శ్రీలంక మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని మహింద రాజపక్సే కుటుంబానికి మరో భారీ షాక్ తగిలింది. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు.. అవినీతి కేసులు.. ఇప్పుడు అరెస్టుల దాకా వెళ్లాయి. ఆయన కుమారుడు, ప్రతిపక్ష ఎంపీ నమల్ రాజపక్సేను అవినీతి నిరోధక అధికారులు అరెస్టు చేశారు. ఎయిర్‌బస్ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా లంచంగా పొందారన్న అభియోగమే ఇందుకు కారణం.
2013లో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ కోసం జరిగిన 2.3 బిలియన్ డాలర్ల ఎయిర్‌బస్ డీల్‌పై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ ఒప్పందంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నమల్ రాజపక్సేకు 8 లక్షల డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) అందినట్లు శ్రీలంక అవినీతి నిరోధక కమిషన్ (CIABOC) కోర్టుకు తెలిపింది.
రెండు సింగపూర్ ఖాతాల ద్వారా..
దర్యాప్తు సంస్థల ప్రకారం.. శ్రీలంకకు చెందిన ఓ వ్యాపారి తన రెండు సింగపూర్ బ్యాంకు ఖాతాల ద్వారా నమల్ రాజపక్సేకు ఈ మొత్తాన్ని బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బు ఎయిర్‌బస్ డీల్‌లో ముడుపులుగా చెల్లించిన మొత్తంలో భాగమని అధికారులు కోర్టుకు వివరించారు. అయితే నమల్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు.
ఐదు గంటలకు పైగా విచారణ..
40 ఏళ్ల నమల్ రాజపక్సేను శుక్రవారం అవినీతి నిరోధక కమిషన్ ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేసి కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ అసంగ బొదరగమ ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆయనను సెప్టెంబర్ 18 వరకు రిమాండ్‌కు పంపింది. నమల్ తరఫు న్యాయవాది బెయిల్ కోరినా కోర్టు నిరాకరించింది.
మహింద రాజపక్సేను కూడా..
ఈ ఎయిర్‌బస్ డీల్ వ్యవహారంలో నమల్ తండ్రి, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను కూడా మే నెలలో అవినీతి నిరోధక అధికారులు ప్రశ్నించారు. ఆయన కూడా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపారు. అయితే రాజపక్సే కుటుంబం తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండిస్తూ.. ఇవన్నీ రాజకీయ కక్షతో చేస్తున్నవేనని చెబుతోంది.
ఒకప్పుడు శ్రీలంక రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన రాజపక్సే కుటుంబానికి గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2022 ఆర్థిక సంక్షోభం సమయంలో ప్రజా ఆగ్రహం నేపథ్యంలో మహింద రాజపక్సే ప్రధాని పదవికి రాజీనామా చేయగా.. ఆయన సోదరుడు గోటబయ రాజపక్సే దేశం విడిచి వెళ్లి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో నమల్ రాజపక్సే కూడా మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు ఎయిర్‌బస్ ఒప్పందంలో రూ.7 కోట్ల లబ్ధి పొందారన్న ఆరోపణలపై నమల్ అరెస్టవ్వడం.. రాజపక్సే కుటుంబానికి మరో భారీ ఎదురుదెబ్బగా మారింది.
ఇటు ఎయిర్‌బస్ సంస్థపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అధికారులు గతంలో జరిపిన దర్యాప్తులోనూ భారీ ముడుపుల వ్యవహారం వెలుగుచూసింది. 2020లో ఈ అవినీతి ఆరోపణల కేసును పరిష్కరించేందుకు ఎయిర్‌బస్ సుమారు 4 బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది. తాజా అరెస్టుతో శ్రీలంకలో రాజపక్సే కుటుంబానికి సంబంధించిన అవినీతి ఆరోపణలు మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
ఇదీ చదవండి: నా స్నేహితురాలికి అభినందనలు: మోదీ ట్వీట్ వైరల్


