సాక్షి,చెన్నై: సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూటమి ప్రభుత్వానికి అధికారిక పేరు ఖరారైంది. ఈ కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ అనే పేరును నిర్ణయించారు. ఈ విషయాన్ని టీవీకే చీఫ్ విజయ్, వీసీకే చీఫ్ తోల్ తిరుమావళన్, ఎండీఎంకే చీఫ్ వైకో, ఐయూఎంఎల్ నాయకులు మీడియా ముఖంగా వెల్లడించారు.
చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్, వీసీకే,ఎండీఎంకే, ఐయూఎంఎల్ పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలోనే తమిళనాడు కూటమి ప్రభుత్వానికి ఈ పేరును ఖరారు చేశారు.అయితే,అనూహ్యంగా ఈ సమావేశానికి విజయ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన వామపక్ష (లెఫ్ట్) పార్టీల నేతలు గైర్హాజరయ్యారు.
ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రెండవ కీలక సమావేశం ఇది. కూటమి నిర్మాణాన్ని అధికారికంగా ఖరారు చేయడంపై ఈ భేటీ ప్రధానంగా దృష్టి సారించింది. ఉమ్మడి కార్యక్రమంలో రూపకల్పన, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, కన్వీనర్ నియామకం,కూటమికి అధికారిక పేరును ఖరారు చేయడం వంటి ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు సమాచారం.
వామపక్ష పార్టీలు గైర్హాజరకు కారణం ఇదే
తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి సమావేశానికి సీపీఐ,సీపీఎం వంటి వామపక్ష పార్టీలు గైర్హాజరు కావడానికి ప్రధానంగా కొన్ని రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో అధికారికంగా భాగస్వాములు కాకుండా, కేవలం బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని లెఫ్ట్ పార్టీలు మొదటినుంచీ స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వంలో కేబినెట్ హోదా లేనప్పుడు, కూటమికి సంబంధించిన అధికారిక కమిటీలు లేదా నిర్మాణాత్మక ఒప్పందాలలో లాంఛనంగా పాల్గొనడం ఇష్టం లేక వీరు దూరంగా ఉంటున్నారు.
కార్మికులు, రైతులు, ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్ణయాలను స్వతంత్రంగా ప్రశ్నించే వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో లెఫ్ట్ పార్టీలు కూటమి పార్టీల సమావేశాలకు దూరంగా ఉంటున్నాయి. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు లేదా ఇతర పొత్తుల విషయంలో తమకంటూ ఒక స్వతంత్ర రాజకీయ వైఖరి ఉండాలని అవి కోరుకుంటున్నాయి.
జూలై 1న జరిగిన తొలి సమావేశానికి కూడా లెఫ్ట్ పార్టీలు గైర్హాజరయ్యాయి. ఇప్పుడు జరిగిన రెండవ కీలక సమావేశానికి కూడా వారు దూరంగా ఉండటం ద్వారా తమ వైఖరిని మరింత స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వానికి అసెంబ్లీలో ఉన్న మెజారిటీ దృష్ట్యా లెఫ్ట్ పార్టీల మద్దతు చాలా కీలకం. కేవలం విధానపరమైన అంశాలు, కూటమి అధికారిక నిర్మాణాల విషయంలోనే వారు ఈ దూరం పాటిస్తున్నారు
👉ఇదీ చదవండి : తమిళ రాజకీయంలో ‘ధనుష్’ వేడి


