breaking news
Namal Rajapaksa
-
‘నేను, మా నాన్న ఆయన సినిమాలకు ఫ్యాన్స్’
శ్రీలంక వెళ్లాలని భావిస్తున్న సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఆ దేశం వీసా నిరాకరించిందనే వార్తలు కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీలంక ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని వాటి సారాంశం. అయితే ఆ వార్తలను శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స తనయుడు నమల్ రాజపక్స కొట్టిపారేశారు. రజనీకాంత్‌కు శ్రీలంక ప్రభుత్వం వీసా నిరాకరించిందనడంలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. రజినీ సినిమాలకు తను పెద్ద అభిమానినని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘ప్రముఖ నటుడు రజినీకాంత్‌కు శ్రీలకం ప్రభుత్వం వీసా నిరాకరించదనేది కేవలం రూమర్ మాత్రమే. శ్రీలంకలోని ప్రజల మాదిరిగానే నేను, మా నాన్న రజినీకాంత్ సినిమాలకు చాలా పెద్ద అభిమానులం. ఒకవేళ ఆయన మా దేశాన్ని సందర్శించుకోవాలంటే ఎలాంటి అవాంతరాలు ఉండబోవని’ చెప్పారు. అయితే కొద్ది రోజుల క్రితం శ్రీలంక నార్తర్న్ ప్రొవిన్స్ మాజీ ముఖ్యమంత్రి సీవీ విఘ్నేశ్వరన్ రజనీకాంత్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీలంకలోని తమిళుల సమస్యలను ఆయన రజినీకాంత్‌తో చర్చించారు. ఈ భేటీ అనంతరం రజనీకాంత్ తమ దేశం రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా, ఇటీవల విడుదలైన రజనీకాంత్ దర్బార్ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సన్ పిక్చర్స్ బ్యానర్లో ‘తలైవార్ 168’ చిత్రంలో నటిస్తున్నారు. -
భారత్- శ్రీలంక: రాజపక్స కీలక వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడంలో ప్రత్యేక చొరవ చూపిస్తారని శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స తనయుడు, ఎంపీ నమల్ రాజపక్స అన్నారు. సరిహద్దు దేశాలతో సఖ్యతగా మెలిగేందుకు ఏమాత్రం వెనుకాడబోరన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. శ్రీలంక తాజా అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్స గెలుపొందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తన సోదరుడు మహిందా రాజపక్సను ప్రధానిగా ఆయన ఎంపిక చేశారు. 2005 నుంచి 2015 వరకు ప్రధానిగా ఉన్న మహిందాకు చైనాతో సత్సంబంధాలే ఉన్నాయి. ఆయన హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత అధ్యక్షుడు గోటబయ... ఎల్టీటీఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం, భారత్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండానే చైనాకు చెందిన జలాంతర్గాముల్ని హిందూ సముద్ర జలాల్లోకి అనుమతినివ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గోటబయ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక ఇటీవలి ఎన్నికల్లో శ్రీలంకలో మైనార్టీలుగా ఉన్న తమిళులు, ముస్లింలు అధికంగా ఉండే శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో గోటబయకు పెద్దగా ఓట్లు రాకపోవడంతో భారత్- లంక బంధంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీటీవీతో మాట్లాడిన రాజపక్స వంశీయుడు నమల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ భారత్- శ్రీలంక- చైనా దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి కొంతమంది తప్పుగా అన్వయిస్తున్నారు. నాయకుల్లో కూడా దీనిపై కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దు దేశాలతో బంధం మెరుగుపరచుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఆయన పొరుగు దేశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు’ అని పేర్కొన్నారు. అదే విధంగా శ్రీలంక రాజకీయ పరిణామాలపై తమిళనాడు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను నమల్ ఖండించారు. శ్రీలంక తమిళుల కోసం, వారి జీవనోపాధికై వారే ఏం చేశారని ప్రశ్నించారు. ‘ శ్రీలంక ఇప్పుడు సంక్షోభంలో ఉంది. 30 ఏళ్లుగా ఇక్కడ పాశవిక యుద్ధాలు జరిగాయి. ఎల్టీటీఈ ఈ యుద్ధాలను సింహళీయులు, తమిళుల మధ్య శత్రుత్వంగా చిత్రీకరించింది. ఇది దారుణమైన విషయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గోటబయ రాజపక్సను భారత్ పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందుకు అంగీకరించిన గోటబయ .. ‘ శ్రీలంకలో సుస్థిర ప్రభుత్వం భారత్‌కు కూడా ఎంతో ముఖ్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు రక్షణ పరంగా భారత్‌కు ఎలాంటి సవాళ్లు విసురుతాయనేది చర్చనీయాంశంగా మారింది. చైనా వ్యవహారశైలి.. అంతర్జాతీయ సమాజంలో అలజడి! మహేంద్ర రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, రేవులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం 700 కోట్ల డాలర్లకు పైగా రుణాలను తీసుకోవడంతో ఇప్పుడు చైనాతో సత్సంబంధాలు కొనసాగించక తప్పని పరిస్థితి. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో రుణాలు ఇచ్చి, వాటిని చెల్లించకపోతే విమానాశ్రయాలు, ఓడరేవుల్ని చైనా లీజుకి తీసుకోవడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన పుట్టిస్తోంది. యూరప్, ఆసియా మధ్య వాణిజ్య బంధాలకు ప్రతీకగా నిలిచిన దక్షిణ శ్రీలంకలో హమ్‌బటన్‌టోటా పోర్ట్ నిర్మాణానికి రుణాలు చెల్లించలేక 2017లో లంక ప్రభుత్వం 99 ఏళ్ల పాటు చైనాకు లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా శ్రీలంకకి ఉన్న అరుదైన పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చైనా చేస్తోంది. -
రజనీ టూరు: తమిళ నేతల అసలు రంగు బయటకు!
చెన్నై: తమిళసంఘాల ఆగ్రహంతో సూపర్ స్టార్ రజనీకాంత్ తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకోవడంపై ఆ దేశ రాజకీయ నాయకుడు నమాల్ రాజపక్సే అసంతృప్తి వ్యక్తం చేశారు. 'తమిళ రాజకీయ నాయకుల అసలు రంగు బయటపడింది. శ్రీలంకలోని తమిళులను ఆదుకునేందుకు రజనీకాంత్ సహా ఎవరినీ వారు ముందుకు రానివ్వరు' అంటూ ఆయన ట్వీట్ చేశారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే తనయుడైన నమాల్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తమిళ సంఘాల ఆగ్రహం నేపథ్యంలో తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్న విషయాన్ని రజనీ ఒక ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. వీసీకే చీఫ్ తిరుమావలవన్, ఎండీఎంకే చీఫ్ వైగో తదితరులు తనను శ్రీలంక వెళ్లొద్దని కోరారని, వాళ్లతో తనకున్న సంబంధాల దృష్ట్యా వారి కోరికను మన్నిస్తూ పర్యటనను రద్దు చేసుకున్నానని ఆయన తెలిపారు. విడుదతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే), మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) తదితర సంఘాల నాయకులు రజనీకాంత్‌ను కలిసి.. శ్రీలంక పర్యటనకు వెళ్లొద్దని కోరారు. వాస్తవానికి తాను తమిళుల నివాస ప్రాంతాలును చూసేందుకే శ్రీలంక వెళ్దామనుకున్నానని, అక్కడ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను కలిసి మత్స్యకారుల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అనుకున్నట్లు రజనీ తెలిపారు. తాను రాజకీయ నాయకుడిని కానని, కేవలం ఒక నటుడినేనని రజనీ అన్నారు. జ్ఞానం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీలంకలోని జప్నాలో తమిళ నిర్వాసితుల కోసం నిర్మించిన 150 కొత్త ఇళ్లను సూపర్ స్టార్ రజనీకాంత్ లబ్ధిదారులకు అందజేసేందుకు ఏప్రిల్ 9న ఆ దేశానికి వెళ్లాలని ఇంతకుముందు రజనీ భావించిన సంగతి తెలిసిందే.