కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశ మినిట్స్‌లో బోర్డు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ప్రత్యేకంగా విద్యుదుత్పత్తి అవసరాల కోసమే నీటిని విడుదల చేయరాదని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) స్పష్టంచేసింది. ఈ నెల 4న జలసౌధలో జరిగిన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలతో రూపొందించిన మినిట్స్ ప్రతిని తాజాగా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించింది. కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు హాజరై తమ రాష్ట్రాల నీటి అవసరాలను తెలియజేశారు.
సెప్టెంబర్ 2026 నుంచి ఆగస్టు 2027 మధ్యకాలంలో ఉండనున్న తాగునీటి అవసరాలకు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి జలాశయాల నుంచి జరపాల్సిన నీటి కేటాయింపులపై ఈ సమావేశంలో వివిధ రకాలుగా చర్చలు జరిపినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఈఎన్‌సీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని మినట్స్‌లో కృష్ణా బోర్డు పేర్కొంది. ఈ నేపథ్యంలో నీటి పంపిణీపై తుది నిర్ణయాన్ని త్వరలో జరగనున్న 21వ కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపింది.
ఉన్నది 147 టీఎంసీలు.. కావాలన్నది 297 టీఎంసీలు
ఏపీ ఈఎన్‌సీ (ఇరిగేషన్) మాట్లాడుతూ సెప్టెంబర్ 2026 నుంచి ఆగస్టు 2027 వరకు తమ రాష్ట్రానికి 104 టీఎంసీల నీళ్లు అవసరమని తెలియజేశారు. సెప్టెంబర్ 3 నాటికి ఉన్న నీటి నిల్వలను ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో పంపిణీ చేస్తే ఏపీకి 97.41 టీఎంసీల వాటా వస్తుందని, దానిని విడుదల చేయాలని కోరారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఈఎన్‌సీ (జనరల్) మాత్రం ఏపీ, తెలంగాణ మధ్య 50:50 నిష్పత్తిలోనే నీటి పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. తాగునీటి అవసరాలకు 46 టీఎంసీలతో కలిపి మొత్తం 200 టీఎంసీల నీరు తమ రాష్ట్రానికిఅవసరమని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఏపీ తక్షణమే నీటి తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జలాశయాల్లో కనీస నిల్వ మట్టానికి ఎగువన 147.5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండగా, రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం 297 టీఎంసీలకు పైనే నీళ్లను కోరడం గమనార్హం.
మినిట్స్‌ను తిరస్కరిస్తున్నాం.. తెలంగాణ
త్రిసభ్య కమిటీ సమావేశంలో జరిగిన వాస్తవ చర్చలు, నిర్ణయాలేవీ.. కృష్ణా బోర్డు తమకు పంపిన మినట్స్ ప్రతిలో ప్రతిబింబించడం లేదని తెలంగాణ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మినట్స్‌ను అంగీకరించడం లేదని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) ఓపీ రమేశ్‌బాబు కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.


