ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది?.. ఆసియా అనే సమాధానం వినిపిస్తుంది, కనిపిస్తుంది. అయితే దానిని మార్చే ప్రయత్నాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఖండాల పరిమాణాలను మరింత వాస్తవికంగా చూపించే దిశగా ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని అమెరికా సహా ఆరు దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే..
సంప్రదాయ మెర్కేటర్ ప్రొజెక్షన్ స్థానంలో ‘ఈక్వల్ ఎర్త్’ (Equal Earth) ప్రొజెక్షన్‌ను ప్రోత్సహించే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తాజాగా ఆమోదించింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో 164 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా.. అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఆఫ్రికా ఖండాన్ని ప్రపంచ పటంలో వాస్తవ పరిమాణం కంటే చిన్నగా చూపిస్తున్నారనే వాదనల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంతకు ముందు.. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా ఇలా విస్తీర్ణం పరంగా ఖండాలు జాబితాలో వరుసగా ఉన్నాయి. అయితే ఐరాస తెచ్చిన కొత్త పటంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, ఓషియానియా తదితర ప్రాంతాలు వాటి అసలు భౌగోళిక విస్తీర్ణానికి మరింత దగ్గరగా కనిపిస్తాయి. ప్రపంచ భూభాగాల ప్రాతినిధ్యాన్ని మరింత కచ్చితంగా, సమతూకంగా చూపించడమే ఈ తీర్మానం ఉద్దేశం.
మ్యాప్‌ను చూస్తే మరోలా..
ప్రపంచ పటాలను చూస్తే ఆఫ్రికా కంటే యూరప్, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాలు పెద్దవిగా కనిపించడం చాలామందిలో అపోహకు కారణమవుతోంది. వాస్తవానికి ఆసియానే ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. భూభాగ పరంగా ప్రపంచ మొత్తం భూమిలో దాదాపు మూడో వంతు ఆసియాలోనే ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఆఫ్రికా ఉంటుంది. అయితే మెర్కేటర్ వంటి పటాల్లో ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న భూభాగాలు పరిమాణం కంటే చాలా పెద్దగా కనిపిస్తాయి. దీంతో ఖండాల అసలు విస్తీర్ణాలపై ప్రజలకు తప్పుడు అంచనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
మెర్కేటర్ పటంలో ఏం సమస్య?
1569లో ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ గెరార్డస్ మెర్కేటర్ రూపొందించిన మెర్కేటర్ ప్రొజెక్షన్ ప్రధానంగా సముద్ర ప్రయాణాలు, నావిగేషన్ కోసం ఉపయోగపడేలా రూపొందించారు. భూమి గోళాకారంగా ఉండగా.. దానిని చదునైన పటంగా చూపించాల్సి రావడంతో ఖండాల ఆకారాలు, పరిమాణాల్లో వక్రీకరణలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భూమధ్యరేఖకు దూరంగా వెళ్లే కొద్దీ భూభాగాలు వాస్తవ పరిమాణం కంటే పెద్దగా కనిపిస్తాయి. దీంతో యూరప్, ఉత్తర అమెరికా, రష్యా వంటి ప్రాంతాలు భారీగా కనిపిస్తుండగా.. ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాలు వాటి వాస్తవ విస్తీర్ణంతో పోలిస్తే చిన్నగా కనిపిస్తాయి. ఉదాహరణకు మెర్కేటర్ పటంలో గ్రీన్‌లాండ్ దాదాపు ఆఫ్రికా అంత పెద్దదిగా కనిపిస్తుంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్‌లాండ్ కంటే అనేక రెట్లు పెద్దది.
2018లో ‘ఈక్వల్ ఎర్త్’
ఈ వక్రీకరణలను తగ్గించేందుకు కార్టోగ్రాఫర్లు 2018లో ‘ఈక్వల్ ఎర్త్’ ప్రొజెక్షన్‌ను రూపొందించారు. భూమిపై ఖండాల వాస్తవ విస్తీర్ణాల మధ్య ఉన్న నిష్పత్తిని సాధ్యమైనంత వరకు పటంలోనూ కొనసాగించడమే దీని ప్రత్యేకత. దీంతో ఆఫ్రికా వంటి ఖండాలు ప్రపంచ పటంలో తమ అసలు పరిమాణానికి దగ్గరగా కనిపిస్తాయి.
అమెరికా తీవ్ర వ్యతిరేకత
అయితే ఐరాస తీర్మానంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిజమైన సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో 16వ శతాబ్దపు పటాలపై, వాటి ద్వారా పరిహారం (reparations), ‘కాగ్నిటివ్ జస్టిస్’ను ప్రోత్సహించడంపై చర్చించడం వల్లే ఐరాస తన విశ్వసనీయతను కోల్పోతోందని అమెరికా ప్రతినిధి యరీనా ఫెరెన్సెవిచ్ విమర్శించారు.
మరోవైపు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన టోగో విదేశాంగ మంత్రి రాబర్ట్ డస్సే మాత్రం పటాలు కేవలం భౌగోళిక చిత్రాలు మాత్రమే కాదని అన్నారు. అవి విద్యను ప్రభావితం చేస్తాయని, మన ఊహలకు రూపమిస్తాయని, ప్రపంచంపై సమష్టి అవగాహనను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. వాస్తవానికి భిన్నమైన పటాలు తరతరాలకు తప్పుడు అవగాహనను అందించే ప్రమాదం ఉందన్నారు.
ఫ్రాన్స్ కూడా మెర్కేటర్‌కు గుడ్‌బై
తీర్మానానికి సహ-మద్దతుదారుగా ఉన్న ఫ్రాన్స్ కూడా ఇకపై మెర్కేటర్ ప్రొజెక్షన్‌ను వదిలి కొత్త పటాన్ని ఉపయోగించనున్నట్లు ప్రకటించింది. మెర్కేటర్ పటంలో అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాతో పోలిస్తే పెద్దగా కనిపిస్తున్నాయని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ అన్నారు. “పటాలను మార్చడం వల్ల ప్రపంచం మారదు. కానీ వక్రీకరించిన ప్రాతినిధ్యాన్ని సరిదిద్దడం నిజాన్ని గుర్తించే చర్య” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆఫ్రికాలోని మాజీ ఫ్రెంచ్ వలస దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నిర్ణయం రావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: హవ్వా.. అబ్రహం లింకన్‌కు ఇదేం దుస్థితి?


