముద్రించారు. రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామానికి బదులు మద్దికుంటగా 605 కార్డుల్లో ముద్రణ జరిగింది. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో సుమారు 3,000 స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో గ్రామాల పేర్లు తారుమారైనట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.  

ఆయా జిల్లాలో ఇలా... 
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగులో 680 స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఉండగా.. ఏకంగా 358 కార్డుల్లో లబ్ధిదారులు నివసించే సిద్ధిక్‌నగర్‌కు బదులు గుబ్బగుర్తి పేరు ముద్రించారు. సిద్దిక్‌నగర్‌కు సంబంధించిన పిన్‌కోడ్‌ 507165కు బదులు 507305గా నమోదైంది.  
– బోనకల్‌ మండలంలోని లక్ష్మీపురం, తూటికుంట్ల ప్రాంతాల్లో కొందరు లబ్ధిదారుల ఇంటిపేర్లు సైతం తప్పుగా ముద్రితమయ్యాయి. మూడు మండలాల్లో ఇలాంటి తప్పులు గుర్తించామని, మరిన్ని వివరాలు సేకరించి సరిచేసిన కార్డులు తిరిగి ఇస్తామని ఖమ్మం జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్‌కుమార్‌ తెలిపారు. 
– కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలంలో అధికారిక కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 10 మంది లబ్ధిదారులకు కార్డులు ఇవ్వగా.. ఐదుగురి కార్డుల్లో గ్రామం పేరు తప్పుగా ముద్రితమైంది. నమూనాగా ఎంపిక చేసిన కార్డుల్లోనే సగం తప్పులు రావడం గమనార్హం.  
– మెదక్‌ జిల్లా కుల్చారం మండలం వరిగుంతంలో 13వ రేషన్‌ దుకాణం పరిధిలోని 480 కార్డుల్లో ‘వరిగుంతం’కు బదులు ‘కుల్చారం’పేరు ముద్రించారు. దీంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు. తూప్రాన్‌ మున్సిపాలిటీలోని 4వ వార్డు కార్డుల్లో మున్సిపాలిటీ పేరుకు బదులు ‘వట్టూర్‌’గ్రామం పేరు రావడంతో అక్కడా పంపిణీ ఆపేశారు. 

కార్డులు వెనక్కి పంపించాం 
హరిపురం గ్రామ కార్డుల్లో కొన్ని తప్పులు ఉండడంతో, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం కార్డులను వాపస్‌ ఇచ్చాం. ఊర్లో 253 కార్డులు ఉన్నాయి. అంటిల్లోనూ ఉన్న తప్పులను సరిచేసి, సరైన వివరాలతో తిరిగి కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాం.  
– విజయ నాగరాజుయాదవ్, సర్పంచ్, హరిపురం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement