వాషింగ్టన్: పశ్చిమాసియా రణరంగంలో ఇరాన్‌ను దౌత్యపరంగా, సైనిక పరంగా కట్టడి చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యూహాలు రచిస్తున్నారు. ఆ దేశాన్ని ప్రాంతీయంగా పూర్తిగా ఏకాకిని చేసేలా అమెరికా ఓ పద్మవ్యూహాన్ని సిద్ధం చేసినట్లు ‘యాక్సియోస్’ నివేదిక వెల్లడించింది.
‘యాక్సియోస్’ నివేదికలో.. ట్రంప్ ప్రధానంగా మూడు కీలక అంశాలపై దృష్టి సారించారు. ఇరాన్‌పై యుద్ధం ముగిసిన తర్వాత పశ్చిమాసియాలో ఇరాన్ ప్రభావానికి చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్, దాని పొరుగున ఉన్న అరబ్ దేశాలతో కలిసి ఒక బలమైన ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ కూటమికి అమెరికా పూర్తిస్థాయి భద్రతా హామీ ఇవ్వనుంది.
2023 అక్టోబర్ 7 నాటి దాడి తర్వాత మొదలైన సంక్షోభాన్ని సమర్థవంతంగా ముగించేందుకు ట్రంప్ బృందం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గాజా ప్రణాళిక తదుపరి దశను వేగవంతం చేయడం, ఇజ్రాయెల్ - సిరియా మధ్య కొత్త భద్రతా ఒప్పందాన్ని కుదర్చడం, ఇజ్రాయెల్ - లెబనాన్ ఒప్పందాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.
'అబ్రహం ఒప్పందాలను' మరింత విస్తరింపజేస్తూ ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించడమే ట్రంప్ ప్రధాన లక్ష్యం. ఇది సాకారమైతే పశ్చిమాసియా రాజకీయాల్లో అదొక మైలురాయిగా మారడమే కాకుండా, ట్రంప్‌కు దౌత్యపరంగా అతిపెద్ద విజయంగా నిలుస్తుంది.
ట్రంప్ వ్యూహాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, వీటి అమలుకు పలు రాజకీయ అడ్డంకులు ఎదురవుతున్నాయని యాక్సియోస్ పేర్కొంది. రాబోయే ఇజ్రాయెల్ సాధారణ ఎన్నికలు, అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం ఈ ప్రణాళికపై పడే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వేచి చూడకుండా, ఒకవేళ అక్కడ రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడినా తన వ్యూహంతో ముందుకు వెళ్లేందుకే ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు వెల్లడించారు.
కాగా, యుద్ధానంతరం పశ్చిమాసియాలోని మిత్రదేశాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో ట్రంప్ ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి.
👉ఇదీ చదవండి: ఇరాన్ పికాక్స్.. ట్రంప్‌కు ఎందుకంత పట్టుదల?


