చలో హైదరాబాద్‌ వాయిదా | Chalo Hyderabad postponed | Sakshi
Sakshi News home page

చలో హైదరాబాద్‌ వాయిదా

Sep 10 2026 2:27 AM | Updated on Sep 10 2026 2:27 AM

Chalo Hyderabad postponed

సీఎస్‌ సంజయ్‌జాజుతో ఉద్యోగ సంఘాల నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, లచ్చిరెడ్డి తదితరులు

సీఎస్‌ సంజయ్‌జాజు నుంచి లిఖిత పూర్వక హామీతో టీజీఈజేఏసీ నిర్ణయం

ఈ నెల 19న విస్తృతస్థాయి సమావేశం అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ 

18న స్పష్టత ఇస్తామన్న సీఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ)తలపెట్టిన చలో హైదరాబాద్‌ వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లిఖితపూర్వక హామీతో ఈనెల 10వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్, అనంతరం మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీజీఈజేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో టీజీఈజేఏసీ అత్యవసర సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. టీజీఈజేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన చలో హైదరాబాద్‌కు సర్వం సిద్ధం చేశామని, మహాధర్నా స్టేజీ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి అడ్వాన్స్‌లు కూడా చెల్లించామన్నారు. కానీ సీఎస్‌ లిఖిత పూర్వక హామీని విశ్వసించి జేఏసీ తలపెట్టిన కార్యక్రమాన్ని ఈనెల 18వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అడిగిన 18వ తేదీ గడువు అనంతరం ఈనెల 19న జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గత నెల 27 నుంచి తలపెట్టిన నిరసన కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. 

సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా సూచనలు చేశారన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సీఎస్‌ సంజయ్‌జాజు సచివాలయంలో జేఏసీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారన్నారు. అనంతరంనాలుగు అంశాలపై వివరణ ఇచ్చినట్లు తెలిపారు. పీఆర్సీ నివేదిక ఇవ్వమని రెండవ పీఆర్సీ కమిషన్‌ చైర్మన్‌కు సీఎస్‌ లేఖ రాశారని, అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌కు సంబంధించి వివిధ అంశాలపై అధ్యయనానికి పే రివిజన్‌ కమిషన్‌ నిపుణులు, అధికారులు, వివిధ సంఘాల సభ్యులతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఉద్యోగుల ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మూడు డీఏలు ఇవ్వాలని సీఎస్‌ను కోరామని, ఈహెచ్‌ఎస్‌ అమలుకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్లు పెట్టామన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈనెల 18వ తేదీ వరకు గడువు ఇవ్వాలని సీఎస్‌ కోరారన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హమీని పూర్తిగా విశ్వసించి ఛలో హైదరాబాద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.  

సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఉద్యోగులకు 64 రకాల సమస్యలున్నప్పటికీ... ప్రధానంగా నాలుగింటిపైనే ఒత్తిడి చేస్తున్నామని, ఆర్థిక భారం లేని అంశాలను త్వరలో జరిగే జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. గతనెల 27వ తేదీన క్షేత్రస్థాయిలో ధర్నాలు, ఈనెల 1న నిరసనలతో ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈనెల 10వ తేదీన మహా ధర్నా కోసం నాలుగు చోట్ల దరఖాస్తు చేశామని, ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని, సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహణకు కోర్టు కూడా అనుమతించిందన్నారు. ఈ సమావేశంలో టీఎన్జీఓ, టీజీఓ ప్రధాన కార్యదర్శులు ముజీబ్‌ హుస్సేని, బి.శ్యామ్, జేఏసీ ప్రతినిధులు జి.సదానంద్‌గౌడ్, చావ రవి తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులతో ఈనెల6న నాంపల్లిలో చేపట్టిన సంకల్పసభతో ప్రభుత్వం దిగొచ్చిందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంప్లాయిస్‌ జేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల సమస్యలపై జేఏసీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సీఎస్‌ మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు, బకాయిల పరిష్కారానికి ప్రతినెలా కనీసం రూ.2వేల కోట్లు విడుదల చేయాలని సంఘాల నేతలు కోరగా..ఈ అంశలపై ఈ నెల18న స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జీఏడీ ముఖ్య కార్యదర్శి మహేశ్‌ దత్‌ ఎక్కా, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement