విద్యా పరంగానూ, వృత్తి పరంగా మంచి సక్సెస్‌ని అందుకున్నప్పటికీ..అనూహ్యమైన యూటర్న్ తీసుకుని విభిన్నమైన కెరీర్‌ని ఎంచుకుని ఆశ్చర్యపరుస్తుంటారు. ముఖ్యంగా దేశ సేవ చేసే సైనిక రంగంలోకి అడుగపెట్టి తమ దేశభక్తిని చాటుకుంటుంటారు. అలా మంచి కార్పొరేట్ లైఫ్‌ని వద్దనుకుని ఈ రంగంలోకి వచ్చి శెభాష్ అనిపించుకుంటోంది అథిరా సురేష్.
కేరళకు చెందిన అథిరా సురేష్(Athira Suresh) ప్రతిష్టాత్మకమైన ఐఐటీ-జేఈఈలో ఉత్తీర్ణత సాధించి..ఎన్‌ఐటీ కాలికట్‌లో సివిల్ ఇంజనీర్ పూర్తిచేసింది. ఆ తర్వాత ఎక్సాన్‌మొబిల్‌లో ప్రాజెక్ట్ కంట్రోల్స్ ఇంజనీర్‌గా చేరింది. అక్కడితో ఆగిపోలేదామె. తన గమ్యం వేరే అంటూ..మరోదారిని ఎంచుకుంది. ఆ తర్వాత సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షకు హాజరై తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణ సాధించింది. ఆ తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ ఉమెన్ కోర్సు కింద ఓటీఏ గయాలో చేరింది.
సైన్యంలో చేరడానికి కారణం..
అందుకు ఆమె కుటుంబ నేపథ్యమే కారణం. ఎందుకంటే..ఆమె తండ్రి, నాయక్ సురేష్, పదవీ విరమణ తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో చేరడానికి ముందు కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో పనిచేశారు. తన తండ్రి సైనిక సేవ తనకు స్ఫూర్తినిచ్చిందని అతిరా చెప్పింది. ఆమె తల్లి సుమ ఒక ఉపాధ్యాయురాలు. ఇక్కడ మంచి ఆదాయం ఆర్జించే ఉద్యోగం సంపాదించినప్పటికీ అవేమి వద్దని సైనిక సైవ చేయాలనే ఉద్దేశ్యంతో తన బలాన్ని పరీక్షించుకుంటూ ఇందులోకి వచ్చిందని ఆర్మీ ట్రైనింగ్ ప్రశంసిస్తోంది.
అలా ఆమె సెప్టెంబర్ 5న ఓటీఏ గయాలో జరిగిన 29వ పాసింగ్ అవుట్ పరేడ్‌తో లెఫ్టినెంట్‌గా నియమితురాలైంది. గయా పరేడ్‌లో మొత్తం 35 మంది మహిళలతో సహా 253 మంది ఆఫీసర్ క్యాడెట్లు భారత సైన్యంలోకి నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వియత్నాం పీపుల్స్ ఆర్మీ జనరల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ లే వాన్ హుయోంగ్ ఈ కవాతును సమీక్షించారు.
అథిరాకు, ఈ కవాతు ఆమె వృత్తి జీవితంలోని ఒక అధ్యాయానికి ఎండ్ కార్డు, మరొకదానికి ప్రారంభంగాను నిలవడం విశేషం. ఇక్కడ సాధారణంగా సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్లు బహుళ జాతి కంపనీలో ఉద్యోగం చేయాలని కలలు కంటే అథిరా అవేమి వద్దని శారీరక శ్రమతో కూడిన సైనిక రంగంలో వృత్తిని ఎంచుకోవడంతో ఆమె కథ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది.
(చదవండి: Success Story: వెయిటర్ నుంచి.. 8 వేల కోట్లు టర్నోవర్ చేసే కంపెనీ సీఈఓగా!!)


