యుద్ధం తుపాకులతోనే కాదు.. ఇప్పుడు భాషతోనూ మొదలైంది! రష్యా దాడులతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌లో రష్యన్ భాషపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోని మూడో అతిపెద్ద నగరమైన ఒడెసాలో కళలు, సంగీతం, సాహిత్యంలో రష్యన్ భాషను బహిరంగంగా ఉపయోగించడాన్ని పూర్తిగా నిలిపివేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రష్యన్ మాట్లాడేవారు అధికంగా ఉన్న ఈ నగరంలో ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో, పుతిన్‌కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.
వీధులు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళా, వినోద ప్రదేశాల్లో రష్యన్ పాటలు, సాహిత్యాన్ని ప్రదర్శించకుండా చేయాలని ప్రతిపాదించారు. పబ్లిక్ లైబ్రరీల్లో రష్యన్ పుస్తకాలను ప్రముఖంగా ప్రదర్శించడంపైనా ఆంక్షలు రానున్నాయి. అయితే ఇళ్లలో లేదా ప్రైవేట్ ప్రదేశాల్లో వ్యక్తిగతంగా రష్యన్ మాట్లాడటంపై నిషేధం ఉండదు. రష్యన్ భాష ద్వారా మాస్కో తన సాంస్కృతిక ప్రభావాన్ని కొనసాగిస్తోందని ఉక్రెయిన్ భాషా ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యువతపై రష్యన్ సంగీతం, సాహిత్యం ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నవారు కూడా గట్టిగానే ఉన్నారు. రష్యన్ భాష కేవలం పుతిన్ భాష కాదని.. దొస్తొయెవ్‌స్కీ, బుల్గాకోవ్ వంటి ప్రముఖ రచయితల భాష కూడా అదే అని ఒడెసా హాస్య నటుడు బోరిస్ బార్స్కీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ను ప్రేమించే రష్యన్ మాట్లాడేవారిని దూరం చేయడం వల్ల చివరకు లాభపడేది పుతిన్ మాత్రమేనని అన్నారు. ఉక్రెయిన్‌లో ఇప్పటికే విద్య, ప్రభుత్వ సేవలు, కస్టమర్ సర్వీసులు వంటి అనేక రంగాల్లో ఉక్రేనియన్ భాష వినియోగం తప్పనిసరిగా ఉంది.
కాగా, 2022లో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించిన తర్వాత చాలామంది రష్యన్ మాట్లాడే ప్రజలు ఉక్రేనియన్ భాష వైపు మారారు. ఇప్పుడు ఒడెసాలో రష్యన్ భాషపై కొత్త ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం లభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. రష్యా ప్రభావాన్ని తుడిచేయడమా.. లేక భాషా స్వేచ్ఛను కాపాడడమా? అనే ప్రశ్నతో ఒడెసాలో రాజకీయ, సాంస్కృతిక పోరు మరింత ముదురుతోంది.
ఇదీ చదవండి: కోర్టు సంచలన తీర్పు.. టీవీ యాంకర్‌కు ఉరిశిక్ష


