సైన్యంలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని భార్య ఆవేదన | wife says noida engineer detained in moscow hes told to join russian army | Sakshi
Sakshi News home page

సైన్యంలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని భార్య ఆవేదన

Sep 7 2026 5:50 PM | Updated on Sep 7 2026 6:25 PM

wife says noida engineer detained in moscow hes told to join russian army

మాస్కో: రష్యా నుంచి ఓ భారతీయ మహిళ చేసిన విజ్ఞప్తికి భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. తన భర్తను అక్కడి పోలీసులు అక్రమంగా నిర్భందించారని అక్కడి సైన్యంలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని సదరు మహిళ భారత్‌ ప్రభుత్వానికి ఎమెర్జెన్సీ కాల్‌ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీనికి స్పందించిన భారత ప్రభుత్వం అతని విడుదల కొరకు రష్యాలోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

బాధితురైలైన మహిళ ఇన్‌స్టా వేదికగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వీడియో చేసింది. అందులో "తన భర్త ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఇంజనీర్ చందన్ గుప్తా,  నోయిడాలోని  కంపెనీ ద్వారా జారీ చేయబడిన 'అత్యంత అర్హత కలిగిన నిపుణుడి' వీసాపై మా కుటుంబం మాస్కోలో ఉంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రష్యా పోలీసులు నా భర్తను అరెస్టు చేశారు. ఎలాంటి తప్పు చేయనప్పటికీ అతడిని జైలులో ఉంచారు.  ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి రష్యన్ సైన్యంలో చేరమని పోలీసులు తన భర్తపై ఒత్తిడి తెచ్చారు." అని సదరు మహిళ వీడియోలో ఆరోపించింది.

రష్యన్ సైన్యంలో సిబ్బంది కొరత ఉందనే నెపంతో, భారతీయులతో సహా విదేశీయులను దేశ సాయుధ దళాలలోకి బలవంతంగా చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొంది. తన భావోద్వేగ విజ్ఞప్తిలో, ఆ దంపతులకు పదేళ్ల కుమారుడు ఉన్నాడని, ఈ పరిస్థితితో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె తెలిపింది. తన భర్తను సురక్షితంగా విడుదల చేయించడానికి ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమె భారత ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ విషయమై రష్యాలోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

కాగా ఉక్రెయిన్‌- రష్యా మధ్య యుద్ధం మెుదలై దాదాపుగా నాలుగేళ్లు గడుస్తోంది. అయినప్పటికీ యుద్ధం ఇంకా ముగియలేదు. అయితే యుద్ధంలో పెద్దఎత్తున సైనికులు మృతిచెందడంతో రష్యాకు సైనికుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రష్యా ఉద్యోగాల పేరుతో ఆశ చూపి భారతీయులను రష్యాకు రప్పించి, ఆ తర్వాత రష్యా సైన్యంలోకి చేర్చుకుంటున్నారనే  ఆరోపణలు వస్తున్నాయి.

భారత్‌ సైతం దీనిపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకూ మెుత్తంగా 227 మంది భారతీయులు రష్యా సాయుధ దళాలలోకి చేరారని, వారిలో 139 మందిని విడుదల చేయగా, 51 మంది మరణించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగిలిన భారతీయులను సైతం త్వరగా విడుదల చేసి, తిరిగి రప్పించేందుకు భారత్ రష్యా పక్షంతో సంప్రదింపులు కొనసాగిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement