ఆ రెండూ కుట్రలే! | CM Revanth Reddy Comments On Speaker Gaddam Prasad Kumar Issue | Sakshi
Sakshi News home page

ఆ రెండూ కుట్రలే!

Sep 10 2026 1:31 AM | Updated on Sep 10 2026 1:31 AM

CM Revanth Reddy Comments On Speaker Gaddam Prasad Kumar Issue

స్పీకర్‌ను, శుద్ధి పేరుతో దళితులను అవమానించటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది

వ్యూహకర్తలు, ప్రత్యక్షంగా అమలు చేసిన వారిపై కేసులు పెడతాం: అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి

విచారణ జరిపి జైలుకు పంపే ఏర్పాటు చేస్తాం 

విచారణాధికారిగా హైదరాబాద్‌ సిటీ పోలీసు జాయింట్‌ కమిషనర్‌ 

ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకే కుట్రలు 

ఫామ్‌హౌస్‌ భేటీలోనే వ్యూహరచన.. కేసీఆర్‌ అనుచరులను ఉన్మాదులుగా మార్చి ఉసిగొల్పారు 

దళితులను అవమానించిన ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలన్న సీఎం 

వారిలోని అహంకార, అంటరానితన భావాన్ని యాసిడ్‌తో శుద్ధి చేయాలా? అంటూ ప్రశ్న 

ప్రభుత్వం స్పీకర్‌కు పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను, ఆయన మాతృమూర్తిని కించపరిచి అవమానించటం,  అనంతరం ఆయనకు మద్దతుగా నిరసన తెలిపిన దళితులు నడిచిన ప్రాంతాన్ని శుద్ధి చేయటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలను కుట్రలుగానే పరిగణిస్తున్నామని చెప్పారు. ఇందుకు వ్యూహకర్తలు, ప్రత్యక్షంగా అమలు చేసిన వారిపై ఆయా సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, విచారణ జరిపి జైలుకు పంపే ఏర్పాటు చేస్తామని అన్నారు. ముంబయిపై దాడి చేసిన కసబ్‌ లాంటి ఉగ్రవాదులకు కొన్ని అంశాలను నూరిపోసి ఉన్మాదులుగా మార్చి మన దేశంపైకి పంపిన తరహాలోనే, కేసీఆర్‌ కూడా తన అనుచరులకు ఇలాగే నూరిపోసి ఉన్మాదులుగా మార్చి ఉసిగొల్పారని ఆరోపించారు. దాంతో పేట్రేగిన నేతలు ఆ రోజు దళిత స్పీకర్‌ను కించపరచటమే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆ కార్యక్రమానికి ముందురోజు ఫామ్‌హౌస్‌లో జరిగిన భేటీలో చేసిన కుట్ర మొదలు ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న ఘటనలపై సంపూర్ణ విచారణ చేపడతామన్నారు. హైదరాబాద్‌ సిటీ పోలీసు జాయింట్‌ కమిషనర్‌ విజయకుమార్‌ను విచారణాధికారిగా నియమిస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం శాసనసభలో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. కేసీఆర్‌ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన దళితులను అవమానించేలా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసినట్టుగా చెబుతున్న వ్యవహారంపై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చను ముగిస్తూ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు.   

కోర్టులు బెయిల్‌ ఇచ్చినా ప్రజలు బెయిల్‌ ఇవ్వరు 
‘చట్టాలు, సెక్షన్లను అడ్డుపెట్టుకుని కొంతమంది కోర్టుల నుంచి బెయిల్‌ పొందవచ్చు. కానీ తెలంగాణ సమాజం మాత్రం వారికి బెయిల్‌ ఇవ్వదు. జరిగిన తప్పును అంగీకరించి క్షమాపణ చెబితే కిరీటం ఊడిపోతుందా? స్థాయి తగ్గుతుందా? సభాపతిని అవమానించిన విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుంది. చట్టపరంగా శిక్షించే వరకు వెనక్కి తగ్గబోదు. సభాపతి పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్‌కుమార్‌ మనసుకు గాయం చేసేలా ఉన్మాదంతో వ్యవహరించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. వ్యక్తినే కాకుండా తల్లిని కూడా అవమానించే స్థాయికి వెళ్లారు. మహిళలను శక్తిగా కొలిచే సమాజంలో ఇలాంటి చర్యలకు చోటుంటుందా? సభలో అధికారులపై దాడులు చేయడంతోపాటు స్పీకర్‌ కుర్చీని అవమానించేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. 

దళితులపై అవమానకర చర్యలు 
స్పీకర్‌ను అవమానించిన ఘటనకు నిరసనగా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఫామ్‌హౌస్‌ వద్ద డప్పు దరువులతో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారే తప్ప ఎలాంటి ఉన్మాదానికీ పాల్పడలేదు. దళిత సోదరులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేసేందుకు డప్పును ఒక సాధనంగా ఉపయోగిస్తారు. నిరసన తెలిపిన దళిత ప్రతినిధులను పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉంది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించి, దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించడం ద్వారా దళితనులను తీవ్రంగా అవమానించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తే.. మరి దొరతనం, ఆహంకారంతో ఉన్న ఆ నేతల మనసుల్లో పేరుకుపోయిన అంటరానితన భావజాలాన్ని ఎలా శుద్ధి చేస్తారు? యాసిడ్‌తో కడగాలా? దళితుడు దుక్కి దున్ని పంట పండిస్తేనే అందరి కడుపులు నిండుతున్నాయి. మనకు అన్నం పెడుతున్న వారిని ఇంతగా అవమానిస్తారా? దళితులను అవమానపరుస్తూ వారిని కించపరిచిన ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలి. అప్పుడే వారికి దళితులు ఎదుర్కొంటున్న వివక్ష ఎలాంటిదో తెలిసొస్తుంది. 

ఖర్గేనూ అవమానించారు.. 
సమాజంలో అశాంతిని ప్రోత్సహించి రెండు వర్గాల మధ్య వైరాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు ధనబలంతో వ్యవస్థలను లొంగదీసుకోవాలని చూస్తున్నారు. మేము మాత్రం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్‌ పార్టీ దేశంలోని కోట్లాది ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించింది. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో పుట్టి, రజాకార్ల దాడుల్లో తల్లిని కోల్పోయి, కార్మిక నాయకుడిగా ఎదిగి జాతీయ స్థాయికి చేరుకున్న నేత మల్లికార్జున ఖర్గేను అవమానించడం బాధాకరం. ఉత్తరాఖండ్‌లోని ఓ మైదానంలో ఖర్గే సభలో పాల్గొన్న అనంతరం ఆగస్టు 10న బీజేపీ అనుబంధ సంస్థ అదే మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం హేయమైన చర్య. ఆ ఘటనను ఈ సభ ముక్తకంఠంతో ఖండిస్తోంది. తాజాగా తెలంగాణ వేదికగా బీఆర్‌ఎస్‌ దళిత వ్యతిరేక వ్యవహారానికి తెరలేపింది.  

వారిని వదిలే ప్రసక్తే లేదు.. 
విద్యా రంగంలోని అక్రమాలు, ధరణి అక్రమాలు, 22ఏ రాద్ధాంతంపై శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం భావించింది. ఈ అంశాలపై చర్చ జరిగితే గత పదేళ్లలో జరిగిన దురాగతాలు, రాష్ట్రంపై పేరుకుపోయిన అప్పుల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుందనే భయంతోనే చర్చను అడ్డుకునేందుకు ఈ కుట్రలు పన్నారు. సభను అడ్డుకోవడమే కాకుండా స్పీకర్‌ను అవమానించే స్థాయికి వెళ్లడం అత్యంత దురదష్టకరం. కాంగ్రెస్‌ పార్టీ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయానికి బాటలు వేసింది. కాంగ్రెస్‌ విధానం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడమే..’ అని సీఎం స్పష్టం చేశారు. స్పీకర్‌ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తి లేదని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే విషయంలో ప్రభుత్వం స్పీకర్‌కు పూర్తిగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement